ఫ్యాన్స్ కుల ప్రాతిప‌దిక‌న డివైడ్ అయ్యారా?

Update: 2021-05-16 23:30 GMT
ఇద్ద‌రు అగ్ర హీరోల్ని క‌లిపి భారీ సినిమా తీయ‌డం అంటే స‌వాళ్ల‌ తో కూడుకున్న‌ది. ప‌ట్టాలెక్కించే ముందు చాలా ఆలోచించాలి. ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఇక్క‌డ చాలా ఇంపార్టెంట్. అయితే ద‌శాబ్ధం క్రిత‌మే ప్రారంభం కావాల్సిన ఆ భారీ మ‌ల్టీస్టార‌ర్ ఇంత ఆల‌స్య‌మ‌వ్వ‌డానికి కార‌ణ‌మేమిటో స‌ద‌రు స్టార్ డైరెక్ట‌ర్ ఇచ్చిన వివ‌ర‌ణ అంద‌రినీ షాక్ కి గురి చేస్తోంది.

నిజానికి ఆ ప్ర‌ముఖ హీరోలు ఎంతో గొప్ప స్నేహితులే అయినా వారి అభిమానుల భావ‌జాలం మాత్రం వేరుగా ఉంటుంది. తెలుగు ప‌రిశ్ర‌మ‌లో ఫ్యానిజం అనేది కులంతో ముడిప‌డినది. త‌మ కులం హీరో అయితేనే ఆద‌రించే స్వ‌భావం కూడా ఇక్క‌డ ఉంది. అందువ‌ల్ల ఇద్ద‌రు అగ్ర హీరోల్ని క‌లిపి సినిమా తీయ‌డం అంటే ఫ్యాన్స్ లో గొడ‌వ‌లు రాజేయ‌డ‌మే. ఏం తేడా వ‌చ్చినా నిల‌దీస్తారు! అనే భావ‌న ఉంటుంద‌ని త‌న అభిప్రాయాన్ని క్లియ‌ర్ గా చెప్పారు.

అందుకే ఇప్ప‌టివ‌ర‌కూ ఆ ఇద్ద‌రినీ క‌లిపి సినిమా తీసేందుకు ఆచితూచి అడుగులేయ‌డ‌మే గాక‌.. ఎంతో ఓపిగ్గా వేచి చూశారట‌. మ‌ల్టీస్టార‌ర్ చేసేందుకు ఆ ఇద్ద‌రు హీరోలు ఆసక్తి కనబరిచినప్పటికీ అభిమానుల ఘర్షణల కారణంగా దర్శకులు ఎవరూ ధైర్యం చేయలేదని కూడా ఆయ‌న‌ వెల్లడించారు. హీరోల పరంగానే కాకుండా కుల ప్రాతిపదికన కూడా అభిమానులు విభజించబడి ఉన్నారు. ఉన్నత విద్యావంతులు మోడ్ర‌న్ డే అభిమానులు కూడా తమ కులానికి చెందిన హీరోల కోసం థియేట‌ర్ల‌కు వెళతారు. అలాంటి పిచ్చి టాలీవుడ్ లో స‌మ‌స్యాత్మ‌కం! అని చెప్ప‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ప‌రిశ్ర‌మ వ్య‌వ‌హారాల్ని ద‌గ్గ‌ర‌గా ప‌రిశీలించేవారికి ఇవేవీ కొత్త కాదు కానీ సామాన్యుల‌కు మింగుడు ప‌డ‌ని వ్య‌వ‌హార‌మిది.

కుల ఘర్షణల కారణంగా తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను.. మల్టీస్టారర్లను చూసే అదృష్టం ఎప్పటికీ ఉండదని ఆ పెద్ద ద‌ర్శ‌కుడు పేర్కొన్నారు. మొత్తానికి చాలామంది ప్ర‌స్థావించ‌ని కులం కుంప‌టి గురించి అత‌డు ఓపెన‌య్యార‌న్న‌మాట‌.

అయితే ఇప్ప‌టికాలంలో కులం లేదు అని అన‌లేం. కానీ కులం కోసం పాకులాడేది అతి కొద్దిమంది మాత్ర‌మే. మ‌న హీరోలంతా కుల ప్రాతిప‌దిక‌న కాకుండా ఎంతో స్నేహంగా కుటుంబ సంబంధాల‌ను క‌లిగి ఉండ‌డం కొంత‌వ‌ర‌కూ అభిమానుల్లో ఆలోచ‌న‌లు మార‌డానికి ప‌రిణ‌తి చెంద‌డానికి ఉప‌క‌రిస్తోంది. అలాగే కులానిక‌తీతంగా స్నేహంగా క‌లిసిమెలిసి ప‌ని చేసేవాళ్లు అన్ని శాఖ‌ల్లో చాలామంది ఉన్నారు.
Tags:    

Similar News