‘‘అన్నపూర్ణ’’ ముందు చూపు అదిరిపోయింది

Update: 2016-04-04 05:34 GMT
తెలుగు తెర మీద అమ్మ పాత్ర గుర్తుకు వస్తే మొదటగా గుర్తుకు వచ్చేది అన్నపూర్ణే. నవ్వు ముఖం.. నుదుటన రూపాయి బిళ్లంత బొట్టు పెట్టుకొని.. హోమ్లీగా ఉంటూ.. అమ్మ అంటే ఇలానే ఉండాలన్నట్లుగా హుందాతనంతో ఉండే ఈ సీనియర్ నటి.. ఇప్పటి కాలం వారికిపెద్దగా పరిచయం ఉండదనే చెప్పాలి. 70లలో పుట్టిన వారికి సుపరిచితురాలైన అన్నపూర్ణ ఈ మధ్య కాలంలో వెండితెర మీద కనిపించటం లేదు.

తాజాగా ఆమె ఒక మీడియా సంస్థ అధినేత చేసే ఇంటర్య్వూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె చెప్పిన మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ విషయాల్ని చూస్తే..

= ఖాళీగా ఉంటే ఎవరో ఒకరు ప్రేమిస్తారు. అందుకే.. చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నా. పెళ్లయిన వాళ్ల జోలికెవ్వరూ రారు కదా?

= ముఖానికి రంగు ఉండాలి. చుట్టూ జనం కనిపిస్తూ ఉండాలి. దాని తర్వాతే ఏదైనా అని అనుకునేదాన్ని

= ప్రముఖ నటులు రాజబాబు.. మురళీమోహన్.. దర్శకులు జంధ్యాల లాంటి వారితో నాటకాలు వేశా. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చాయి

=  మా కాలం హీరోలంతా ఓల్డ్ అయిపోయారు. ఇప్పుడు ప్రేక్షకులు తల్లుల్ని గ్లామర్ గా చూడాలనుకుంటున్నారు

= వాళ్లు అనుకున్నట్లే పెళ్లి అయిపోయి తిరిగి వచ్చేసిన హీరోయిన్లే తల్లి పాత్రల్ని పోషిస్తున్నారు. నన్ను అప్పుడప్పుడు పిలుస్తున్నారు.

= మాది కృష్ణా జిల్లా. రూపాయి వస్తే పావాలా దాచుకునే మెంటాలిటీ. అలా దాచిన పావలాలన్నీ మిగిలాయి.

= నా అసలు పేరు ఉమ. దాసరి నారాయణ రావు నా పేరును అన్నపూర్ణగా పెట్టారు.

= 22 ఏళ్ల వయసులో అంగడి బొమ్మ సినిమాలో అమ్మ పాత్ర వేశా. మేకఫ్ లేకుండా కెమేరామన్ వెంకటరత్నంగారు అద్భుతంగా చూపించారు

= ఈ సినిమాను చూసిన జి. వరలక్ష్మీ నన్ను మెచ్చుకుంటూ చాలా బాగా చేశావ్.. ఒక జీవితకాలం నువ్వే మదర్ అంటూ ఆశీర్వదించేశారు

= సినిమా వాళ్లు పై నుంచి కిందికూస్తే ప్రశ్నలేసేవాళ్లు. వాళ్ల ధోరణి నచ్చక నాటకాలే వేద్దామనుకున్నా. కానీ.. సినిమా వాళ్ల నుంచి ఆహ్వానం వచ్చింది

=  యంగ్ వేషాలు వేస్తే పరిగెత్తడాలు.. విలన్లు వెంబడించడాలు.. జాకెట్లు చింపించుకోవటం లాంటివి చేయలేను. అలాంటి పాత్రలు నచ్చవు

= ఇప్పుడంటే టాక్సీలు వచ్చాయి కానీ.. అప్పట్లో బెజవాడలో రిక్షాలే కదా. నేను వెళ్లి అక్కడ తిరగాలి కదా.

= జాకెట్లు చిరిగిన వేషం వేసి రిక్షాల్లో తిరిగితే కుర్రాళ్లు ఊరుకుంటారా చెప్పండి?

= ప్రొఫెషనల్ గా చెబితే నాకిష్టమైన నటుల్లో ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా. ఆయనంటే ఇష్టమండి. అంత అందగాడు ఇండియాలో ఇంకెవరైనా ఉన్నారండి?

= అప్పటితో పోలిస్తే ఇప్పుడు రెమ్యునరేషన్లు పెరిగాయి. ఖర్చులు కూడా.

= ఆ రోజుల్లో వెయ్యి ఇస్తే వంద మిగిలేది. ఇప్పుడు 20.. 30 వేలు ఇస్తే వెయ్యి మిగలట్లేదు

= పెద్ద కోరికలేం లేవు. ఇప్పుడున్న అందంగా ఇలాగే ఉండి.. బోలెడంత వార్థక్యం రాకుండా ఆరోగ్యంగా ఇలా పని చేస్తూనే వెళ్లిపోవాలన్నదే కోరిక.
Tags:    

Similar News