సింధు బ‌యోపిక్ బోయ‌పాటి చేయ‌లేదేం?

Update: 2019-09-07 04:51 GMT
ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో బ‌యోపిక్ ల ట్రెండ్ న‌డుస్తోంది. పాపుల‌ర్ క్రీడాకారుల బ‌యోపిక్ లు తెర‌కెక్కించేందుకు ఫిలిం మేక‌ర్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే హిందీ ప‌రిశ్ర‌మ‌తో పోలిస్తే టాలీవుడ్ లో ఇలాంటి ప్ర‌య‌త్నాలు చాలా త‌క్కువ అనే చెప్పాలి. హైద‌రాబాద్ కి చెందిన ప్ర‌ముఖ క్రీడాకారుల బ‌యోపిక్ లు అన్నీ బాలీవుడ్ వాళ్లే చేస్తున్నారు. మ‌న క‌మ‌ర్షియ‌ల్ ద‌ర్శ‌కులెవ‌రూ వాటిని ట‌చ్ చేయ‌డం లేదు ఎందుక‌నో. క్రీడా బ‌యోపిక్ లు అంటే యువ‌త‌రానికి ఎంతో స్ఫూర్తినిస్తాయి. కానీ ఆ ప్ర‌య‌త్నం మ‌న ద‌గ్గ‌ర జీరో అయిపోయింద‌న్న ఆవేద‌న క‌నిపిస్తోంది.

హైద‌రాబాదీ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి.. తెలుగ‌మ్మాయి సైనా నెహ్వాల్ బ‌యోపిక్ ని బాలీవుడ్ లోనే తెర‌కెక్కిస్తున్నారు. ప‌రిణీతి చోప్రా టైటిల్ పాత్ర పోషించనుంది. అలానే బ్యాడ్మింట‌న్ ప్ర‌పంచ చాంపియ‌న్ పీవీ సింధు బ‌యోపిక్ ని బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ నిర్మిస్తున్నారు. అలాగే సానియా బ‌యోపిక్ ని బాలీవుడ్ నిర్మాత‌లే ప్లాన్ చేస్తున్నార‌ని వార్త‌లొస్తున్నాయి. పుల్లెల గోపిచంద్ బ‌యోపిక్ లో మాత్రం సుధీర్ బాబు న‌టిస్తున్నారు. కానీ పొరుగు భాష‌ల మేక‌ర్స్ మాత్ర‌మే ఆస‌క్తిని చూపించారు. అయితే మ‌న ద‌ర్శ‌క‌ నిర్మాత‌లు ఎందుకని ఆస‌క్తి చూపించ‌డం లేదు. క్రీడా బ‌యోపిక్ ల‌పై ఆస‌క్తి లేదా? మాస్ మసాలా క‌మ‌ర్షియ‌ల్ అంశాలు లేక‌పోతే సినిమాలు తీయ‌రా?

అన్న‌ట్టు నిన్న సాయంత్రం కిచ్చా సుదీప్ హీరోగా తెరకెక్కిన పహిల్వాన్ ఆడియో ఈవెంట్ లో పీవీ సింధుతో పాటుగా మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా పీవీ సింధు ప్ర‌తిభ గురించి బోయ‌పాటి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ప‌హిల్వాన్ చిత్రం కోసం సుదీప్ ఎంత‌గా శ్ర‌మించారో పీవీ సింధు గొప్ప‌గా అభివ‌ర్ణించారు. అంతా బాగానే ఉంది కానీ ఒక తెలుగ‌మ్మాయి అయిన‌ పీవీ సింధు బ‌యోపిక్ ని తెలుగు ద‌ర్శ‌కులు ఎవ‌రూ ప్లాన్ చేయ‌క‌పోవ‌డ‌మే వింత‌గా అనిపించింది. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి త‌న పంథాని వీడి ఏదైనా కొత్త‌గా ప్ర‌య‌త్నిస్తారా? అంటే అలాంటి ప్ర‌య‌త్న‌మే క‌నిపించ‌లేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. క్రీడాకారుల బ‌యోపిక్ ల‌ను స‌త్తా ఉంటే ఎంతో ఎమోష‌న‌ల్ గా చూపించ‌వ‌చ్చ‌ని క‌మ‌ర్షియ‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్లు సాధించ‌డం క‌ష్ట‌మేమీ కాద‌ని ప‌లువురు ఫిలింమేక‌ర్స్ నిరూపించారు. అలాంట‌ప్పుడు మ‌న ఇంటి క్రీడాకారుల క‌థ‌ల్ని మ‌న క్రియేటివ్ డైరెక్ట‌ర్స్ ఎందుక‌ని విస్మ‌రిస్తున్నారు?  పొరుగు నుంచి వ‌చ్చిన‌ వాళ్లు తీస్తేనే మ‌నం చూడాలా?


Tags:    

Similar News