సెన్సార్ వాళ్ల షరతులు టూమచ్ గా లేవూ!

Update: 2015-08-22 14:11 GMT
ఒకప్పుడు సినిమాల్లో పాత్రధారులు మందుకొట్టినా, సిగరెట్ తాగినా హెచ్చరికల్లాంటివేమీ ఉండేవి కావు. సినిమా ఆరంభానికి ముందు కూడా ఎలాంటి కాషన్ ఇచ్చేవారు కాదు. ఐతే ఇప్పుడు హీరోలే స్వయంగా కాషన్ చదివి వినిపిస్తున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం తప్పనిసరి చేసిన ప్రకటనను కూడా ప్రదర్శిస్తున్నారు. ఏదైనా సన్నివేశంలో పాత్రధారులు మందు కొడుతున్నా, దమ్ము లాగుతున్నా కింద వాటర్ మార్క్ తో కాషన్ ఇస్తున్నారు. వీటి విషయంలో ఎవరికీ అభ్యంతరాల్లేవు కానీ.. ఇప్పుడింకో కొత్త సంప్రదాయం మొదలైంది. సినిమాల కోసం జంతువుల్ని, పక్షుల్ని వినియోగించడం మీద నిషేధం ఉన్న నేపథ్యంలో గ్రాఫిక్స్ నే ఆశ్రయిస్తున్నారు మూవీ మేకర్స్. సినిమా మొదలవడానికి ముందు జంతువుల్ని ఉపయోగించలేదని, హింసించలేదని ప్రకటన కూడా ఇస్తున్నారు.

ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ.. తెరమీద జంతువులు, పక్షులకు సంబంధించి గ్రాఫిక్ సన్నివేశాలు కనిపించినపుడల్లా కింద ‘కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించబడినవి’ అనే వాటర్ మార్క్ చూపించాలని షరతులు విధించింది సెన్సార్ బోర్డు. కిక్-2 సినిమాలో పావురం కనిపించిన ప్రతి సన్నివేశంలో ఈ వాటర్ మార్క్ కనిపించింది. దీని వల్ల వచ్చే ఉపయోగమేంటన్నది అర్థం కావడం లేదు. ప్రేక్షకుడికి అదే పనిగా ఇది గ్రాఫిక్ అని గుర్తు చేస్తే ఆ సన్నివేశంతో ఎలా కనెక్టవుతాడు? ఆ సన్నివేశం అసహజంగా అనిపించదా? అయినా ఆ కాషన్ ఇవ్వకపోవడం వల్ల నష్టమేంటి?

జంతువుల్ని, పక్షుల్ని ఉపయోగించడం లేదని హామీ ఇస్తున్నారు  కదా.. ఏవైనా అభ్యంతరాలుంటే చర్యలు తీసుకోవచ్చు కానీ.. ఇలా వాటర్ మార్క్ తప్పనిసరి చేయడం టూమచ్ అనే అభిప్రాయం వినిపిస్తోంది. అవతార్ లాంటి సినిమాలో ప్రతిదీ గ్రాఫిక్కే మరి. అంటే సినిమా అంతా ఇలాంటి కాషన్ రన్ అవుతూ ఉండాలన్నమాట. అలాంటి కాషన్ కనిపిస్తుంటే సినిమాను సహజంగా ఎలా ఫీలవుతాడు? ఎలా ఎంజాయ్ చేస్తాడు ప్రేక్షకుడు. ప్రపంచంలో ఎక్కడా లేని ఇలాంటి షరతులు మనదగ్గరే ఎందుకో మరి? చూస్తుంటే రోజు రోజుకూ మరీ సెన్సిటివ్ గా తయారవుతోంది పరిస్థితి. ఈ పరిణామాల గురించి ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ స్పందిస్తూ.. రాబోయే రోజుల్లో సినిమాల్లో ఓ వయొలెంట్ సీన్ కనిపించగానే ‘‘మర్డర్ ఈజ్ పనిషబుల్ క్రైమ్’’ అని వాటర్ మార్క్ వేయాల్సి వస్తుందేమో అని సందేహం వ్యక్తం చేశారు. ఆయన వ్యంగ్యంలో అర్థముంది!
Tags:    

Similar News