ఉగాది రోజున 'యోధుడు' ఎనౌన్సుమెంట్‌

Update: 2016-03-24 12:42 GMT
నందమూరి బాలకృష్ణ తన వందో సినిమాపై ఓ క్లారిటీ వచ్చేసింది. మూడు నెలల పాటు సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత.. తన సెంచరీ మూవీపై తుది నిర్ణయానికి వచ్చారు. తన ల్యాండ్ మార్క్ మూవీని అధికారికంగా ప్రకటించడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు బాలయ్య. తెలుగు సంవత్సరాది అయిన ఉగాది నాడు. అంటే ఏప్రిల్ 8న బాలయ్య తన వందో చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది.

శాతవాహన సామ్రాజ్యానికి చెందిన ఆఖరి చక్రవర్తి అయిన గౌతమీ పుత్ర శాతకర్ణి కథను తన వందో సినిమాగా బాలయ్య ఎంచుకున్నారు. చారిత్రాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని క్రిష్ తన స్నేహితుడు రాజీవ్ రెడ్డితో కలిసి నిర్మించనున్నాడు. ఏప్రిల్ 8న సినిమా ప్రకటన చేసి.. ఏప్రిల్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. మే నెలాఖరు వరకు కంటిన్యూగా షూటింగ్ చేసిన తర్వాత.. జూన్ నెలలో ఈ చిత్రానికి బ్రేక్ వేయనున్నారు బాలకృష్ణ.

జూన్ 10న బాలయ్య బర్త్ డే ఉండడంతో పాటు.. ఆ నెలలో యూఎస్ టూర్ లో ఉంటారాయన. అది పూర్తైన తర్వాత.. షూటింగ్ పూర్తయ్యే వరకూ.. వరుసగా షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. బాలయ్య వందో సినిమాకి 'యోధుడు' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని తెలుస్తోంది. టైటిల్ పవర్ ఫుల్ గా ఉందంటూ ఇప్పటికే బాలయ్య అభిమానుల నుంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది.
Tags:    

Similar News