భజరంగి మీద.. 50 కోట్లకు వేశారు

Update: 2015-10-13 07:14 GMT
ఈ ఏడాది బాలీవుడ్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ‘భజరంగి భాయిజాన్’. రూ.600 కోట్లకు పైగా వసూళ్లతో ఆల్ టైం ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్ లలో ఒకటిగా నిలిచింది సల్మాన్ నటించిన ఈ సినిమా. దీనికి కథకుడు మన విజయేంద్ర ప్రసాదే అన్న సంగతి తెలిసిందే. ఈ కథ రాసి దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు విజయేంద్ర ప్రసాద్. కానీ విజయేంద్రుడు రాసింది కాపీ కథ అంటూ టీవీ సీరియల్ ప్రొడ్యూసర్ - డైరెక్టర్ మహిమ్ జోషి కొన్ని రోజుల కిందట ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాను రాసుకున్న స్క్రిప్టును సీన్ టు సీన్ కాపీ చేశారని ఆరోపణలు చేసిన మహిమ్.. అంతటితో ఆగలేదు.

ఈ సినిమా నిర్మాతల మీద ఏకంగా రూ.50 కోట్లకు కాపీ రైట్ చట్టాల కింద దావా వేశాడు. తాను కొన్ని రోజుల కింద ఓ స్క్రిప్టు రాసి ‘వయాకామ్ 18 పిక్చర్స్’ వాళ్లను కలిశానని.. ఐతే ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదని.. ఐతే ‘భజరంగి భాయిజాన్’ చూసి తాను షాకయ్యానని.. తన స్క్రిప్టులోని  సన్నివేశాలను అలాగే దించేశారని అతను ఆరోపిస్తున్నాడు. వయాకామ్ 18 సంస్థకు చెందిన పర్వీజ్ షేక్ కు స్ర్రీన్ ప్లేలో క్రెడిట్ కూడా ఇచ్చారని.. అతనే తన స్క్రిప్టులోని సన్నివేశాల్ని ‘భజరంగి భాయిజాన్’లో వాడేశాడని అంటున్నాడు మహిమ్. అతను వేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు.. డైరెక్టర్ కబీర్ ఖాన్.. నిర్మాతలు రాక్ లైన్ వెంకటేష్, రాజీష్ భట్.. హీరో సల్మాన్ ఖాన్.. రచయిత విజయేంద్ర ప్రసాద్ లకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21 లోపు సమాధానాలు చెప్పాలని ఆదేశించింది.
Tags:    

Similar News