సేంద్రీయ వ్యవసాయంలోకి బన్నీ..?

Update: 2021-10-09 10:30 GMT
టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల హైదరాబాద్ శివార్లలో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల పరిధిలోని జనవాడ గ్రామంలో రెండు ఎకరాల పొలం ను బన్నీ తీసుకున్నారు. మండలం తాసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తయ్యాయి. శంకర్ పల్లి ఎమ్మార్యో ఆఫీస్ కు బన్నీ విచ్చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే అల్లు అర్జున్ ఈ భూమిని కొనుగోలు చేసింది ఆర్గానిక్ ఫార్మింగ్ (సేంద్రియ వ్యవసాయం) కోసం అని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.

ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం బన్నీ ఈ వ్యవసాయ భూమిని సేంద్రీయ పండ్లు మరియు కూరగాయల సాగు కోసం ఉపయోగించాలనుకుంటున్నారట. నర్సరీలు - సేంద్రీయ వ్యవసాయానికి హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లి అనువైన ప్రదేశంగా భావిస్తుంటారు. గత కొన్నేళ్లుగా సేంద్రీయ ఆహారం ఎంత ప్రముఖంగా మారిందో అందరికీ తెలిసిందే. అందులోనూ దట్టమైన అడవులలో 'పుష్ప' షూటింగ్ చేసిన అల్లు అర్జున్.. పర్యావరణం మరియు వృక్ష సంపద మీద ప్రేమ పెంచుకున్నారని తెలుస్తోంది. ఇప్పుడు సేంద్రియ వ్యవసాయాన్ని ఎంచుకోవడానికి ఇదొక కారణం కావచ్చని అంటున్నారు.

ఇదిలా ఉంటే, అల్లు అర్జున్ హీరోగా రెండు భాగాలుగా రూపొందుతున్న 'పుష్ప' చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. విలన్ గా ఫహద్ ఫాసిల్ కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది.

ఇప్పటికే విడుదలైన 'పుష్ప' ఫస్ట్ లుక్ - టీజర్ - ఫస్ట్ సింగిల్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. దసరా పండుగ సందర్భంగా రెండో పాటను రిలీజ్ చేసే అవకాశం ఉంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ.. ఆంటోనీ రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. 'పుష్ప' మొదటి భాగాన్ని డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.


Tags:    

Similar News