నవ్వేవాళ్లు నవ్వనీ.. బోయపాటి స్టైల్ అంతే

Update: 2021-11-09 02:30 GMT
సినిమాకు దర్శకుడు కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారే కానీ.. ఫేస్ ఆఫ్ ద సినిమా అని ఎవ్వరూ అనరు. దర్శకుడనేవాడు ఎప్పుడూ తెర వెనుకే ఉంటాడు. ముందుకొచ్చి బిల్డప్‌లు ఇవ్వడు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో చాలామంది సైలెంటుగా తమ పని తాము చేసుకుపోయేవారే. కెమెరాలో తమ ముఖం కపినించాలని.. తామెంత కష్టపడుతున్నామో.. ఎలా సినిమా తీస్తున్నామో అందరికీ చూపించాలని కోరుకోరు. సినిమాల ప్రమోషన్లలో కూడా అలా చేశాం.. ఇలా చేశాం.. ఇంత పొడిచేశాం అంటూ దర్శకులు తమ గురించి తాము గొప్పలు పోవడం అంతగా కనిపించదు. కానీ బోయపాటి శ్రీను మాత్రం ఇందుకు మినహాయింపు. ఆయన సెల్ఫ్ ప్రమోషన్లు, బిల్డప్‌ల గురించి అందరికీ తెలిసిందే. సినిమా ప్రారంభంలో హీరో కంటే ముందు తనను తాను చూపించుకుని యాక్షన్ చెప్పే షాట్ పెట్టి సినిమా ఓపెన్ చేయడం బోయపాటి స్టైల్.

ఇక బోయపాటి తన సినిమాల వేడుకల్లో చెప్పుకునే గొప్పల గురించి కూడా ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇవన్నీ ఒకెత్తయితే.. తన సినిమాల మేకింగ్ వీడియోలు, ఏవైనా పాటల తాలూకు లిరికల్ వీడియోలు రిలీజ్ చేస్తే బోయపాటి చేసే అతి మామూలుగా ఉండదు. ప్రతి సీన్, ప్రతి షాట్ తాను చేసి చూపిస్తేనే ఆర్టిస్టు చేసినట్లుగా బిల్డప్‌లు ఉంటాయి. ఇలాంటి వాటి మీద సోషల్ మీడియాలో ఎన్ని కౌంటర్లు పడినా.. ఎవరెన్ని సెటైర్లు వేసినా బోయపాటి పట్టించుకోడు. ఇలాంటి వీడియోల్లో తాను చేసే అతి మీమ్ మెటీరియల్‌గా మారినా బోయపాటి ఏం మారడు. నవ్వేవాళ్లు నవ్వనీ.. అన్నట్లుగా తన స్టయిల్లో తాను వెళ్లిపోతుంటాడు. తాజాగా ‘అఖండ’ టైటిల్ సాంగ్ వీడియో అందుకు తాజా రుజువు. ఇందులోనూ మధ్యలో బోయపాటి బిల్డప్ షాట్లు వేశారు. అవి చూసి ఎప్పట్లాగే నెటిజన్లు బోయపాటిని ట్రోల్ చేస్తున్నారు. మీమ్స్ వేస్తున్నారు. అవి చూసినా బోయపాటి మారతాడా అంటే డౌటే.


Tags:    

Similar News