ఆ సినిమాను కాపాడేవాళ్లే లేరా?

Update: 2016-06-07 07:38 GMT
బాలీవుడ్లో ఏదైనా సినిమా గురించి వివాదం మొదలైతే.. అది దానికి ప్లస్ పాయింట్ గానే భావిస్తారు. వివాదాలతో పబ్లిసిటీ చేసుకోవడం అక్కడి ఫిల్మ్ మేకర్స్ కు వెన్నతో పెట్టిన విద్య. ‘ఉడ్తా పంజాబ్’ విషయంలో కొన్ని రోజుల ముందు వివాదం మొదలైనపుడు ఆ సినిమా దర్శక నిర్మాతలు కూడా హ్యాపీగానే ఫీలై ఉంటారు. కానీ ఈ వివాదం ఇప్పుడు పబ్లిసిటీగా మారే స్థాయిని దాటిపోయి.. అసలీ సినిమా విడుదలే కాకుండా చేసేలా కనిపిస్తోంది. కొన్ని రోజుల కిందట ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించి తీవ్ర విమర్శల పాలైన సెన్సార్ బోర్డు.. ఆ తర్వాత వెనక్కి తగ్గినట్లు కనిపించినా.. తనదైన శైలిలో మెలిక పెట్టింది. సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తున్నాం అని చెప్పి.. 40 కట్స్ చెప్పింది.

40 కట్స్ అంటే ఇక సినిమా ఏం మిగులుతుంది అంటూ.. రివైజ్డ్ కమిటీ దగ్గరే తేల్చుకుంటాం అంటూ సెన్సార్ బోర్డును సవాల్ చేసిన ‘ఉడ్తా పంజాబ్’ దర్శక నిర్మాతలకు అక్కడ ఇంకా పెద్ద షాక్ తగిలింది. సెన్సార్ బోర్డు మీ విషయంలో మరీ ఉదారంగా వ్యవహరించింది అంటూ.. వాళ్లు ఏకంగా 89 కట్స్ చెప్పారట. దెబ్బ తగిలిందని మందు అడిగితే కారం రాసినట్లుంది ఈ వ్యవహారం. ఇప్పుడిక ‘ఉడ్తా పంజాబ్’ మేకర్స్ ముందు ఇంకో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాతి ప్రయత్నంగా ట్రైబ్యునల్ ను ఆశ్రయించాలి. వాళ్లు కూడా కోతలు తప్పవంటే.. చివరకు కోర్టుకెక్కాలి.

ఐతే సినిమా విడుదలకు ఇంకో పది రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ లోపు వ్యవహారం కొలిక్కి రావడం అంటే కష్టంగానే ఉంది. అలాగని సెన్సార్ వాళ్లు అభ్యంతర పెట్టిన సన్నివేశాలన్నీ తీసేసి.. డైలాగులు మ్యూట్ చేస్తే సినిమా నాశనం అయిపోతుంది. మరోవైపు ‘ఉడ్తా పంజాబ్’ అని పేరు పెట్టుకుని తమ రాష్ట్రంలో జరిగే డ్రగ్స్ కార్యకలాపాలన్నింటినీ చూపిస్తున్నారన్న కారణంతో అసలీ సినిమాను తమ రాష్ట్రంలో బ్యాన్ చేసేయాలని నిర్ణయించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఇలాంటి స్థితిలో ‘ఉడ్తా పంజాబ్’ అసలు థియేటర్లలోకి వస్తుందా రాదా అన్నది అనుమానంగా మారింది.
Tags:    

Similar News