మూవీ రివ్యూ : ఏంజెల్

Update: 2017-11-04 09:20 GMT
‘ఏంజెల్’ మూవీ రివ్యూ
నటీనటులు: నాగ అన్వేష్-హెబ్బా పటేల్-సప్తగిరి-షాయాజి షిండే-ప్రదీప్ రావత్-కబీర్ సింగ్-సుమన్-సన-ప్రభాస్ శీను తదితరులు
సంగీతం: భీమ్స్
ఛాయాగ్రహణం: గుణ
నిర్మాత: భువన్ సాగర్
రచన-దర్శకత్వం: ‘బాహుబలి’ పళని

‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాలో బాలనటుడిగా కనిపించిన నాగ అన్వేష్.. రెండేళ్ల కిందట ‘వినవయ్యా రామయ్యా’ సినిమాతో హీరో అయ్యాడు. కానీ ఆ సినిమా అతడికి నిరాశనే మిగిల్చింది. ఈసారి అతను సొంత బేనర్లోనే ఇంకాస్త ఎక్కువ బడ్జెట్లో ‘ఏంజెల్’ అనే సినిమా చేశాడు. రాజమౌళి శిష్యుడు ‘బాహుబలి’ పళని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసీ మూవీలో హెబ్బా పటేల్ కథానాయికగా నటించింది. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: స్వర్గంలో కేవలం సంతోషాలనే అనుభవిస్తూ విసుగు చెందిన గంధర్వ కన్య నక్షత్ర (హెబ్బా పటేల్)కు భూమి మీద భిన్న అనుభవాల్ని రుచి చూడాలని.. సామాన్య మానవురాలిగా జీవితం గడపాలని కోరిక పుడుతుంది. ఆ కోరిక నెరవేర్చుకునేందుకు తల్లిదండ్రుల మాటను కూడా జవదాటి భూలోకానికి వచ్చేస్తుంది. ఇక్కడ భూమి మీద ఓ విలువైన విగ్రహాన్ని తరలించే కాంట్రాక్టు పనిలో ఉన్న నాని (నాగ అన్వేష్).. గోపి (సప్తగిరి)లతో నక్షత్రకు పరిచయమవుతుంది. ఐతే నాని దగ్గరున్న విగ్రహం మాయమవడంతో వాళ్లకు కాంట్రాక్టు ఇచ్చిన గూండాకు సంబంధించిన వ్యక్తులు వీళ్లను తరమడం మొదలుపెడతారు వీళ్ల నుంచి తప్పించుకుని ఓ పల్లెటూరికి చేరిన వీరికి అక్కడ అనూహ్య అనుభవాలు ఎదురవుతాయి. ఆ అనుభవాలు ఏమిటి.. నానితో ఆమెకు ఎలాంటి బంధం ఏర్పడింది.. ఇంతకీ నక్షత్ర తిరిగి స్వర్గానికి వెళ్లదా.. ఈ విషయాలన్నీ తెరమీదే చూసి తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ: తెలుగులో సోషియో ఫాంటసీ సినిమా అనగానే అందరికీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా గుర్తుకొస్తుంది. ఈ జానర్లో అదొక కల్ట్ మూవీగా నిలిచిపోయింది. ఇది పాతికేళ్ల ముందు సినిమా అయినప్పటికీ ఇప్పుడు చూసుకున్నా కలిగే అనుభూతే వేరు. అలాగని అలాంటి సినిమానే ఇప్పుడు తీస్తామంటే.. ప్రస్తుత ట్రెండు గురించి పట్టించుకోకుండా అప్పటి స్టయిల్లో సినిమాను నడిపిస్తామంటే ఎలా..? ‘ఏంజెల్’ చిత్ర బృందం సరిగ్గా అదే పని చేసింది. పాతికేళ్ల కిందటి స్టయిల్లో కథను తీర్చిదిద్దుకోవడమే కాదు.. ఆ తరహాలోనే కథనాన్ని కూడా నడిపించింది. అందుకే ‘ఏంజెల్’ ఒక ఔట్ డేటెడ్ మూవీలా అనిపిస్తుంది తప్ప.. ఇది ఇప్పటి సినిమాలా అనిపించదు.

బాగా ఖర్చు పెట్టి వేసిన సెట్టింగ్స్.. విజువల్ ఎఫెక్ట్స్.. హెబ్బా పటేల్ అందాలు.. అక్కడక్కడా పేలే సప్తగిరి కామెడీ.. ఇవి తప్ప ‘ఏంజెల్’లో చెప్పుకోదగ్గ ఆకర్షణలు ఏమీ లేవు. సోషియో ఫాంటసీ కాబట్టి కథ విషయంలో లాజిక్కుల గురించి మాట్లాడకూడదు. కానీ తెరమీద జరిగే చిత్రాలు చమత్కారంగా అయినా అనిపించాలి కదా. అలాంటి ఫీలింగే ‘ఏంజెల్’ ఎక్కడా కలిగించదు. నారదుడొచ్చి భూమి మీద రకరకాల మద్యాలు దొరుకుతాయని.. నైట్ క్లబ్బుల్లో పార్టీలు జరుగుతాయని చెప్పగానే హీరోయిన్ టెంప్ట్ అయిపోయి భూమి మీదికి వచ్చేయడానికి రెడీ అయిపోతుంది. కానీ తండ్రి ఇక్కడన్ని సంతోషాలూ ఉండగా ఎందుకు భూమి మీదికి వెళ్లాలనుకుంటున్నావని అడిగితే మాత్రం.. సంతోషాలతో పాటు బాధలూ చూడటానికి భూమి మీదికి వెళ్లాలనుకుంటున్నట్లు చెబుతుంది.

