సమంత కోసం 'అజ్ఞాతవాసి' కుర్రాడు

Update: 2018-08-23 12:52 GMT
టాలీవుడ్లో హీరోల్లో పవన్ కళ్యాణ్ తో.. దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్‌ తో .. ఒక్కసారైనా పని చేయాలని ఆశించే సంగీత దర్శకులు ఎంతోమంది ఉంటారు. ఐతే తెలుగులో తన తొలి సినిమానే వాళ్లిద్దరితో కలిసి చేసే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్. ‘అజ్ఞాతవాసి’కి అతనందించిన పాటలు కూడా ఆకట్టుకున్నాయి. కానీ సినిమా డిజాస్టర్ కావడంతో ఆ ఎఫెక్ట్ అతడిపై పడింది. దీంతో త్రివిక్రమ్-ఎన్టీఆర్‌ సినిమాకు పని చేసే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. మళ్లీ అతను టాలీవుడ్ వైపు చూడలేదు. నాని సినిమా ‘జెర్సీ’కి మ్యూజిక్ చేస్తాడంటున్నారు కానీ.. ఇంకా ఏ విషయం ఖరారవ్వలేదు. మరోవైపు తమిళంలో మాత్రం అనిరుధ్ జోరు కొనసాగుతోంది.  నయనతార ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ‘కోలమావు కోకిల’కు అతనే మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా పెద్ద హిట్టయింది. అందులో అనిరుధ్ మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించింది.

ఈ సినిమా కోసం అనిరుధ్ తయారు చేసిన ప్రమోషనల్ వీడియో భలే పేరు తెచ్చింది. అనిరుధ్ త్వరలోనే మరో సినిమాకు ఇలాంటి ప్రమోషనల్ వీడియో చేయబోతున్నాడట. ఆ చిత్రంతో అతడికెలాంటి సంబంధం లేకపోవడం విశేషం. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘యు టర్న్’ కోసం అతను వీడియో సాంగ్ చేస్తాడట. ఈ చిత్రానికి పూర్ణచంద్ర తేజస్వి సంగీతాన్నందించాడు. ఐతే తమిళంలోనూ కొంచెం పెద్ద స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చూస్తున్న చిత్ర బృందం.. ప్రమోషనల్ వీడియో కోసం అనిరుధ్ నే ఆశ్రయించింది. సమంత కోరిక మేరకు అతను ఇందుకు అంగీరించాడట. సమంత-అనిరుధ్ కలిసి చేస్తున్న ఈ వీడియో త్వరలోనే సోషల్ మీడియాలోకి రానుంది. ‘అజ్ఞాతవాసి’ కోసం కూడా అనిరుధ్ ‘గాలివాలుగా..’ పాటలో పవన్ కళ్యాణ్ కు ట్రిబ్యూట్ ఇస్తూ చేసిన వీడియో సూపర్ పాపులరైంది. మరి సమంత కోసం అతను చేస్తున్న పాట సినిమాకు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి.


Tags:    

Similar News