నోరు విప్పిన నటి శాలు చౌరాసియా.. షాకింగ్ విషయాలు బయటకు

Update: 2021-11-18 05:04 GMT
మూడు నాలుగు రోజుల క్రితం నగరం నడిబొడ్డున ఉన్న కేబీఆర్ పార్కు వద్ద సినీ నటి శాలు చౌరాసియా మొబైల్ ఫోన్ చోరీ సందర్భంలో ఒక ఆగంతుకుడు దాడి చేసిన వైనం తెలిసిందే. అయితే.. దీనికిసంబంధించి అసలేం జరిగింది? అన్న విషయంపై స్పష్టత లేదు. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత అందుబాటులోకి రాలేదు.

మొబైల్ ఫోన్ చోరీ వేళ.. తనను గాయపరిచారని చెప్పిన ఆమె.. అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. తాజాగా ఆమె కొన్ని మీడియా సంస్థలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేబీఆర్ పార్కు వద్ద అసలేం జరిగింది? అన్న విషయాలపై స్పష్టత ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆమె చెప్పిన వివరాల్ని చూస్తే నోట మాట రాని పరిస్థితి. మొబైల్ చోరీ జరిగినట్లు బయటకు వచ్చిన దానికి వాస్తవానికి మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం. నిజానికి లక్కీగా ఆమె బయటపడింది కానీ.. లేదంటే దారుణ హత్యకు గురి కావాల్సిన పరిస్థితి. షాకింగ్ గా మారిన ఈ ఉదంతాన్ని శాలు మాటల్లోనే చూస్తే..
‘‘నేను రోజూ వాకింగ్‌ చేసేందుకు కేబీఆర్‌ పార్క్ కు వెళ్తా. ఆ రోజు కూడా సాయంత్రం ఆరు గంటలకు వెళ్లారు.

ప్రధాన గేటు వద్దకు రాగానే అమ్మ ఫోన్‌ చేసింది. దీంతో వాకింగ్‌ కాస్త ఆలస్యమైంది. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో నన్ను ఎవరో వెంబడిస్తున్నట్టు అనిపించింది. వాకర్‌ అనుకున్నా. చీకటి ఉన్న ప్రాంతం రాగా, ఆగంతుకుడు వెనుక నుంచి వచ్చి ముఖానికి క్లాత్ పెట్టాడు. తప్పించుకునేందుకు ప్రయత్నించా.

కింద పడేసి కొట్టాడు. మరింత చీకట్లోకి లాక్కెళ్లాడు. అరిచేందుకు ప్రయత్నించగా, తలను రాయికి కొట్టాడు. రెండు చేతులు వెనక్కి మడిచి పట్టుకొని పైకి లేపాడు. నేను సాయం కోసం అరిచాను. అరిచినప్పుడల్లా కొడుతూనే ఉన్నాడు. ధైర్యం తెచ్చుకొని హిందీలో డబ్బు కావాలా అని అడిగాను. వజ్రపు ఉంగరం ఇద్దామనుకున్నా’’ అని చెప్పారు.

ఆ తర్వాత జరిగింది చెబుతూ.. ‘‘ఆగంతుకుడు తెలుగులో మాట్లాడాడు. డబ్బులు కావాలన్నాడు. ఇస్తా.. పది వేలు ఇస్తానని చెప్పా. హిందీలో చెప్పిన నా మాటలు అతనికి అర్థం కాలేదు. ఎనిమిది వేలు అన్నాడు. అయితే.. గూగుల్ పే కానీ ఫోన్ పే ద్వారా ఇస్తానని చెప్పి ఫోన్ నెంబరు చెప్పమన్నా. అతనికి అర్థం కాలేదు. ఫోన్ ఓపెన్ చేసి డయల్‌ 100కు కాల్‌ చేసి కట్‌ చేశా. మళ్లీ మరోసారి చేసి కట్ చేశా. అలా చేయటం ద్వారా నా పరిస్థితిని పోలీసులకు తెలిసే ప్రయత్నం చేయాలని భావించా. రెండో సారి కాల్ చేయటంతో అతడికి అనుమానం వచ్చింది. బలంగా ఫోన్ లాక్కున్నాడు. విచక్షణారహితంగా కొట్టాడు.

