బాలయ్య 100 ప్రకటన ఎప్పుడంటే..

Update: 2016-03-15 11:22 GMT
నందమూరి బాలకృష్ణ ఏ పని చేయాలన్నా ముహూర్తాలు చూసుకుంటాడని.. జాతకాల మీద ఆయనకు బాగా గురి అని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. తన కొడుకు మోక్షజ్న అరంగేట్రం 2017లోనే అని ఫిక్స్ చేసింది కూడా జాతకం ప్రకారమే. తన వందో సినిమా విషయంలో కూడా జాతకాలు - ముహూర్తాల ప్రకారమే నడుచుకుంటున్నారాయన. 99వ సినిమా పూర్తయి నాలుగు నెలలవుతున్నా.. ఇంకా 100వ సినిమా మొదలుపెట్టకపోవడానికి.. కనీసం ప్రకటన అయినా చేయకపోవడానికి కూడా కారణం అదేనట. ఆయన లెక్క ప్రకారం ఈ బుధవారం మంచి ముహూర్తం ఉందని.. ఆ రోజే ప్రకటన చేద్దామనుకుంటున్నారని.. సన్నిహితులు చెబుతున్నారు.

బాలయ్య వందో సినిమా విషయంలో మూడు నెలలుగా రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. బోయపాటి శ్రీనుతో మొదలై.. సింగీతం శ్రీనివాసరావు - అనిల్ రావిపూడి - పరుచూరి రవీంద్ర - జాగర్లమూడి రాధాకృష్ణ - కృష్ణవంశీ.. ఇలా అరడజను పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. చివరగా క్రిష్ పేరు వినిపంచింది. అతడి దర్శకత్వంలో ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమా చేస్తాడని వారం రోజులుగా ఊహాగానాలు నడుస్తున్నాయి. కానీ బాలయ్య స్వయంగా ప్రకటిస్తే తప్ప ఏదీ ఖాయం అనుకోవడానికి లేదు. బాలయ్య మాట కోసమే ఆయన అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్లే బుధవారం నాడు బాలయ్య తన వందో సినిమా గురించి ప్రకటన చేస్తాడో లేదో చూడాలి.

Tags:    

Similar News