'అఖండ' కోసం ఎన్నో అవస్థలు పడ్డాం: బాలకృష్ణ

Update: 2021-11-28 04:30 GMT
బాలకృష్ణ తాజా చిత్రంగా బోయపాటి దర్శకత్వంలో 'అఖండ' సినిమా రూపొందింది. డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేదికపై బాలకృష్ణ మాట్లాడుతూ .. "ఈ కార్యక్రమానికి వచ్చిన బన్నీకి నా ఆశీస్సులు .. రాజమౌళి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 'అఖండ' విషయానికి వస్తే, ఆల్రెడీ మేము చేసిన కాంబినేషనే. ఇంతకు ముందు ఇద్దరం కలిసి 'సింహా' చేశాము .. 'లెజెండ్' చేశాము. కాకపోతే 'అఖండ' ప్రత్యేకత వేరు.

నాన్నగారి తరువాత నేను ఎక్కువగా అభిమానించేది నా అభిమానులనే. నేను ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా నా వెన్నుతట్టి  ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇలాంటి అభిమానులు ఉన్నందుకు నేను ఎంతో సంతోషిస్తూ ఉంటాను .. గర్విస్తూ ఉంటాను. ఇంతమంది అభిమానులను పొందగలగడం నిజంగా మా అదృష్టం. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ .. పూర్ణ అంతా కూడా చాలా బాగా చేశారు. ఇక శ్రీకాంత్ కూడా తన పాత్రకి న్యాయం చేశాడు. నటుడనేవాడు ఏ పాత్రనైనా చేయగలుగుతాడు. నటనంటే ఒక పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం.

నటులకు మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. అలా వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా చూసుకోవాలి. ఆర్టిస్ట్ అనేవారు ఎప్పుడూ కూడా ప్రేక్షకులకు కనిపిస్తూ ఉండాలి. కానీ దురదృష్టం కొద్దీ  కరోనా రావడం వలన చాలామందికి గ్యాప్ వచ్చేసింది. కొంతమంది సాహసించి కరోనా సమయంలో కూడా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా షూటింగులు చేశారు. మరి మేము ఈ సినిమాను మొదలుపెట్టి 21 నెలలు అయింది. కరోనా కారణంగా షూటింగు ఆగుతూ .. మళ్లీ మొదలవుతూ చాలా ఇబ్బందులను చూశాము.

సినిమాను మొదలుపెట్టాము .. దానిని పూర్తి చేయవలసిందే. అందుకోసం ఎన్నో కష్టాలు పడ్డాం. అందరూ కూడా ఎంతో ఓపిక వహించారు .. ఎంతగానో సహకరించారు. అలాంటివాళ్లందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. త్వరలో 'పుష్ప' ..  'ఆర్ ఆర్ ఆర్' ..  'ఆచార్య' సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి. వాటికి ప్రభుత్వం వైవు నుంచి సహాయ సహకారాలను అందించాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.  
Tags:    

Similar News