సామాన్యుల‌కు బిగ్ బాస్ గుడ్ న్యూస్‌

Update: 2022-05-27 02:30 GMT
ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌బాస్ రియాలీటీ షో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఈ షోపై అదే స్థాయిలో వివాదాలు కూడా చుట్టుముడుతూనే వున్నాయి. అయినా స‌రే ఏ వివాదాన్ని ప‌ట్టించుకోకుండా బిగ్‌బాస్ నిర్వాహ‌కులు త‌మ ప‌ని తాము చేసుకుంటూ వెళుతున్నారు. ఇటీవ‌ల బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ఓటీటీ వెర్ష‌న్ కు తెర‌లేపిన విష‌యం తెలిసిందే. తొలిసారి ఓటీటీలో మొద‌లైన ఈ షోపై కూడా ప‌లువురు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం.. కంటెస్టెంట్ ల ర‌చ్చ తెలిసిందే.

ఇటీవ‌లే బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ వెర్ష‌న్ విజ‌య‌వంతంగా ముగిసింది. ఈ షోలో బిందు మాధ‌వి విజేత‌గా నిలిచి దాదాపు ప్రైజ్ మ‌నీతో పాటు 12 వారాల‌కు గానూ 90 ల‌క్ష‌లు సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం త‌న‌కు టాలీవుడ్ లో భారీ ఆఫర్లు ల‌భిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇటీవ‌లే ఓ స్టార్ హీరో సినిమాలో న‌టించే ఆఫ‌ర్ బిందు మాధ‌విని వెతుక్కుంటూ వ‌చ్చింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇదిలా వుంటే ఇటీవల బిగ్ బాస్ సీజ‌న్ 5 ముగిసింది. వీజే స‌న్నీ విజేత‌గా నిలిచాడు. ఇప్ప‌డు సీజ‌న్ 6 త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతోంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ సీజ‌న్ పూర్త‌యిన వెంట‌నే బిగ్ బాస్ సీజ‌న్ 6 మొద‌లు కానుంద‌ని మొద‌టి నుంచి ప్ర‌చారం అవుతున్న నేప‌థ్యంలో తాజాగా బిగ్ బాస్ సీజ‌న్ 6 కి సంబంధించిన ఓ ప్రోమోని స్టార్ మా రిలీజ్ చేసింది. ఈ సీజ‌న్ కు కూడా నాగార్జున‌నే హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు.

తాజాగా రిలీజ్ చేసిన ప్ర‌మోలో సామాన్యులకు బిగ్ బాస్ నిర్వాహ‌కులు గుడ్ న్యూస్ చెప్ప‌డం విశేషం. సీజ‌న్ 6 లో సామాన్యుల‌కు కూడా అవ‌కాశం క‌ల్పిస్తున్నామంటూ నిర్వాహ‌కులు ప్ర‌క‌టించారు. సామాన్యుల‌కు ఆహ్వానం ప‌లుకుతున్నామ‌ని, సీజ‌న్ 6 తో సామాన్యులు కూడా హౌస్ లోకి అడుగుపెట్టొచ్చంటూ బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు.

'ఇన్నాళ్లూ ఇంట్లో వుండి బిగ్ బాస్ చూశారు. ఇప్ప‌డు ఆ ఇంట్లో వుండాల‌నుకుంటున్నారు క‌దూ.. వ‌న్ టైమ్ గోల్డెన్ ఛాన్స్. టికెట్ టు బిగ్ బాస్ సీజ‌న్ 6' అంటూ నాగార్జున తాజాగా విడుద‌ల చేసిన బిగ్ బాస్ సీజ‌న్ 6 ప్రోమోలో చెప్పిన మాట‌లు ఇప్ప‌డు వైర‌ల్ గా మారాయి.

అంటే సీజ‌న్ సిక్స్ లో సామాన్యుల‌కు కూడా అవ‌కాశం క‌ల్పిస్తున్నార‌న్న‌మాట. ప్ర‌తీ సీజ‌న్ లో సెల‌బ్రిటీల‌తో పాటు ట్రాన్స్ జెండ‌ర్‌, ఓ మీడియా వ్య‌క్తికి ఛాన్స్ ఇస్తూ వ‌చ్చిన బిగ్ బాస్ వ‌ర్గాలు ఆ జాబితాలో ఈ సారి సామాన్యుడిని కూడా చేర్చ‌డం విశేషం.



Full ViewFull ViewFull ViewFull View
Tags:    

Similar News