సల్మాన్ గొప్పా.. రాజమౌళి గొప్పా?

Update: 2016-10-17 10:56 GMT
‘బాహుబలి’తో పోటీ పడటానికి ఎంత పెద్ద హిందీ సినిమా అయినా కూడా భయపడాల్సిందే అంటూ ఈ మధ్యే స్టేట్మెంట్ ఇచ్చాడు కరణ్ జోహార్. ఆ మాట ఊరికే అనలేదాయన. బాలీవుడ్ సినిమాల కంటే కూడా ఈ సినిమాకున్న క్రేజ్ ఎక్కువే ఉంది మరి. బహుశా ‘బాహుబలి’ కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఇండియాలో ఇప్పటిదాకా మరే సినిమా కోసం జనాలు ఎదురు చూసి ఉండరంటే కూడా అతిశయోక్తి కాదేమో. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకోవాలని సౌత్ జనాలు ఎంత ఆసక్తిగా ఉన్నారో.. నార్త్ ఆడియన్స్ కూడా అంతే ఉత్కంఠతో ఉన్నారు. ఈ ఆసక్తికి తగ్గట్లే ‘బాహుబలి: ది కంక్లూజన్’ బిజినెస్ రికార్డు స్థాయిలో జరుగుతోంది.

ఇప్పటికే ‘ది కంక్లూజన్’ బిజినెస్ విషయంలో చాలా ఆశ్చర్యకర వార్తలు బయటికి వచ్చాయి. తాజాగా ఈ సినిమా హిందీ శాటిలైట్ రైట్స్ గురించి వినిపిస్తున్న కబురు షాకిస్తోంది. ఏకంగా రూ.51 కోట్లు పెట్టి సోనీ టీవీ ‘బాహుబలి: ది కంక్లూజన్’ శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకుందట. ఇప్పటిదాకా ఇండియాలో అత్యధిక శాటిలైట్ రేటు పలికిన సినిమా ‘సుల్తాన్’. సల్మాన్ ఖాన్ కున్న క్రేజ్ ఎలాంటిదో.. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో అతడి హవా ఎలా సాగుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతడి సినిమాకు దీటుగా రేటు దక్కించుకుని తన ప్రత్యేకతను చాటుకుంది రాజమౌళి ‘బాహుబలి’. సల్మాన్ సినిమా విడుదలై హిట్టయ్యాక అంత రేటు తెచ్చుకుంటే.. రాజమౌళి సినిమా విడుదలకు ఆరు నెలలుండగానే ఈ స్థాయిలో రేటు పలికిందంటే దాని గొప్పదనాన్ని అర్థం చేసుకోవచ్చు.
Tags:    

Similar News