సౌత్ నుంచి మేం నేర్చుకోవాలి-అక్షయ్

Update: 2017-10-28 07:38 GMT
దక్షిణాది సినీ పరిశ్రమ మీద బాలీవుడ్ వాళ్ల ప్రశంసలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ‘బాహుబలి’తో అసోసియేట్ అయినప్పటి నుంచి సౌత్ ఇండస్ట్రీని తెగ పొగిడేస్తున్నాడు. ఈ ఏడాది సౌత్ నుంచి మంచి మంచి సినిమాలు వచ్చిన నేపథ్యంలో ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ కూడా బాలీవుడ్.. సౌత్ నుంచి పాఠాలు నేర్చుకోవాలని అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు సీనియర్ హీరో అక్షయ్ కుమార్ సైతం సౌత్ ఇండస్ట్రీని ఆకాశానికెత్తేశాడు. బాలీవుడ్ వాళ్లందరూ సౌత్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని అభిప్రాయపడ్డాడు. తాను ఇప్పటిదాకా 130 సినిమాలు చేశానని.. వాటితో ఎంత నేర్చుకున్నానో.. దక్షిణాది సినిమా ‘2.0’ అంత నేర్చుకున్నానని అక్షయ్ చెప్పడం విశేషం.

‘‘సౌత్ సినిమా నుంచి నేర్చుకోవడానికి చాలా ఉంది. ఇక్కడి వాళ్ల పనితీరు చాలా బాగుంటుంది. ఐకమత్యంతో పని చేస్తారు. ఒకరి టాలెంటును మరొకరు గుర్తిస్తారు. పరస్పరం గౌరవం ఇచ్చి పుచ్చుకుంటారు. మేం (బాలీవుడ్) ఇవన్నీ చూసి చాలా నేర్చుకోవాలి. నేను ఇప్పటిదాకా 130 సినిమాలు చేశా. ‘2.0’ నా 131వ సినిమా. ఇప్పటిదాకా చేసిన ప్రతి సినిమా నుంచి ఎంతో కొంత నేర్చుకున్నా. కానీ ‘2.0’ విషయంలో మాత్రం ఆరంభం నుంచి చివరిదాకా నేర్చుకుంటూనే ఉన్నా. రజినీకాంత్ సార్ నిజమైన సూపర్ స్టార్. ఆయన లాంటి దిగ్గజంతో పని చేసే అవకాశం నాకు కల్పించినందుకు శంకర్ సార్‌ కు నా ధన్యవాదాలు. ‘2.0’ లాంటి భారీ సినిమాలో నేను నటిస్తానని ఎన్నడూ ఊహించలేదు’’ అని అక్షయ్ ‘2.0’ ఆడియో వేడుకలో అన్నాడు.
Tags:    

Similar News