ఇక్కడ కట్ చేస్తే హీరో హీరోయిన్ని ఎందుకు ప్రేమిస్తాడో తెలియదు.. హీరో మీద హీరోయిన్‌ కు ఎందుకు ప్రేమ పుడుతుందో అర్థం కాదు. వారి మధ్య ప్రేమకు దారి తీసే సరైన సీన్ ఒక్కటీ ఇందులో లేదు. ఎలాగోలా సమయాన్ని లాగించేద్దాం అన్నట్లు సన్నివేశాలు.. పాటలు పేర్చేయడంతో ఎక్కడా ఈ కథ మనసుకు తాకదు. కథనం చాలా నెమ్మదిగా.. భారంగా సాగుతుంది. ప్రథమార్ధం అయ్యేసరికే ఒక సినిమా చూసిన భావన కలుగుతుంది. అంతగా విసిగిస్తాయి సన్నివేశాలు. ఇక ఇంటర్వెల్ దగ్గర వచ్చే మలుపు చూసి.. ద్వితీయార్ధంలో ఏమైనా విషయం ఉందేమో అని చూస్తే.. అక్కడా నిరాశే ఎదురవుతుంది. చాలా నీరసంగా సాగే ఫ్లాష్ బ్యాక్ సాగుతుంది. రైతుల పేరు చెప్పి గుండెలు పిండేద్దామని చూశారు కానీ.. అందులో ఎమోషన్లు చాలా ఫోర్స్డ్ గా అనిపిస్తాయి.

సినిమాలో ప్రేక్షకుల్ని కాసేపు ఎంగేజ్ చేసే ఎపిసోడ్ ఏదైనా ఉంది అంటే.. అది ప్రి క్లైమాక్సులో వచ్చే కామెడీ ఎపిసోడే. అందులో లాజిక్ ఏమీ లేకపోయినా.. కొంత మేర నవ్వులు పండాయి. క్లైమాక్సులో విజువల్ ఎఫెక్ట్స్ జోడించి ఒక పెద్ద ఫైట్ పెట్టారు కానీ.. అదేమంత ప్రత్యేకంగా అనిపించదు. ఓవరాల్ గా రెండుంబావు గంటల నిడివిలో ‘ఏంజెల్’ చాలా వరకు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. సోషియో ఫాంటసీ కథలో ఉండే చమత్కారాలేమీ ఇందులో లేవు. కథ.. పాత్రలు కొంచెం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ని తలపిస్తాయి కానీ.. సినిమాగా చూసుకుంటే దానికి ఇది పేలవమైన వెర్షన్ లాగా అనిపిస్తుంది.

నటీనటులు: నాగ అన్వేష్ తొలి సినిమాతో పోలిస్తే లుక్ మార్చాడు. కొంచెం ఒళ్లు చేసి.. గడ్డం.. మీసం పెంచి కనిపించాడు. కానీ నటన పరంగా పెద్దగా మెరుగైంది లేదు. కొంతమేర తొలి సినిమాలోనే అతడి పాత్ర బెటర్ అనిపిస్తుంది. సాఫ్ట్ గా కనిపించే అతను లుక్ ఎలా మార్చుకున్నప్పటికీ ఆవారా కుర్రాడి పాత్రకు సూటవ్వలేదు. హీరోయిన్ హెబ్బా పటేల్ సినిమాకు చెప్పుకోదగ్గ ఆకర్షణ అయింది. ఆమె హావభావాలు ఏమీ మార్చకపోయినా.. గ్లామరస్ గా కనిపించి ఆ రకమైన వినోదాన్ని ఆశించే ప్రేక్షకుల్ని సంతృప్తిపరిచింది. సప్తగిరి అక్కడక్కడా కొంచెం నవ్వించాడు. సుమన్.. షాయాజి షిండే.. ప్రదీప్ రావత్.. ప్రభాస్ శీను.. వీళ్లంతా మామూలే. గరుడ పాత్రలో కబీర్ సింగ్ చూడ్డానికి బాగానే కనిపించాడు.

సాంకేతిక వర్గం: భీమ్స్ సంగీతం సోసోగా అనిపిస్తుంది. ద్వితీయార్ధంలో పల్లెటూరి నేపథ్యంలో వచ్చే ఒక పాట పర్వాలేదు. మిగతావన్నీ మామూలుగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం కూడా సాదాసీదాగా అనిపిస్తుంది. గుణ ఛాయాగ్రహణం పర్వాలేదు. స్వర్గలోకపు సన్నివేశాల్ని బాగా చిత్రీకరించాడు. విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నంతలో పర్వాలేదు. నిర్మాణ విలువలు ఓకే. నాగ అన్వేష్ కోసం తండ్రి ఓ మోస్తరుగానే ఖర్చు పెట్టాడు. దర్శకుడు ‘బాహుబలి’ పళని తన గురువు రాజమౌళి టచ్ ను చూపించలేకపోయాడు. రాజమౌళి తీసిన సోషియో ఫాంటసీ మూవీ ‘యమదొంగ’లో పాత కథతోనే ఎలా మ్యాజిక్ చేశాడో.. ఎలా ఎంటర్టైన్ చేశాడో చూడాల్సింది. పళని మాత్రం కథ విషయంలోనే కాదు.. నరేషన్ విషయంలోనూ 90ల్ని గుర్తుకు తెచ్చాడు. సన్నివేశాలు అలా పేర్చుకుంటూ పోయాడే తప్ప.. కథను.. పాత్రల్ని ప్రేక్షకులకు కనెక్ట్ చేయలేకపోయాడు. పేలవమైన స్క్రీన్ ప్లే వల్ల వచ్చిన ఇబ్బంది ఇది. దర్శకుడిగా పళని నిరాశ పరిచాడు.

చివరగా: ఈ ఏంజెల్.. అకొట్టుకోదు

రేటింగ్- 2/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News