బాబూ అఖిల్.. ఇది కాదమ్మా కావాల్సింది

Update: 2018-12-24 13:47 GMT
తెలుగులో మరే వారసుడి సినిమాకూ రానంత హైప్ వచ్చింది అక్కినేని అఖిల్ తొలి సినిమా ‘అఖిల్’కు. ఏకంగా రూ.40 కోట్ల బడ్జెట్.. అదే స్థాయిలో బిజినెస్.. ఇదంతా చూసి అఖిల్ నేరుగా పెద్ద స్టార్ అయిపోతాడని అనుకున్నారు. కానీ ఆ సినిమా దారుణమైన ఫలితాన్నందుకోవడంతో అఖిల్ కెరీర్ కు పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. ఐతే రెండో సినిమా ‘హలో’ విషయంలో అఖిల్ తండ్రి నాగార్జున అన్నీ తానై వ్యవహరించాడు. అతడిని రీలాంచ్ చేస్తున్నట్లు చెప్పాడు. కానీ విక్రమ్ కుమార్ లాంటి మంచి దర్శకుడు కూడా ఈ చిత్రాన్ని నిలబెట్టలేకపోయాడు. ఆ సినిమా కూడా పోయింది. ఇప్పుడు అఖిల్ ఆశలన్నీ ‘మిస్టర్ మజ్ను’ మీదే ఉన్నాయి.

‘తొలి ప్రేమ’తో సత్తా చాటిన వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకు కాస్త బజ్ ఉంది కానీ.. పెద్ద అంచనాలైతే లేవు. ఈ సినిమా కోసం అఖిల్ సిక్స్ ప్యాక్ కూడా చేశాడట. తాజాగా తన చిజిల్ బాడీని చూపిస్తూ ఒక పోస్టర్ వదిలాడు. అందులో అఖిల్ బాడీ షేప్ చాలా బాగుంది. కానీ సినిమాలు ఆడాలంటే కావాల్సింది సిక్స్ ప్యాక్స్ కాదు. అందం కాదు.. డ్యాన్సులు.. ఫైట్లలో ఈజ్ కాదు. అఖిల్ ఇవన్నీ చూపించాడు కానీ.. మంచి సినిమా మాత్రం అందించలేకపోయాడు. ‘మిస్టర్ మజ్ను’ అయినా కంటెంట్ పరంగా బలంగా ఉంటుందా లేదా అన్నదానిపైనే సినిమా పలితం ఆధారపడి ఉంటుంది. అదనపు ఆకర్షణల సంగతి వదిలేసి కంటెంట్ విషయంలో గ్యారెంటీ ఇస్తేనే సినిమాలు ఆడతాయనే విషయాన్ని అఖిల్ గ్రహించాలి. ‘మిస్టర్ మజ్ను’ ఆ గ్యారెంటీ ఇస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News