మూవీ రివ్యూ: ‘అజ్ఞాతవాసి’

Update: 2018-01-10 09:01 GMT
చిత్రం : ‘అజ్ఞాతవాసి’

నటీనటులు: పవన్ కళ్యాణ్ - కీర్తి సురేష్ - అను ఇమ్మాన్యుయెల్ - ఆది పినిశెట్టి - ఖుష్బు - బొమన్ ఇరానీ - రావు రమేష్ - మురళీ శర్మ - తనికెళ్ల భరణి - వెన్నెల కిషోర్ - రఘుబాబు - పవిత్ర లోకేష్ - జయప్రకాష్ - సమీర్ - అజయ్ తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: మణికందన్
నిర్మాత: సూర్యదేవర రాధాకృష్ణ
రచన - దర్శకత్వం: త్రివిక్రమ్

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు ఆకాశానికి చేరిపోయాయి. వీళ్లిద్దరి కలయికలో తెరకెక్కిన మూడో సినిమా ‘అజ్ఞాతవాసి’కి వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. ఆ హైప్ మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం. మరి ఈ చిత్రం అంచనాల్ని ఏ మేరకు అందుకుందో చూద్దాం పదండి.

కథ:

ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయిన గోవింద్ భార్గవ్ (బొమన్ ఇరానీ).. అతడి చిన్న కొడుకు ఒకేసారి హత్య చేయబడతారు. అతడి భార్య ఇంద్రాణి (ఖుష్బు) దిక్కుతోచని స్థితిలో ఉండగా.. గోవింద్ మొదటి భార్య కొడుకైన అభిషిక్త్ భార్గవ్ (పవన్ కళ్యాణ్) రంగంలోకి దిగుతాడు. తన తండ్రిని చంపిందెవరో తెలుసుకోవడం కోసం తన కుటుంబానికి చెందిన ఆఫీసులోనే మారు పేరుతో ఉద్యోగంలో చేరతాడు. మరి అక్కడ అతడికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.. అభిషిక్త్ అనుమానించిన వాళ్లే అతడి తండ్రిని చంపారా.. ఇంతకీ కుట్రను ఛేదించి తండ్రిని చంపిన వాళ్లను ఎలా శిక్షించాడు.. తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా తన అధీనంలోకి తీసుకున్నాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

వేల కోట్లకు అధిపతి అయిన హీరో అలా రోడ్డుకు అడ్డంగా నడిచొస్తుంటాడు. అతడి అసిస్టెంట్లు అతను నడిచే మార్గంలో ఏ అడ్డంకీ రాకుండా క్లియర్ చేసి పెడుతుంటారు. ఒక అసిస్టెంట్ అయితే మోకాలిపై కూర్చుని హీరో డివైడర్ ఎక్కడానికి సాయం చేస్తాడు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ అదే దారిలో బైక్ మీద ఒక కుర్రాడు దూసుకొస్తుంటాడు. హీరో తన పాటికి తాను నడుచుకుంటూ పోతుంటాడు. హీరో అసిస్టెంట్లు ఆ బైకు మీది నుంచి కుర్రాడిని లాగి విసిరికొడతారు. బైక్ ఎక్కడో ఎగిరి పడుతుంది. తమ అధినేత ఎంత తోపైనా కావచ్చు. అతడి మార్గానికి అడ్డు రావద్దనుకుంటే.. బైకు మీదొచ్చే కుర్రాడిని ఆపితే సరిపోతుంది. కానీ హీరో అసిస్టెంట్లు బైకర్ ను ఇలా లాగి విసిరి పడేయడంలో లాజిక్ ఏంటో అర్థం కాదు. ‘అజ్ఞాతవాసి’ సినిమా అంతా కూడా ఇలాగే లాజిక్ లెస్ గా సాగుతుంది.

