పొట్టోడికి పుట్టెడు బుద్ధులు .. నా జీవితం తెరిచిన పుస్తకం: బాలకృష్ణ

Update: 2021-10-15 04:22 GMT
'ఆహా' ఓటీటీ మాధ్యమంలో బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' అనే ఒక టాక్ షో చేయనున్నారు. అందుకు సంబంధించిన 'కర్టెన్ రైజర్' ను నిన్న చాలా సింపుల్ గానే నిర్వహించారు. ఈ వేదికపై బాలకృష్ణ మాట్లాడుతూ .. "ఎన్నో ఏళ్లుగా నేను సాంఘిక .. పౌరాణిక .. జానపద .. సోషియో ఫాంటసీ .. యాక్షన్ సినిమాలు .. కుటుంబ కథా చిత్రాలు చేస్తూ వస్తున్నాను. ఇలా అనేక చిత్రాలలో అనేక పాత్రలను పోషిస్తూ మీకు వినోదాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నాను. మీరంతా కూడా అంతులేని ప్రేమాభిమానాలతో, నేను చేసే ప్రతి ప్రయత్నాన్ని ఆదరిస్తూ .. విజయాలను అందిస్తున్నారు.

ఇంకా ఏదో చేయాలనే ఒక ప్రేరణను .. ఉత్సాహాన్ని నాకు ఇస్తున్నారు. వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. నిజంగా అలాంటి గొప్పతనం మన తెలుగు ప్రేక్షకులదే. 'ఆహా' ఓటీటీ మాధ్యమం .. అల్లు అరవింద్ గారి మానస పుత్రిక. ఎన్నో ఓటీటీ దిగ్గజాల మధ్య ఆయన దీనిని ప్రారంభించారు. ఓటీటీ మాధ్యమాల్లో ఆరితేరిన వారి మధ్య, మనం నిలబడగలుగుతాం అని మరోసారి మన తెలుగువారి సత్తాను చాటిన ఘనుడు మన అల్లు అరవింద్ గారు .. పొట్టివాళ్లకు పుట్టెడు బుద్ధులు అని.

ఆయన గురించి నేను ఎందుకింత చనువుతో మాట్లాడతానంటే, ఆయన కుటుంబంతో మా కుటుంబానికి ఎంతో సాన్నిహిత్యం ఉంది. నేను చిన్నప్పుడు చూశాను .. మా వంటగదిలోకి నేరుగా వెళ్లి మా అమ్మగారితో టీ పెట్టించుకుని మాట్లాడుతూ, 'ఏవమ్మా ఏమన్నా ఉన్నాయా బండోడికి మోయడానికి' అనేవారు. బండోడికి అంటే నాన్నగారికి అని. ఏదున్నా నాకు చెప్పమ్మా .. నేను వెళ్లి ఆయనకు చెబుతాను' అనేవారు. అలా ఇండస్ట్రీలో అంత చనువు ఆయన ఒక్కరికి మాత్రమే ఉండేది. ఆ చనువుతో అలా మాట్లాడాను.

ఇక 'ఆహా' టీమ్ తో కొన్ని రోజులు కలిసి పనిచేస్తూ, ఆ టీమ్ లో నేను ఒకడిని అయ్యాను. సమష్టి కృషితో ఈ కార్యక్రమం ముందుకు వెళుతున్న తీరు నాకు బాగా నచ్చింది. సినిమాల్లో ఎన్నో పాత్రలు చేసినట్టుగానే ఈ కార్యక్రమంలో నాది యాంకర్ పాత్ర. బావిలో కప్పలా ఉండకుండా బయటపడినప్పుడు, అసలు మనిషి ఆవిష్కరించబడతాడు. అలా ఆవిష్కరించే కార్యక్రమమే 'అన్ స్టాపబుల్'. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఒక ప్రయాణం ఉంటుంది .. ఆ ప్రయాణంలోని ఒడిదుడుకులను తట్టుకుంటూ గమ్యానికి చేరిన విధానాన్ని ఆవిష్కరించేదే 'అన్ స్టాపబుల్'.

ఈ కార్యక్రమానికి ఎంతోమంది నటీనటులు వస్తారు .. వాళ్ల భావోదేవగలను పంచుకుంటారు. వాళ్లను ఒక కంఫర్ట్ జోన్లో పెట్టి వాళ్లకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ల ఉద్వేగాలను పంచుకోవడం జరుగుతుంది. నా గురించి అందరికీ తెలుసు .. నేను ఒక తెరిచిన పుస్తకం వంటివాడిని. నా సినిమాల గురించి నాకంటే నా అభిమానులకు బాగా తెలుసు. అలాగే ప్రతి ఒక్కరి జీవిత పుస్తకాన్ని ఆవిష్కరించే ప్రక్రియ ఈ వేదిక ద్వారా జరుగుతుంది. ఎవరికైనా సరే బాధలను చెప్పుకున్నప్పుడే బరువు తగ్గుతుంది. నా వరకూ ఇది కూడా ఒక ప్రజా సేవ వంటిదే . కలుద్దాం .. 'అన్ స్టాపబుల్'లో' అంటూ చెప్పుకొచ్చారు.


Tags:    

Similar News