నెగెటివ్ అనే మాట ఇంత తియ్యగా ఉంటుందా?

Update: 2022-01-12 11:30 GMT
తెలుగు .. తమిళ భాషల్లో ఏక కాలంలో చక్రం తిప్పేసిన అందాల కథానాయికలలో త్రిష కూడా ఒకరుగా కనిపిస్తుంది. తెలుగులో కొత్త హీరోయిన్ల వలన త్రిషకి అవకాశాలు తగ్గి ఉండొచ్చు గానీ .. ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆమెను అదే స్థాయిలో అభిమానించేవారు .. ఆరాధించేవారు చాలామందే ఉన్నారు. కొన్ని పాత్రల ద్వారా ఆమె చూపించిన ప్రభావం అలాంటిది మరి. తెలుగులో 'వర్షం' సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ ఇప్పటికీ వర్షం పడుతుంటే త్రిషనే గుర్తుకు వస్తుంది. ఇక 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా?' చూసిన కుర్రాళ్లు, సిద్ధార్థ్ కంటే తాము బెటర్ గానే ఉన్నాం కదా అనుకున్నారు.

అంతలా త్రిష ఇక్కడి కుర్రాళ్ల మనసులను హోల్ సేల్ గా కొల్లగొట్టేసింది. ప్రస్తుతం తెలుగులో ఆమె జోరు తగ్గినప్పటికీ, తమిళంలో మాత్రం అదే ఊపు కంటిన్యూ అవుతోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న త్రిష, తనకి కరోనా రావడంతో ఉలిక్కిపడింది. కంగారు పడకుండా .. కాలు బయటికి పెట్టకుండా కామ్ గా ఉండటమే మంచిదనే ఉద్దేశంతో మందులు వాడుతూ ఇంటిపట్టునే ఉండిపోయింది. తనలో కరోనాకి సంబంధించిన అన్ని లక్షణాలు కనిపిస్తున్నాయనీ, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ దాని బారిన పడక తప్పలేదని కొన్ని రోజుల క్రితం త్రిష తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

10 రోజుల తరువాత త్రిష మళ్లీ ఇంట్లో నుంచి కాలు బయటికి పెట్టింది .. అలాగే తాజాగా మరో పోస్టు కూడా పెట్టింది. కాసేపటికి క్రితం నిర్వహించిన పరీక్షల్లో తనకి నెగెటివ్ అని వచ్చిందనీ, జీవితంలో ఫస్టు టైమ్ నెగెటివ్ అనే మాట విన్నప్పుడు చాలా ఆనందం కలిగిందని చెప్పింది. న్యూ ఇయర్ అనేది తనకి ఇప్పుడు మొదలైందనీ, ఇక ఈ ఏడాది అంతా కూడా రెట్టించిన ఉత్సాహంతో గడుపుతానని అంది. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్ధించిన వాళ్లందరికీ కూడా థ్యాంక్స్ అని చెబుతూ తాను కార్లో తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేసింది.

ఇక త్రిష ప్రస్తుతం తమిళంలో బిజీగానే ఉంది. దాదాపు ఆమె చేతిలో ఓ అరడజను సినిమాలు ఉన్నాయి. వాటిలో నాయిక ప్రధానమైన సినిమాలు కూడా ఉన్నాయి. వాటిలో మూడు సినిమాలు విడుదలకి ముస్తాబు కాగా, మిగతా సినిమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఒక మలయాళ సినిమా షూటింగు దశలో ఉంది. ఇక తెలుగులో ఆమె చివరి చిత్రం 'నాయకి' అనే చెప్పాలి. ఆ తరువాత ఆమె తెలుగు తెరపై కనిపించలేదు. ఇక్కడి సీనియర్ హీరోల జోడీగా అప్పుడప్పుడు ఆమె పేరు వినిపిస్తోందిగానీ వర్కౌట్ కావడం లేదు. ఈ ఏడాదిలోనైనా ఆమె తెలుగు సినిమా ఏదైనా చేస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News