బాలకృష్ణగారికి బయట నటించడం రాదు: అల్లు అరవింద్

Update: 2021-10-15 03:55 GMT
తెలుగు ఓటీటీ మాధ్యమంగా 'ఆహా' దూసుకుపోతోంది. సినిమాలు .. వెబ్ సిరీస్ లు .. సరికొత్త కాన్సెప్ట్ లతో కూడిన కార్యక్రమాలతో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. 'ఆహా'కు మరిన్ని హంగులు జోడించాలనే ఆసక్తితో అల్లు అరవింద్ కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన ఒక టాక్ షో చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ టాక్ షోకి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తే బాగుంటుందని భావించి, వెంటనే దానిని ఆచరణలో పెట్టారు. 'అన్ స్టాపబుల్' అనే టైటిల్ తో బాలకృష్ణ ఈ ఓటీటీ వేదికపై సందడి చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కర్టెన్ రైజర్ నిన్న జరిగింది. ఈ వేదికపై అల్లు అరవింద్ మాట్లాడారు.

" ఈ రోజున నాకు చాలా సంతోషంగా ఉంది. బాలకృష్ణ గారు గొప్పనటుడు అని మీరు అనుకుంటున్నారు గదా .. అది తెరమీద. బయట ఆయన నటుడు కాదు .. జీవిస్తూ ఉంటారు. ఆయనకి కోపం వస్తే కోపం .. సంతోషం వస్తే సంతోషం ఏవొస్తే అది నటించకుండా చూపించే ఒక మనస్తత్వం. అలాంటి ఒక రియల్ ఎమోషన్స్ ను చూపించగల మనుషులు, అలాంటి ఒక టాక్ షో చేస్తే ఎలా ఉంటుందనేది మీరు ఊహించుకోవచ్చు. ఎదుటివ్యక్తిలో నుంచి ఎలాంటి ఎమోషన్స్ ను తీసుకోవచ్చు .. వాళ్లతో ఏం చెప్పిస్తే జనానికి రక్తి కట్టించేలా ఉంటుందనేది ఆయనకి బాగా తెలుసు.

నేను మా టీమ్ ను కూర్చోబెట్టి బాలకృష్ణతో ఒక టాక్ షో చేస్తే ఎలా ఉంటుందని అడిగినప్పుడు, వెంటనే వాళ్లంతా సంతోషంతో అరిచారు. చాలా బాగుంటుందని ఎగ్జైట్ అయ్యారు. అయితే ఇప్పుడే ఆయనను అడుగుతాను అని బాలకృష్ణ గారికి కాల్ చేశాను. ఆ సమయంలో ఆయన 'అఖండ' షూటింగులో ఉన్నారు. ఆయన ఈ షో చేయడానికి అంగీకరించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 'ఆహా' గురించి కొంత చెప్పకుండా ఇక్కడి నుంచి నేను వెళ్లలేను. 'ఆహా' ఈ రోజున 1.5 మిలియన్ సబ్ స్కైబర్స్ ను కలిగి ఉంది. ఈ ఏడాది చివరికి 2 మిలియన్ సబ్ స్కైబర్స్ ఉండాలనే ఒక టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నారు.

'ఆహా' సక్సెస్ ను ఇప్పుడు ఇండియా అంతటా ఆశ్చర్యపోతూ చూస్తున్నారు. అనేక లాంగ్వేజెస్ ను మిక్స్ చేసిన పెద్ద పెద్ద సంస్థలు కూడా పొందలేని కొన్ని నెంబర్స్ 'ఆహా'కు వస్తున్నాయి. అది కేవలం తెలుగు వారి ఉత్సాహానికి .. ఆదరణకు ఒక ఉదాహరణ. ఎంటర్టైన్మెంట్ కి తెలుగువారు ఇచ్చే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఇండియాలో హిందీ పరిశ్రమ చాలా గొప్పది అనుకునెవరు. తెలుగువాడు .. తెలుగు సినిమా అంటే ఒక గౌరవంతో చూస్తున్నారు. నాకు ఇదివరకటి చూపులూ తెలుసు .. ఇప్పటి చూపులు తెలుసు.

అంతగా మన ఇండస్ట్రీ ఆల్ ఇండియా సౌండ్ చేసింది. అన్ని చిత్రపరిశ్రమలకన్నా తెలుగు చిత్రపరిశ్రమ గొప్పది అనే విషయం వాళ్లందరికీ అర్థమైపోయింది. అందుకు కారణం ఇక్కడి ప్రేక్షకుల ప్రోత్సాహం. ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు తెలుగులోనే ఎక్కువగా తయారవుతున్నాయి .. హిందీలో కూడా కాదు. తెలుగు సినిమాను ఆల్ ఇండియాలోని వాళ్లంతా చూసేలా 'బాహుబలి' చేయగలిగింది. అక్కడి నుంచి ఒక వేవ్ మారిపోయి గౌరవంతో చూస్తున్నారు. ఆ గౌరవాన్ని నిలబెట్టే పద్ధతిలోనే 'ఆహా' ఉంటుందని నేను మాట ఇస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.



Tags:    

Similar News