వెండితెర‌పై బ‌యోపిక్కుల‌ దండ‌యాత్ర?

Update: 2022-06-22 02:30 GMT
చాలా వ‌ర‌కు ఇండ‌స్ట్రీలు క‌థ‌ల కోర‌తతో అల్లాడుతున్న స‌మ‌యంలో బయోపిక్కుల ట్రెండ్ మొద‌లైంది. వివిధ రంగాల్లో విశిష్ట సేవ‌లందించి విజేత‌లుగా నిలిచిన ఎంతో మంది క‌థ‌ల్ని బ‌యోపిక్ లుగా తెర‌పైకి తీసుకురావ‌డం మొద‌లు పెట్టారు. ఈ త‌ర‌హా క‌థ‌ల్లో డ్రామాతో పాటు విజేత‌గా నిలిచి క్ర‌మం స్ఫూర్తివంతంగా వుండ‌టంతో చాలా వ‌ర‌కు ప్రేక్ష‌కులు బ‌యోపిక్ ల‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్ట‌డం మొద‌లు పెట్టారు. ఈ నేప‌థ్యంలో చాలా వ‌ర‌కు బ‌యోపిక్ లు వెండితెర‌పై ఆవిష్కృతం కావ‌డం మొదలైంది.

ద‌ర్శ‌కులు, హీరోలు కూడా బ‌యోపిక్ ల‌పై ఆస‌క్తిని చూపించ‌డం, వీటికి ప్ర‌త్యేకులు ప్ర‌త్యేకంగా చూస్తుండ‌టంతో వెండితెర‌పై బ‌యోపిక్ ల ప్ర‌వాహం మొద‌లైంది. ఇప్ప‌టికి చాలా వ‌ర‌కు బ‌యోపిక్ లు తెర‌పై కొచ్చాయి. అందులో మ‌హాన‌టి, ఎం.ఎస్ థోని, మ‌ల్లేశం, భాగ్ మిల్కా భాగ్‌, యాత్ర‌, ఎన్టీఆర్‌, థాక‌రే, సంజూ, ఆకాశం నీ హ‌ద్దురా, దంగ‌ల్‌, సుల్తాన్‌, పాన్ సింగ్ తోమ‌ర్‌, మేరీకోమ్‌, అజాహ‌రుద్దీన్‌, స‌చిన్, 83 వంటి సినిమాలు చాలానే వ‌చ్చాయి. అందులో చాలా వ‌ర‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ లుగా నిలిచాయి.

అయితే జ‌య‌ల‌లిత జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన `త‌లైవి`, ఎన్ .టి. రామారావు బ‌యోపిక్ లు చాలా వ‌ర‌కు డిజాస్ట‌ర్ గా మిగిలాయి. ఈ ఇద్ద‌రి జీవిత క‌థ‌లు భారీ స్థాయిలో సంచ‌ల‌నాలు సృష్టిస్తాయ‌ని చాలా మంది ఊహించారు. కానీ ఎన్టీఆర్ బ‌యోపిక్ ని య‌దా త‌దంగా చేయ‌క‌పోవ‌డం, త‌లైవి ని ప‌ర్ ఫెక్ట్ గా ప్రెజెంట్ చేయ‌క పోవ‌డంతో ఈ ఇద్ద‌రి జీవిత క‌థ‌ల నేప‌థ్యంలో వ‌చ్చిన చిత్రాలు పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక ఉసూరుమ‌నిపించాయి.

అయితే మ‌ల్లెశం, మ‌హాన‌టి, ఎం.ఎస్ థోని వంటి చిత్రాలు మంచి విజ‌యాల్ని సొంతం చేసుకోవ‌డంతో చాలా మంది మేక‌ర్స్ భారీ స్థాయిలో బ‌యోపిక్ ల నిర్మాణం చేప‌ట్టారు. ప్ర‌స్తుతం నిర్మాణంలో చాలా సినిమాలున్నాయి. త్వ‌ర‌లో ప్రారంభం కానున్న‌వి కూడా క‌లిపి మొత్తం 15 చిత్రాల వ‌ర‌కు వుండ‌టం విశేషం. తెలుగులో బ్యాడ్మింట‌న్ స్టార్ పుల్లెల గోపీచంద్ బ‌యోపిక్ రానుంది, గ‌త కొంత కాలంగా చ‌ర్చ‌ల ద‌శ‌లో వున్న ఈ జీవిత క‌థ‌కు త్వ‌ర‌లోనే మోక్షం ల‌భించ‌డం ఖాయం అంటున్నారు.

ఇక హిందీలో బ‌యోపిక్ ల‌కు సంబంధించి పెద్ద లిస్టే వుంది. ప్ర‌స్తుతం ఇండియ‌న్ మ‌హిళా క్రికెట్ లో కెప్టెన్ గా స‌త్తా చాటిన మిథాలీ రాజ్ జీవిత క‌థ ఆధారంగా `శ‌భాష్ మిథూ` రూపొందుతోంది. తాప్సీ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీని జూలై 15న విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇక క్రికెట‌ర్ సౌర‌భ్ గంగూలీ లైఫ్ స్టోరీ ఆధారంగా ఓ మూవీకి శ్రీ‌కారం చుడుతున్నారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌యింది. త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది.  

పూల‌న్ దేవిని హ‌త్య చేసిన పంక‌జ్ సింగ్ పున్దీర్ క‌థ‌తో ఓ మూవీ, క‌పిల్ శ‌ర్మ జ‌ర్నీ నేప‌థ్యంలో `ఫ‌న్కార్‌`, మ‌హాత్మా జ్యోతీరావు పూలే, ఉషా మోహ‌తా, సుబ్ర‌తా రాయ్‌, స‌రోజ్ ఖాన్‌, కేఫ్ క‌ఫీడే అధినేత విజి సిద్ధార్ధ ల క‌థ‌లతో పాటు మ‌రి కొంత మంది బ‌యోపిక్ లు కూడా వెండితెర‌పైకి రాబోతున్నాయి. మ‌రి కొన్ని చ‌ర్చ‌ల ద‌శ‌లో వున్నాయి.
Tags:    

Similar News