ప్రతి సినిమాలోనూ లాజిక్ అనేది కీలకమేమీ కాదు. అన్నిసార్లూ ప్రేక్షకులు దాన్ని పట్టించుకుంటారనీ కాదు. ప్రేక్షకుడు వినోదంలో మునిగి తేలుతున్నపుడు.. ఒక కథతో ఎంగేజ్ అయినపుడు లాజిక్ గురించి పట్టింపే ఉండదు. ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటాడు. కానీ ‘అజ్ఞాతవాసి’ అలా ప్రేక్షకుల్ని వినోదంలో ముంచెత్తనూ లేదు. ఈ కథ ఏమంతగా ఎంగేజ్ చేయనూ చేయదు. అలాంటపుడు లాజిక్ అనేది కచ్చితంగా టాకింగ్ పాయింటే అవుతుంది మరి. తండ్రిని కోల్పోయిన కొడుకు.. తన తండ్రిని చంపిందెవరో తెలుసుకోవడానికి తన ఆఫీసులోనే వేరే పేరుతో ఉద్యోగంలో చేరడమనే విషయమే అంత సహేతుకంగా అనిపించదు. ఇక అతను అక్కడ చేరి చేసేదేమయ్యా అంటే హీరోయిన్లతో సయ్యాటలు.. అందరితో పరాచికాలు. త్రివిక్రమ్ ఎంతటి చమత్కారి అయినప్పటికీ.. తండ్రిని కోల్పోయిన కొడుకులో రవ్వంత బాధ చూపించకపోవడం.. అతడితో అన్నీ కామెడీ వేషాలే వేయించడంలో ఆంతర్యమేంటో అర్థం కాదు. పోనీ ఆ కామెడీ అయినా పండితే పాత్ర ఔచిత్యం గురించి మరిచిపోదుము. కానీ అదే జరగలేదు.

త్రివిక్రమ్ తీసిన సినిమాలన్నింట్లోకి అత్యంత పేలవంగా ఆడిన ‘ఖలేజా’లో కూడా కామెడీకి ఏమాత్రం ఢోకా ఉండదు. మళ్లీ మళ్లీ చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది అందులోని వినోదం. త్రివిక్రమ్ కెరీర్లో మరో వీక్ మూవీ అయిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో కూడా ఆసక్తి రేకెత్తించే సన్నివేశాలకు లోటుండదు. కథ బలహీనంగా ఉన్నా.. తనదైన సెన్సాఫ్ హ్యూమర్ తో సన్నివేశాల్ని నడిపించి.. ప్రేక్షకుల్ని వినోదంలో ముంచెత్తడం త్రివిక్రమ్ బలం. ఆ బలం అతి తక్కువగా.. చాలా చోట్ల అసలే కనిపించని సినిమాగా ‘అజ్ఞాతవాసి’ని చెప్పుకోవచ్చు. పెద్దగా కథేమీ లేని ప్రథమార్ధంలో.. చాలా వరకు సన్నివేశాల్ని సరదాగా నడిపించాలని చూశాడు త్రివిక్రమ్. కానీ ఆ సన్నివేశాల్లో అతడి మార్కు వినోదం ఆశించిన స్థాయిలో పండలేదు.

త్రివిక్రమ్ సినిమాల్లో సాధారణంగానే హీరోయిన్ల పాత్రలు చాలా తెలివి తక్కువగా ఉంటాయి. ఇక ‘అజ్ఞాతవాసి’లో అయితే మరీ దారుణం. ఇద్దరు హీరోయిన్ల పాత్రలనూ మరీ తీసికట్టుగా తయారు చేశాడు త్రివిక్రమ్. వాళ్ల ప్రవర్తన ఏమాత్రం లాజికల్ గా అనిపించదు. ఒకరేమో జంట్స్ టాయిలెట్ లో కూర్చుని దమ్ము కొడుతూ.. హీరో కనిపించగానే అతడికి తన రహస్యాలన్నీ చెప్పేసి అతడి దగ్గరైపోతారు. ఇంకొకరు హీరో తన వైపు చూసి హీరో ఒక కన్నీటి చుక్క రాల్చగానే అతడి దగ్గరికి పరుగెత్తుకెళ్లిపోయి అక్కున చేర్చేసుకుంటారు. సినిమాలో హీరోయిన్ల పాత్రలు మాత్రమే కాదు.. విలన్ సహా మిగతా పాత్రలన్నీ కూడా బలహీనమే. వేరే పాత్రలు వేటి మీదా అంతగా దృష్టిపెట్టని త్రివిక్రమ్.. తన దృష్టంతా పవన్ కళ్యాణ్.. అతడి పాత్ర మీదే పెట్టాడు. అతడి చుట్టూనే కథను తిప్పాడు. ప్రతి సన్నివేశంలోనూ అతడినే హైలైట్ చేయడానికి ప్రయత్నించాడు. పవన్ మాత్రం తన అభిమానుల్ని అలరించే విన్యాసాలతో.. చేష్టలతో.. తన మార్కు మేనరిజంలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఐతే విలన్ పాత్ర బలంగా ఉన్నపుడే హీరోయిజం కూడా ఎలివేట్ అయ్యేది..? వేరే పాత్రల్లోనూ పస ఉంటేనే కదా కథ పండేది..?

