ప్రతిష్టాత్మక మూవీకి కాపీ చిక్కులు

Update: 2018-11-22 11:46 GMT
బాలీవుడ్‌ లో గత కొన్ని రోజులుగా ‘మిషన్‌ మంగళ్‌’ అనే చిత్రం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. ఇంకా చిత్రీకరణ ప్రారంభం కాకున్నా కూడా అప్పుడే సినిమాపై అంచనాలు భారీగా పెరిగి పోయాయి. ఎందుకంటే ఈ చిత్రంలో అక్షయ్‌ కుమార్‌ తోపాటు విద్యాబాలన్‌ - సోనాక్షి సిన్హా - తాప్సీ - నిత్యామీనన్‌ - కృతి కర్బంద - శర్మాన్‌ జోషి వంటి స్టార్స్‌ నటించడమే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చాలా స్పీడ్‌ గా జరుగుతున్న ఈ చిత్రంను అతి త్వరలోనే పట్టాలెక్కించాలని దర్శకుడు జగన్‌ శక్తి భావిస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఈ చిత్రం నిలిపేయాలంటూ ముంబయి హైకోర్టులో పిటీషన్‌ నమోదు అయ్యింది.

యూఎస్‌ కు చెంది దర్శకురాలు రాధా భరద్వాజ్‌ తాను రాసుకున్న స్క్రిప్ట్‌ ను ఉన్నది ఉన్నట్లుగా హిందీలో ‘మిషన్‌ మంగళ్‌’ గా చిత్రీకరిస్తున్నారని - వెంటనే ఆ సినిమాను ఆపేయాలంటూ కోర్టును ఆశ్రయించింది. 2014 లో జరిగిన మామ్‌ ప్రయోగం నేపథ్యంలో సాగే కథతో ‘మిషన్‌ మంగళ్‌’ ఉంటుందని, ఆ సమయంలో ఉమెన్‌ ఇంజనీర్లు మనోభావాలు ఏంటీ, వారి ప్రవర్తన ఎలా ఉంటుందనేది ఈ చిత్రంలో చూపించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. ‘మిషన్‌ మంగళ్‌’ ప్రకటన చూడగానే షాక్‌ అయ్యానని - తన కథను ఎలా వారు ఎలా తీస్తారంటూ రాధా భరద్వాజ్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

2016లో రాధా భరద్వాజ్‌ ఈ చిత్రాన్ని అతుల్‌ కాస్బేకర్‌ కు ఈ కథను వినిపించిందట. అగ్రిమెంట్‌ కూడా  అయ్యిందట. కాని కొన్ని కారణాల వల్ల సినిమా క్యాన్సిల్‌ అయ్యిందట. యూఎస్‌ లో 2016లో తన స్టోరీకి కాపీ రైట్‌ కూడా తీసుకున్నట్లుగా ఆమె చెబుతోంది. దాంతో ‘మిషన్‌ మంగళ్‌’ మొదలవ్వడం అనుమానమే అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్‌ సభ్యులు రాధా భరద్వాజ్‌ తో చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Tags:    

Similar News