బాలీవుడ్ బొమ్మాళీలంటే నిర్మాత‌ల్లో ఒణుకు!

Update: 2022-04-01 04:45 GMT
ఇటీవ‌లి కాలంలో తెలుగు సినిమాల్లో బాలీవుడ్ నాయిక‌ల వెల్లువ త‌గ్గిన సంగ‌తి తెలిసిందే. ఇంత‌కుముందులా రెగ్యుల‌ర్ గా బాలీవుడ్ హీరోయిన్ల‌ను మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఎంపిక చేయ‌డం లేదు. ఇప్పుడున్న వారిలో పూజా హెగ్డే- ఆలియా భ‌ట్ పేర్లు త‌ప్ప ఇంకేవీ వినిపించడం లేదు. కియ‌రా అద్వాణీ- కృతి స‌నోన్  పేర్లు అడ‌పాద‌డ‌పా వినిపిస్తున్నాయి. భారీ చిత్రాల‌తోనే వీళ్ల పేర్లు వినిపిస్తున్నాయి.

చోటా మోటా ద‌ర్శ‌క‌నిర్మాత‌లెవ‌రూ వీళ్ల‌ను సంప్ర‌దించిందేమీ లేదు. ఇంత‌కుముందు శిల్పా శెట్టి .. ప్రీతి జింతా కాలం ఇప్పుడు లేదు. ఇటీవ‌లి కాలంలో కొత్త త‌రం నాయిక‌లు కూడా భారీ పారితోషికాలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు ర‌క‌ర‌కాల కండీష‌న్లు పెడుతున్నారు. దీంతో  తెలుగు ఫిలింమేక‌ర్స్ బెంబేలెత్తుతున్నారు.

అస‌లు స‌మ‌స్య ఎక్క‌డ ఉంది? పారితోషికంలోనా లేక గొంతెమ్మ కోర్కెల విష‌యంలోనా? అంటే ఆ రెండో పాయింట్ ని ఎక్కువ‌మంది సూచిస్తున్నారు. దాదాపు 4-5 కోట్లు చెల్లించేందుకు కూడా మ‌న నిర్మాత‌లు సిద్ధంగానే ఉన్నా కానీ ఇత‌ర స‌మ‌స్య‌లున్నాయి. బాలీవుడ్ క‌థానాయిక‌ల‌ను ఎంపిక చేస్తే పాన్ ఇండియా మార్కెట్ కి ప్ల‌స్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు.

అందువ‌ల్ల పారితోషికం ఎంతైనా ఇచ్చేందుకు వెన‌కాడ‌డం లేదు. కానీ అందాల నాయిక‌ల‌తో అస‌లు స‌మ‌స్య అంతా ప‌ర్స‌న‌ల్ స్టాఫ్ తోనే. మేక‌ప్ మేన్ ..  స్టైలిస్ట్.. ప‌ర్స‌న‌ల్ గార్డ్.. మేనేజ‌ర్.. మ‌మ్మీ .. సిస్ట‌ర్ .. బోయ్ ఫ్రెండ్ .. అంటూ ప‌ది మందిని వెంటేసుకొస్తుంటారు స‌ద‌రు భామ‌లు. వీళ్లంద‌రి ఖ‌ర్చుల్ని నిర్మాత భ‌రించాల్సి ఉంటుంది. భ‌య‌ప‌డేదంతా వీళ్ల గురించే.

హీరోయిన్ హైద‌రాబాద్ కి వ‌చ్చింది అంటే చాలు.. స్టాఫ్‌ బిల్స్ త‌డిసి మోపెడు అయిపోతున్నాయ‌ట నిర్మాత‌ల‌కు. పైగా ప్ర‌మోష‌న్స్ కి పిల‌వాలంటే కూడా భ‌య‌ప‌డిపోతున్నారు. వ‌స్తారో రారో కూడా తెలీదు. ఇక అయిన‌దానికి కానిదానికి ఖ‌ర్చులు అద‌న‌పు భారంగా మారుతున్నాయి. ఇంత‌కుముందు ప్ర‌ముఖ ముంబై హీరోయిన్ ఇలా త‌న స్టాఫ్ విష‌యంలో నిర్మాత‌ల‌ను స‌తాయిస్తోంద‌ని క‌థనాలొచ్చాయి.

త‌న‌పై బ‌హిరంగంగానే ఆర్టిస్టుల‌ అసోసియేష‌న్ పెద్ద కామెంట్ చేయ‌డం దుమారం సృష్టించింది. ఇదే కాదు.. చాలా సంద‌ర్భాల్లో నిర్మాత‌ల‌తో హీరోయిన్ల క‌ల‌త‌లు బ‌య‌ట‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే టాలీవుడ్ లో కొంద‌రు క‌థానాయిక‌లు త‌మ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు అనుకూలంగానూ విధేయ‌త‌ను క‌న‌బ‌రుస్తున్నారు. ఇలాంటి వారికి వ‌రుస‌గా అవ‌కాశాలు ద‌క్కుతున్నాయ‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం.
Tags:    

Similar News