ఫ్రెంచ్ సినిమా ‘లార్గో వించ్’ స్ఫూర్తితో తీర్చిదిద్దుకున్న ‘అజ్ఞాతవాసి’ కథలో మలుపులైతే చాలా ఉన్నాయి. కానీ ఆ కథను బిగువుతో.. పకడ్బందీగా చెప్పడంలో త్రివిక్రమ్ విజయవంతం కాలేకపోయాడు. ఎప్పుడూ త్రివిక్రమ్ సినిమాలకు అతడి వినోదాత్మక శైలే బలంగా ఉంటుంది. కానీ ఈసారి అది బలహీనత అయింది. కామెడీ కోసం చేసిన ప్రయత్నం కథలోని ఇంటెన్సిటీని తగ్గించేసింది. ప్రథమార్ధంలో హీరోయిన్లతో పవన్ సన్నివేశాలు కొంచెం ఫన్నీగా ఉన్నప్పటికీ వాళ్ల పాత్రలు ప్రవర్తించే తీరు అసహజంగా ఉండటంతో ఆ సన్నివేశాలు పూర్తిగా మెప్పించవు. వెన్నెల కిషోర్ పాత్రతో ముడిపడ్డ రెండు మూడు సన్నివేశాలు నవ్విస్తాయి. మిగతా సీన్లు చాలా వరకు తేలిపోయాయి. ఇంటర్వల్ ముంగిట వచ్చే యాక్షన్ ఎపిసోడ్.. పవన్-ఖుష్బూ మధ్య బంధాన్ని ఎలివేట్ చేసే సీన్ ఆకట్టుకుంటాయి.

ద్వితీయార్ధంలో కథలోని మల్టిపుల్ లేయర్స్ కనిపిస్తాయి. అవి కొంతమేర ఆసక్తి రేకెత్తిస్తాయి. కానీ ఒక దశ దాటాక కథ మళ్లీ గాడి తప్పుతుంది. కామెడీ కోసం ఇక్కడ ఒక ఎపిసోడ్ నడిపించారు. కథను అది పక్కదోవ పట్టించినా.. అక్కడ కొంచెం త్రివిక్రమ్ మార్కు కనిపిస్తుంది. కొన్ని సీన్లు నవ్విస్తాయి. కొడకా కోటేశ్వరరావా పాట ఆకట్టుకుంటుంది. ఇక మళ్లీ కథలోకి వెళ్లాక సినిమా ఏ ప్రత్యేకతా లేకుండా సాగుతుంది. పతాక సన్నివేశాలు ఏమంత ఆసక్తి రేకెత్తించవు. ముగింపులో మాత్రం త్రివిక్రమ్ మార్కు చమత్కారం కనిపిస్తుంది. పవన్-త్రివిక్రమ్ కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘అత్తారింటికి దారేది’లోని ఛాయలు ఇందులో చాలా కనిపిస్తాయి. కానీ దాంతో పోలిస్తే సగం స్థాయిలో కూడా ‘అజ్ఞాతవాసి’ ఎంటర్టైన్ చేయదు అంటే పెద్ద మాటేమీ కాదు. త్రివిక్రమ్ మార్కు వినోదం ఇందులో మిస్సవడం మైనస్. సినిమా అంతా పవన్ చుట్టూనే తిరగడం వల్ల.. అభిమానులు కోరుకునే తరహాలోనే పవన్ కనిపించడం వల్ల వారికిది బాగానే అనిపించొచ్చు. కానీ సగటు ప్రేక్షకుడికి మాత్రం ‘అజ్ఞాతవాసి’ భారంగానే అనిపిస్తుంది.

