లోగో లతో ఏం మెసేజ్ ఇస్తున్నారు నోటా?

Update: 2018-10-04 07:49 GMT
థియేటర్లో ప్రదర్శించే సినిమాపై ఆన్ లైన్ డిజిటల్ మూవీ ప్రభావం చాప కింద నీరులా ఎలా పాకుతోందో చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు దూరదర్శన్ లో ఏదైనా సినిమా రావాలి అంటే ఆరు నెలల నుంచి ఏడాది పైగానే పట్టేది. శాటిలైట్ విప్లవం వచ్చాక అది కాస్త మూడు నెలల దాకా కుదించుకుపోయింది. ఇది కూడా సరిపోవడం లేదని భావించి కొన్ని ఛానల్స్ ఏకంగా అర్థ శతదినోత్సవం కూడా జరుపుకోకుండానే టీవీలో వేసే సంప్రదాయానికి తెరతీశారు. కానీ లైఫ్ మెకానికల్ గా మారిపోయి టైం చాలా విలువైందిగా భావించే ఇప్పటి తరంలో విపరీతమైన యాడ్స్ ని భరిస్తూ గంటల కొద్దీ టీవీల ముందు కూర్చునే ఓపిక రాను రాను తగ్గిపోతోంది.

దీనికి సరైన పరిష్కారంగా ముందుకు వచ్చింది ఆన్ లైన్ వీడియో స్ట్రీమింగ్. అంచనాలు తలకిందులు చేస్తూ అమెజాన్ ప్రైమ్ ఇందులో దూసుకుపోతోంది. ఈ ఏడాది వచ్చిన టాప్ హిట్స్ రంగస్థలం-భరత్ అనే నేను-మహానటి-భాగమతి-గూఢచారి-ఆరెక్స్ 100 అన్ని ఇందులో ఉన్నాయి. ఓ వేయి రూపాయలు కట్టేస్తే చాలు ఏడాది పొడవునా అన్ని బాషా సినిమాలు ఫ్రీగా చూసే వెసులుబాటు ఇందులో ఉంటుంది. భారీ మొత్తాన్ని పెట్టుబడిగా పెడుతున్న అమెజాన్ ప్రైమ్ ఒప్పందం సమయంలో తమ లోగో టైటిల్ కార్డ్స్ లో వేసేలా రాసుకుంటుంది.

ఇకపోతే నోటా పోస్టర్స్ లో అమెజాన్ ప్రైమ్ లోగో ని వీడియో పార్ట్ నర్ గా హై లైట్ చేయటంతో ఎలాగూ ఇందులో వస్తుంది కదా థియేటర్ కు వెళ్లడం ఎందుకు అనే ఆలోచనా ధోరణి ప్రేక్షకుల్లో మొదలైతే ఎలా అనే ప్రశ్నను నిర్మాతలందరూ వేసుకోవడం చాలా అవసరం. పైగా అమెజాన్ ప్రైమ్ పాపులారిటీ ఇప్పటికే కావాల్సినంత ఉంది. ఇలా పోస్టర్స్ టైటిల్ లో అదే పనిగా హై లైట్ చేస్తే దాని ప్రభావం ఉండదు అనుకోవడం అమాయకత్వమే అవుతుంది.

బ్లాక్ బస్టర్ అయితే తక్కువగా ఉంటుంది కానీ యావరేజ్ లేదా అంత కన్నా తక్కువ అని వచ్చినప్పుడే సమస్య ఎక్కువవుతుంది. నోటా నిర్మాతలు ఇది మర్చిపోయి పబ్లిసిటీలో అమెజాన్ ను ప్రమోట్ చేసారో లేదో కానీ గతంలో సురేష్ బాబు అన్నట్టు ఇలా తక్కువ వ్యవధిలో ఆన్ లైన్ సినిమా వచ్చేలా హక్కులు ఇవ్వడం గురించి ఓసారి చర్చించుకుని నిర్ణయం తీసుకుంటే బెటరేమో.
Tags:    

Similar News