RRR ఫేక్ కాస్టింగ్ కాల్ త‌స్మాత్ జాగ్ర‌త్

Update: 2019-09-01 08:14 GMT
ఫేక్ కాస్టింగ్ కాల్.. ఇటీవ‌ల ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌య‌మిది. మిడి మిడి జ్ఞానంతో కాస్టింగ్ కాల్ డైరెక్ట‌ర్ల బాధితులుగా మారుతున్న న‌టీన‌టులెంద‌రో. అస‌లు నిజం ఏది.. అబ‌ద్ధం ఏది? అన్న‌ది తెలియ‌ని దారుణ స‌న్నివేశం సోషల్ మీడియా యుగంలో స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది. ఎవ‌రో క్యాస్టింగ్ కాల్ పిలుపునిస్తే అది నిజ‌మే అని న‌మ్మేసే మూర్ఖ‌త్వం బ‌య‌ట‌ప‌డుతోంది. అయితే ప్రముఖ ద‌ర్శ‌కుల పేరుతో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి మోసాలు చేసే దుర్మార్గులు చాలా మంది ఉన్నారు ఇక్క‌డ‌. ఇంత‌కుముందు ప్ర‌ముఖ టాలీవుడ్ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల పేరుతో అవ‌కాశాలు ఇప్పిస్తామ‌ని డ‌బ్బులు దండుకున్న మోస‌గాడి గురించి తెలిసి అంతా నిర్ఘాంత‌పోయారు. పోలీసుల‌కు ఫిర్యాదు చేసేవ‌ర‌కూ వెళ్లింది. ఈ త‌ర‌హా మోసాలు టాలీవుడ్ లో అడుగుడుగునా క‌నిపిస్తున్నాయి.

చాలా సంద‌ర్భాల్లో కొంద‌రు ద‌ర్శ‌కుల పేర్ల‌తో ఏకంగా సోష‌ల్ మీడియాల్లో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి అవ‌కాశాలు ఇప్పిస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్న కేటుగాళ్ల గురించి బ‌య‌ట‌ప‌డింది. ఇలాంటి గ‌జ‌క‌ర్ణ గోక‌ర్ణ కాస్టింగ్ డైరెక్ట‌ర్ల గురించి బ‌య‌టి ప్ర‌పంచం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. తాజాగా రాజ‌మౌళి పేరుతో ఫేక్ కాస్టింగ్ డైర‌క్ట‌ర్ల వ్య‌వ‌హారం ఆర్.ఆర్.ఆర్ టీమ్ ని.. డీవీవీ సంస్థ‌ను ఖంగు తినిపించిన‌ట్టుంది.  డీవీవీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ అధికారిక ట్విట్ట‌ర్ ద్వారా అందుకు సంబంధించిన వివ‌రాల్ని వెల్ల‌డించారు దాన‌య్య.

రాజ‌మౌళి సోష‌ల్ మీడియా హ్యాక్ అయ్యింద‌ని.. ఆ పేరుతో క్రియేట్ చేసిన ఫేస్ బుక్- ట్విట్ట‌ర్- ఇన్ స్టాగ్ర‌మ్.. ఇలా ఏదీ నిజం కాద‌ని డీవీవీ సంస్థ వార్నింగ్ ఇచ్చింది. వీటి ద్వారా ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి రిక్రూట్ మెంట్లు చేయ‌డం లేదు. రాజ‌మౌళి గారి సోష‌ల్ మీడియాల్ని హ్యాక్ చేసి  ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని డీవీవీ సంస్థ భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేసింది. ఇలాంటి వాళ్ల నుంచి ఏవైనా కాల్స్ వ‌చ్చినా జాగ్ర‌త్త‌గా ఉండండి అంటూ స‌ద‌రు సంస్థ‌ హెచ్చ‌రించింది. ఇలాంటి కేటుగాళ్లు మా దృష్టికి వ‌స్తే బేడీలు వేయించి జైలుకు పంపేందుకు ఊచ‌లు లెక్క పెట్టించేందుకు మాకు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని వార్నింగ్ ని ఇవ్వ‌డం స‌న్నివేశాన్ని వేడెక్కిస్తోంది. ప్ర‌స్తుతం టాలీవుడ్ వినాశ‌కులుగా ముద్ర ప‌డిన చాలా మంది కాస్టింగ్ డైరెక్ట‌ర్ల‌పై నిరంత‌రం ఆర్టిస్టుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇలాంటి టైమ్ లో డీవీవీ సంస్థ ఇలా ప్ర‌క‌టించ‌డం చూస్తుంటే కొంద‌రు డ‌మ్మీ క్యాస్టింగ్ డైరెక్ట‌ర్లు.. సీక్రెట్ గేమ్స్ ఆడే  రాస లీల‌ల‌ కేటుగాళ్ల వ్య‌వ‌హారాలు ప‌రిశ్ర‌మ‌లో ఏ రేంజులో ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. ఇలాంటి వాళ్ల విష‌యంలో ఆర్టిస్టులంతా ఎంతో అలెర్టుగా ఉండాల్సిన స‌న్నివేశం ఉంది. త‌స్మాత్ జాగ్ర‌త్త‌!!
Tags:    

Similar News