తనయుడి తెరంగేట్రం కోసం స్టార్ హీరో తీవ్ర ప్రయత్నాలు..?

Update: 2022-06-21 04:18 GMT
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించారు. 'తుపాకి' 'సర్కార్' 'పోలీసోడు' 'విజిల్' 'అదిరింది' 'మాస్టర్' వంటిటాలీవుడ్ లోనూ మార్కెట్ ఏర్పరచుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు నేరుగా తెలుగు సినిమాతో పలకరించడానికి రెడీ అవుతున్నాడు. మరోవైపు తన కుమారుడు జాసన్ ను హీరోగా లాంచ్ చేయడానికి ప్రయత్నాలు మొదలు పెడుతున్నారని టాక్ వినిపిస్తోంది.

'ఇళయదళపతి' విజయ్‌ కొడుకు కూడా సినీ ఇండస్ట్రీలో అడుగుపెడతారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. విజయ్ సైతం గతంలో ఓ సందర్భంలో తనయుడి ఎంట్రీ గురించి హింట్ ఇచ్చాడు. జాసన్ సినిమాలే చేయాలని తాను అనుకోనని.. కుమారుడిపై తానెప్పుడూ ఒత్తిడి చేయనని తెలిపారు.

జాసన్ కి తనకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకునే హక్కు ఉందని.. అయితే తను యాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాడని విజయ్ చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా తాను సపోర్టు చేస్తానని తమిళ స్టార్ హీరో చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తనయుడి డెబ్యూ విషయంలో విజయ్ సీరియస్ గా ఆలోచిస్తున్నారని అంటున్నారు.

జాసన్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాడని.. అతని లాంచింగ్ ప్రాజెక్ట్ కోసం విజయ్ ఇప్పటికే స్క్రిప్ట్‌ లు వింటున్నాడని కొలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ చెబుతున్నాయి. కుదిరితే తనయుడి డెబ్యూ మూవీలో గెస్ట్ రోల్ చేయడానికి కూడా విజయ్ రెడీ అంటున్నారట.

తెలుగులో ఘనవిజయం సాధించిన 'ఉప్పెన' చిత్రాన్ని విజయ్ కొడుకుతో రీమేక్ చేస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు విజయ్ కొడుకు కోసం స్టోరీలు వింటున్నాడని అంటున్నారు. అందులో బెస్ట్ ని ఎంపిక చేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు.

ఏదేమైనా తలపతి అభిమానులు మాత్రం జాసన్ అరంగేట్రం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. లాంచింగ్ ప్రాజెక్ట్ గురించి వార్తలు వినాలనుకుంటున్నారు. మరి త్వరలోనే విజయ్ తన కుమారుడి ఎంట్రీ పై అధికారిక ప్రకటన చేస్తారేమో చూడాలి.

ఇక విజయ్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల విడుదలైన 'బీస్ట్' సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ ఓ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ లో రూపొందే ఈ మూవీతో తమిళ నటుడు టాలీవుడ్ లో అడుగుపట్టనున్నారు.

విజయ్ తన పుట్టినరోజు (జూన్ 22) సందర్భంగా Thalapathy66 చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ తో అభిమానులకు ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఈరోజు (జూన్ 21) సాయంత్రం 6:01 గంటలకు ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇక దీని తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నారు. ఇప్పటికే లోకేశ్ 'తలపతి67' గురించి హింట్ ఇచ్చారు. 'మాస్టర్' తర్వాత వీరిద్దరి కాంబోలో రానున్న ఈ ప్రాజెక్ట్ కోసం అందరూ ఆతృతగా వేచి చూస్తున్నారు.
Tags:    

Similar News