ఆర్యన్ రాజేష్.. పాత్ర అలానే వుంటుందా?

Update: 2018-11-10 14:30 GMT
లెజెండరీ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ తన కొడుకుల విషయంలో ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. పెద్ద కొడుకు ఆర్యన్ రాజేష్ ను హీరోగా నిలబెట్టి.. చిన్న కొడుకు నరేష్ ను దర్శకత్వ శాఖలోకి తేవాలనుకున్నాడు. కానీ ఆర్యన్ రాజేష్ హీరోగా విఫలమయ్యాడు. అనుకోకుండా నటనలోకి వచ్చిన నరేష్ క్లిక్కయ్యాడు. ఇప్పుడు నరేష్ పరిస్థితి కూడా అయోమయంగా ఉంది కానీ.. ఒకప్పుడైతే అతను మంచి క్రేజ్ తో సాగాడు. ఆర్యన్ మాత్రం ఎప్పుడూ సక్సెస్ కాలేదు. కొన్నేళ్లు ట్రై చేసి చివరికి సినిమాలు మానేసి సైలెంటైపోయాడు. ప్రొడక్షన్లో అడుగు పెడితే అక్కడా తేడా కొట్టేసింది. ఇక ఆర్యన్ మళ్లీ సినిమాల్లో కనిపించడనే అనుకున్నారు. కానీ అనుకోకుండా ఓ పెద్ద సినిమాలో అవకాశం దక్కించుకున్నాడతను. రామ్ చరణ్ కథానాయకుడిగా తెరకెక్కతున్న ‘వినయ విధేయ రామ’లో అతడికి ఛాన్స్ ఇచ్చాడు బోయపాటి.

ఇన్నేళ్ల తర్వాత ఆర్యన రీఎంట్రీ ఇస్తున్నాడంటే ఏదో కీలకమైన పాత్రే అయ్యుంటుందని అంతా అనుకున్నారు. కానీ టీజర్ చూస్తే అలాంటి ఫీలింగేమీ కలగట్లేదు. రామ్ చరణ్.. ‘రామ్ కొ..ణి..దె..ల’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పే షాట్లో బ్యాగ్రౌండ్లో ఆర్యన్ రాజేష్ ను గమనించవచ్చు. చరణ్ వెంట ఉండే గ్యాంగులో ఒకడిలాగా కనిపిస్తున్నాడు ఆర్యన్. టీజర్ వరకైతే అతను జూనియర్ ఆర్టిస్టులాగా కనిపించాడు. అతడి మీద అసలు ఫోకసే లేకపోయింది. ‘సరైనోడు’లో శ్రీకాంత్ పాత్ర గురించి ఇంతకుముందు ఓ బిల్డప్ ఇచ్చారు కానీ.. సినిమాలో అతడి ప్రత్యేకత ఏమీ లేకపోయింది. ఆర్యన్ విషయంలో ఆ మాత్రం ప్రాధాన్యం అయినా ఉంటుందా అన్న డౌట్లు కొడుతున్నాయి. ఎప్పుడూ హీరో-విలన్ చుట్టూనే సినిమాల్ని నడిపించే బోయపాటి.. ఆర్యన్ కు అలాంటి పాత్రే ఇచ్చి ఉంటాడేమో అని కామెంట్లు పడుతున్నాయి. చూడాలి మరి ఆర్యన్ సినిమాలో ఎలా తన ప్రత్యేకతను చాటుకుంటాడో?


Tags:    

Similar News