బండరాయికి తల బాదడంతో స్పృహ తప్పినంత పని అయింది. అపస్మారక స్థితికి వెళ్లినట్లు అనిపించింది’’ అని చెప్పారు.

‘‘నా ప్రాణం పోవటం ఖాయమనిపించింది. నా ప్రైవేట్ పార్ట్స్ ను తాకి.. లైంగిక దాడికి ప్రయత్నించినట్లుగా అనిపించింది. వెంటనే అలెర్టు అయ్యా. ప్రాణం పోయినా సరే అతడికి లొంగకూడదని నిర్ణయించుకున్నా. అదే సమయంలో ఆ ఆగంతుకుడు అక్కడే ఉన్న పెద్ద బండరాయి తీసి, ‘నిన్ను చంపేసి.. తగుల బెడతా’ అంటూ రాయి విసిరాడు. అప్పటికే కదలలేని స్థితిలో ఉన్నాను. కష్టపడి పక్కకు జరిగాను.

లేదంటే ఆ రాయికి బలి అయ్యేదాన్ని. ఒంట్లోని శక్తిని అంతా కూడగట్టుకొని.. బలంగా అతని ప్రైవేట్ పార్ట్ ను మీద కొట్టా. బాధతో విలవిలలాడాడు. నాకు తప్పించుకునే అవకాశం లభించింది. కదల్లేని స్థితిలో ఉన్నా పరుగు తీసే ప్రయత్నం చేశా. కాలు సహకరించలేదు. ఫ్యాక్చర్ అయినట్లుగా అనిపించింది’’ అని వెల్లడించారు.

‘‘కొద్ది దూరం వచ్చాక మొయిన్ రోడ్డు కనిపించింది. గేటు వరకు పరిగెట్టాలనుకున్నా. కానీ అతను వెంబడిస్తున్నాడు. మొయిన్ గేట్ దూరంగా ఉండటంతో.. తొమ్మిది అడుగులు ఉన్న ఫెన్సింగ్ ఎక్కి దూకాలని ప్రయత్నించి.. ప్రాణ భయంతో ఎక్కే ప్రయత్నంలో ఒకసారి కింద పడ్డా. రెండో ప్రయత్నంలో ఎక్కి.. సాయం కోసం పెద్దగా అరిచాను. వెలుతురు లేకపోవటంతో నేను కనిపించలేదు. కళ్ల ముందే ఆటోలు.. వాహనాలు వెళుతున్నాయి.

ధైర్యం చేసి కిందకు దూకేశా. కింద పడ్డాక.. రోడ్డు మీద వెళుతున్న వారు చూసి దగ్గరకు వచ్చా. నా సెల్ ఫోన్ తో ఆగంతుకుడు పారిపోయాడు. ఏం జరిగిందని అడిగారు. జరిగింది చెప్పాను.ఎదురుగా ఉన్న స్టార్ బక్స్ వద్ద ఉన్న డ్రైవర్లు వచ్చారు. వారి ఫోన్ నుంచే పోలీసులకు.. ఇంట్లోని వారికి సమాచారం ఇచ్చాను. తెలంగాణ పోలీసులు చాలా వేగంగా స్పందించారు.

నిమిషాల్లో నాలుగు టీంలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ఆగంతకుడి ముఖం చూలేదు. కానీ.. అతడి మాటను తప్పకుండా గుర్తు పడతా’’ అంటూ ఆ రోజు జరిగిన దారుణాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పారు.
చౌరాసియా మాటలు విన్న తర్వాత ఇంత జరిగిందా? అన్న షాక్ కలుగక మానదు. ఎందుకంటే.. పోలీసులు మొబైల్ చోరీ ప్రయత్నంగానే చెప్పారు కానీ.. జరిగిన వివరాల్ని వెల్లడించలేదు.

ఇదిలా ఉంటే.. ఈ కేసుకుకీలకమైన సీసీ కెమేరాల ఫుటేజ్ విషయానికి వస్తే.. ఆ చుట్టుపక్కల ఉన్న 64 సీసీ కెమేరాలు పని చేయకపోవటంతో నిందితుడ్ని పట్టుకోవటం ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది.
Tags:    

Similar News