సీసీటీవీ ఫుటేజ్ అంశం నా పరిధిలో లేదు: 'మా' ఎన్నికల అధికారి

Update: 2021-10-22 14:30 GMT
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వివాదంలో పోలింగ్ రోజు నాటి సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారింది. ఎన్నికలు ఉద్రిక్తత వాతావరణంలో జరిగాయని.. అవకతవకలు జరిగాయని పేర్కొంటూ.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ 'మా' ఎలక్షన్ నాటి సీసీటీవీ ఫుటేజ్ కావాలని ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు లేఖ రాశారు. అయితే ప్రకాశ్ రాజ్ అడిగిన 'మా' ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలా వద్దా అనే అంశం తన పరిధిలో లేదని.. అది 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు పరిధిలో ఉంటుందని తాజాగా కృష్ణమోహన్ తెలిపారు.

'మా' ఎన్నికలలో వైస్సార్సీపీ ప్రమేయం ఉందంటూ ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ వేదికగా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసిన నేపథ్యంలో కృష్ణమోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 'మా' ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌తోనే త‌న బాధ్య‌త పూర్త‌య్యింద‌ని.., ఆ తర్వాత జోక్యం చేసుకోవడానికి తనకు అధికారాలు లేవని స్పష్టం చేశారు. ఎన్నికలు జరిగిన రోజున.. కౌంటింగ్‌ జరిగిన సమయంలో తనకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని.. అప్పుడే ఫిర్యాదు చేసుంటే చర్యలు తీసుకునేవాడిననని 'మా' ఎన్నికల అధికారి అన్నారు.

''సీసీటీవీ ఫుటేజ్ వ్యవహారం ఇప్పుడు నా పరిధిలో లేదు. ఆ ఫుటేజ్ ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం 'మా' అధ్యక్షుడైన మంచు విష్ణు పరిధిలో ఉంది. అలాగే ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకునే అధికారం కూడా మంచు విష్ణుకే ఉంది. 'మా' ఎన్నికలు నిర్వహించడంతో నా బాధ్యత పూర్తయింది. ఆ తర్వాత జరిగే పరిణామాలు నా పరిధిలోకి రావు. 'మా' ఎన్నికలు జరిగిన సమయంలో కానీ.. కౌంటింగ్ సమయంలో కానీ ఏవైనా ఫిర్యాదులు వచ్చి ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకునేవాడిని. అప్పుడు ఎవరూ ఫిర్యాదు చేయలేదు'' అని కృష్ణమోషన్ అన్నారు.

తొలిసారి ప్రకాష్ రాజ్ సీసీ ఫుటేజీ అడిగినప్పుడు పరిశీలించి చెప్తానని మాత్రమే అన్నానని.. ఇస్తానని అనలేదని 'మా' ఎన్నికల అధికారి తెలిపారు. న్యాయ‌స్థానం ఆదేశాల మేర‌కు తాను న‌డుచుకుంటాన‌ని.. ఇకపై అధికారమంతా అధ్యక్షుడి చేతిలోనే ఉంటుందని కృష్ణ మోహన్ పేర్కొన్నారు. ఎన్నికల్లో వైకాపా నాయకుల జోక్యముందని ప్రకాశ్‌ రాజ్‌ చేసిన ఆరోపణలపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.

కాగా, 'మా' ఎన్నికల రోజున తమపై ప్రత్యర్థి వర్గం సభ్యులు దౌర్జన్యం చేశారని.. తమ సభ్యుల పై దాడి చేశారని మంచు విష్ణు ప్యానల్ మీద ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీసీ కెమెరాలు అన్ని విషయాలను రికార్డు చేసుంటాయని.. అందుకే సీసీటీవీ ఫుటేజీ ఇచ్చి అనుమానాలను నివృత్తి చేసుకుంటామని కోరుతున్నామని ఎన్నికల అధికారికి ప్రకాష్ రాజ్ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజీ కావాలంటే నిబంధనల ప్రకారం కోర్టుకు వెళ్లాలని కృష్ణ మోహన్ స్పష్టం చేశారు.
Tags:    

Similar News