మోడీ సినిమాకు నో అన్న సెన్సార్ బోర్డ్

Update: 2017-02-09 13:50 GMT
దేశ ప్రధానిని ఎలివేట్ చేస్తూ.. ఆయన్ను గొప్పగా చిత్రీకరిస్తూ తీసిన సినిమాకు సెన్సార్ చిక్కులు ఉంటాయా? అన్న సందేహం కలగొచ్చు. కానీ.. తాజాగా ప్రధాని మోడీని.. ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రేరణగా తీసుకొని నిర్మించిన ‘‘మోదీ కా గావ్’ చిత్రానికి సెన్సార్ చేసేందుకు సెన్సార్ బోర్డ్ నో చెప్పేసింది. ఈ చిత్రాన్ని రేపు (ఫిబ్రవరి 10న) విడుదల చేయాలని భావించారు.

అయితే.. ఈ చిత్రాన్ని సెన్సార్ చేసేందుకు సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ చిత్ర విడుదలకు అవసరమైన సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేమని పేర్కొంది. ఎన్నికల కమిషన్ నుంచి సినిమా రిలీజ్ కు ఎలాంటి అభ్యంతరం లేదన్న పత్రాన్ని తీసుకొస్తే తాము చిత్ర విడుదలకు అనుమతి ఇస్తామని పేర్కొంది.

ముంబయికి చెందిన వికాస్ మహంతను పలువురు ముంబయి మోడీగా అభివర్ణిస్తారు. అలాంటి వికాస్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ సినిమాకు సెన్సార్ కు బోర్డు నో చెప్పేసింది. 135 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్ర షూటింగ్ గత డిసెంబరులో పూర్తి చేశారు. ఈ చిత్ర ప్రీమియర్ షోను ప్రధాని మోడీకి చూపించాలని భావిస్తున్నట్లుగా  నిర్మాత ఝూ చెబుతున్నారు. స్మార్ట్ సిటీలను నిర్మించాలన్న మోడీ స్వప్నాన్ని ఆవిష్కరించే లక్ష్యంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రధానిని ఎలివేట్ చేసేలా తీసిన సినిమాకు సెన్సార్ చిక్కులు ఎదురుకావటం చూస్తే.. చట్టం తన పని తాను చేస్తున్నట్లుగా చెప్పక తప్పదేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News