వార్నీ ఆ హీరోకు రూ.30 కోట్లా?

Update: 2016-01-04 10:57 GMT
మొన్నే మెగాస్టార్ చిరంజీవి రెమ్యూనరేషన్ గురించి ఓ తమాషా వార్త టాలీవుడ్ లో హల్ చల్ చేసింది. చిరు హీరోగా తన రీఎంట్రీ మూవీకి రూ.30 కోట్ల పారితోషకం తీసుకుని టాలీవుడ్ హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్టుగా రికార్డు సృష్టించబోతున్నాడన్నది ఆ వార్త సారాంశం. కానీ ఆ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాత కాబట్టి తన తండ్రికి 30 కోట్లిస్తే ఏంటి.. 50 కోట్లిస్తే ఏంటి.. ఏదైనా లెక్కలోకి రాదు. వేరే నిర్మాతలెవరైనా ఆ మొత్తం ఇస్తే అదీ అసలైన రికార్డు. ఇక మన చిరు సంగతి పక్కనబెట్టేస్తే ఓ కోలీవుడ్ స్టార్ హీరో ఈ రూ.30 కోట్ల పారితోషకమే తీసుకుని రికార్డు సృష్టించబోతున్నాడన్నది తాజా కబురు. ఆ హీరో మరెవరో కాదు.. అల్టిమేట్ స్టార్ అని, తల అని తమిళ అభిమానులు ముద్దుగా పిలుచుకునే అజిత్.

గత రెండేళ్లలో ఆరంభం - వీరం - ఎన్నై అరిందల్ - వేదాలం లాంటి సూపర్ హిట్లు కొట్టి పోటీలో ఉన్న హీరోల్ని దాటి ముందుకెళ్లిపోయాడు అజిత్. అందులోనూ అజిత్ కొత్త సినిమా వేదాలం.. ఏవరేజ్ టాక్‌తోనే రూ.100 కోట్లు కొల్లగొట్టేసింది. వరదల సమయంలోనూ ఈ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు సాధించ అజిత్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో రుజువు చేసింది. ‘వేదాలం’ మూవీకి అజిత్ రూ.22 కోట్ల దాకా పారితోషకం తీసుకున్నట్లు అంచనా. కాగా తన తర్వాతి సినిమాకు ఆయన రూ.30 కోట్లు పుచ్చుకుంటున్నాడట. ఐతే అది అజిత్ డిమాండ్ చేస్తే ఇస్తున్న పారితోషకం కాదు. అతడితో సినిమా చేయబోతున్న నిర్మాతలు ఆఫర్ చేసిన రెమ్యూనరేషనే ఇది. ఐతే ఈ చిత్రానికి దర్శకుడెవరన్నది కూడా ఇంకా నిర్ణయం కాలేదు. ముందు అజిత్‌కు ఈ పారితోషకం ఆఫర్ చేసి సినిమా కాల్ షీట్లు తీసుకున్నాక మిగతా సంగతులు చూస్తారట. ప్రస్తుతం వెకేషన్లో ఉన్న అజిత్ సంక్రాంతి తర్వాత తన కొత్త సినిమా మొదలుపెడతాడు. ఐతే రూ.30 కోట్లు తీసుకున్నప్పటికీ అజిత్ కోలీవుడ్ నెంబర్ వన్ ఏమీ కాదు. రజినీకాంత్ సౌత్ ఇండియాలో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఆయన పారితోషకం రూ.50 కోట్ల పైనే అని అంచనా.

Tags:    

Similar News