పిల్లల సినిమా తీస్తానంటున్న బొమ్మరిల్లు భాస్కర్

Update: 2017-11-12 06:11 GMT
‘బొమ్మరిల్లు’ లాంటి ఆల్ టైం క్లాసిక్ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు భాస్కర్. ఐతే తొలి సినిమాతో తనపై భారీగా అంచనాలు పెంచేసిన భాస్కర్.. ఆ తర్వాత ఆ అంచనాల్ని అందుకోలేకపోయాడు. రెండో సినిమా ‘పరుగు’ పర్వాలేదనిపించినప్పటికీ ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ బోల్తా కొట్టేశాయి. రామ్ చరణ్ తో చేసిన ‘ఆరెంజ్’ అతడి కెరీర్ ను అతలాకుతలం చేసింది. చివరగా తెలుగులో ‘ఒంగోలుగిత్త’ అనే సినిమా చేసిన భాస్కర్ నాలుగేళ్లుగా అడ్రస్ లేడసలు. తమిళంలో తీసిన ‘బెంగళూరు డేస్’ రీమేక్ కూడా అతడికి దారుణమైన ఫలితాన్నందించింది. కొన్నేళ్లుగా అసలు హైదరాబాద్ లో కనిపించని భాస్కర్.. ప్రస్తుతం భాగ్యనగరంలో జరుగుతున్న చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా తాను  బాలల చిత్రం తీయబోతున్నట్లు భాస్కర్ చెప్పడం విశేషం. ‘‘అమీర్ ఖాన్ తీసిన ‘తారే జమీన్ పర్’ లాంటి సినిమా చేయాలని నాకు ఎప్పట్నుంచో బలమైన కోరిక ఉంది. కొన్నేళ్లుగా నన్ను ఓ కథ వెంటాడుతోంది. పిల్లల మీద తీయబోయే సినిమా అది. ఆ కథను సినిమాగా తీస్తే అద్భుతంగా ఉంటుంది. కచ్చితంగా ఆ సినిమా చేసి తీరుతా. అది ఎప్పుడన్నది కచ్చితంగా చెప్పలేను. దీంతో పాటు నా తర్వాతి సినిమాకు ఓ కథ సిద్ధం చేస్తున్నా. నేను దేశంలో ఎక్కడ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ జరిగినా కచ్చితంగా హాజరవుతాను. ఇక్కడ మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఐతే హైదరాబాద్ లో జరిగే చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ కు ఇండస్ట్రీ నుంచి పెద్దగా జనాలు రాకపోవడం నిరాశ కలిగిస్తోంది’’ అని భాస్కర్ చెప్పాడు.
Tags:    

Similar News