బండ్లకు ఈ కొత్త పిచ్చేంటి?

Update: 2016-02-26 05:06 GMT
తీస్తే మన బడా స్టార్లతోనే సినిమాలు తీస్తా అంటూ పట్టు పట్టుకుని కూర్చునే బండ్ల గణేష్.. ఈ మధ్య రూటు మార్చాడు. దాదాపు ఏడాది పాటు వార్తల్లో లేకుండా పోయిన బండ్ల.. ఉన్నట్లుండి ‘టూ కంట్రీస్’ రీమేక్ హక్కులు కొనడం హాట్ టాపిక్ అయింది. కొత్తగా బండ్ల మనసు వేరే భాష మీదికి మళ్లిందేంటి అనుకుంటుంటే.. అంతలోనే లారెన్స్ ‘కాంఛన’ సిరీస్ లో భాగంగా తీయబోయే కొత్త సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి ఒప్పందం చేసుకుని ఆశ్చర్యపరిచాడు. ఐతే బండ్లలో ఉన్నట్లుండి మొదలైన ఈ పరభాషా వ్యామోహం అంతటితో ఆగట్లేదు. మన బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ కళ్లు ఏకంగా రజినీకాంత్ సినిమా మీదే పడ్డట్లుగా సమాచారం అందుతోంది.

రజినీ కొత్త సినిమా ‘కబాలి’ని తెలుగులో తనే రిలీజ్ చేయాలని చూస్తున్నాడట బండ్ల. ఇందుకోసం తమిళ నిర్మాతకు ఫ్యాన్సీ రేటు ఇచ్చి, సినిమా మీద కర్చీఫ్ వేసేసినట్లు సమాచారం. రజినీ గత సినిమా ‘లింగా’ ఇక్కడి బయ్యర్లకు భారీ నష్టాలు మిగిల్చిన నేపథ్యంలో ‘కబాలి’కి ఏమాత్రం బిజినెస్ జరుగుతుందో అన్న సందేహాల్ని పటాపంచలు చేస్తూ.. తమిళ నిర్మాత ఊహించని రేటు ఇచ్చాడట బండ్ల. ఆల్రెడీ లారెన్స్ సినిమాకు కూడా ఇలాగే అతను ఆశించిన దానికంటే ఎక్కువగా రూ.25 కోట్ల దాకా సమర్పించుకోవడానికి రెడీ అయినట్లు చెబుతున్నారు. రజినీ సినిమా కాబట్టి ఇంకో ఐదు వేసి రూ.30 కోట్ల దాకా అయినా ఇవ్వడానికి రెడీ అయి ఉంటాడేమో. ఇప్పటిదాకా స్ట్రెయిట్ సినిమాల విషయంలోనే అతి చేసిన బండ్ల.. డబ్బింగ్ సినిమాల్లోనూ తన రేంజి చూపిస్తున్నాడేమో.

Tags:    

Similar News