నటీనటులు:

 ‘అజ్ఞాతవాసి’లో పవన్ వన్ మ్యాన్ షో చూడొచ్చు. దాదాపుగా ప్రతి సీన్లోనూ పవన్ ఉంటాడు. అభిమానులు తనను ఎలా చూడాలనుకుంటారో అలా కనిపించాడతను. నటన పరంగా ‘అత్తారింటికి దారేది’ తరహాలో ప్రత్యేకత చాటుకునే సీన్లేమీ లేవిందులో. పవన్ నటన.. మేనరిజమ్స్.. ఫైట్లు.. అన్నీ కూడా అభిమానుల్ని దృష్టిలో ఉంచుకుని చేసినట్లే కనిపిస్తుంది. వాళ్లకైతే పవన్ కనువిందు చేస్తాడు. హీరోయిన్లు కీర్తి సురేష్.. అను ఇమ్మాన్యుయెల్ ల గురించి చెప్పడానికేమీ లేదు. వాళ్లిద్దరివీ పేలవమైన పాత్రలు. ఇంత పెద్ద సినిమాలో హీరోయిన్లను మరీ ఇలా చూపించడం ఎవ్వరికైనా నిరాశ కలిగిస్తుంది. విలన్ పాత్రలో ఆది పినిశెట్టి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది కానీ.. అతడి పాత్రా బలహీనమే. ఖుష్బు అయినా అంతే. బొమన్ ఇరానీ ఓకే. రావు రమేష్.. మురళీ శర్మ కొంత మేర నవ్వించే బాధ్యత తీసుకున్నారు. వెన్నెల కిషోర్ కనిపించిన తక్కువ సన్నివేశాల్లోనే నవ్వించాడు. తనికెళ్ల భరణి బాగానే చేశాడు. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతికవర్గం:

అనిరుధ్ రవిచందర్ సంగీతం ఆశించిన స్థాయిలో లేదు. గాలి వాలుగా.. బైటికొచ్చి చూస్తే.. కొడకా కోటేశ్వరరావు పాటలు బాగానే ఉన్నప్పటికీ.. ఇంకా ఏదో మిస్సయిన భావన కలుగుతుంది. పాటల ప్లేస్మెంట్ కూడా ఈ ఫీలింగ్ రావడానికి ఒక కారణం కావచ్చు. ధగధగమనే పాట టైటిల్స్ లో మిక్సయిపోయింది. బైటికొచ్చి చూస్తే.. గాలి వాలుగా.. పాటలు సందర్భోచితంగా అనిపించవు. ఈ రెండు పాటల్లోనూ పవన్ సరిగా లిప్ సింక్ ఇవ్వకపోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ విషయాన్ని ఎందుకంత తేలిగ్గా తీసుకునున్నారో మరి. అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. మణికందన్ ఛాయాగ్రహణం సినిమాకు అతి పెద్ద ఆకర్షణ. ప్రతి సన్నివేశాన్ని కంటికింపుగా చూపించింది చూపించింది అతడి కెమెరా. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకు ప్లస్సే. సినిమా అంతా చాలా రిచ్ గా కనిపిస్తుంది. ఇక రచయిత-దర్శకుడు త్రివిక్రమ్ ‘లార్గో వించ్’ కథను దాదాపుగా దించేశాడు. ఆ కథకు త్రివిక్రమ్ శైలి అంతగా సరిపోలేదు. సినిమాలో త్రివిక్రమ్ చమత్కారం బాగా తగ్గింది. ‘‘సింహం పార్టీకి పిలిచిందని జింక జీన్స్ ప్యాంటేసుకుని వచ్చిందట’’ తరహా పంచులు.. ‘‘విచ్చలవిడిగా చేస్తే విధ్వంసం.. విచక్షణతో చేస్తే ధర్మం’’ లాంటి ఫిలసాఫికల్ డైలాగుల్లో త్రివిక్రమ్ మార్కు కనిపిస్తుంది కానీ.. మాటలు అతడి స్థాయిలో అయితే లేవు. రచయితగా.. దర్శకుడిగా త్రివిక్రమ్ ఇప్పటిదాకా తీసిన అన్ని సినిమాల్లో ‘అజ్ఞాతవాసి’నే అత్యంత బలహీనమైంది అనడంలో సందేహమే లేదు.

చివరగా: అజ్ఞాతవాసి.. త్రివిక్రమ్ మార్క్ మిస్సింగ్!
 
రేటింగ్- 2.25/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News