వామ్మో.. ఆ సినిమాకు 40 సెన్సార్ కట్లా?

Update: 2016-06-06 13:30 GMT
ఉడ్తా పంజాబ్.. ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. డ్రగ్స్ నేపథ్యంలో ఈ సినిమాను అభిషేక్ చౌబే అనే దర్శకుడు వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించాడు. కథనం.. పాత్రలు.. డైలాగ్స్ అన్నీ కూడా రియలిస్టిగ్గా ఉంటాయి. ఐతే డ్రగ్స్ వినియోగం గురించి సినిమాలో చాలా ఎక్కువగా చూపించారని.. బూతులు ఎక్కువయ్యాయని ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించింది సెన్సార్ బోర్డు. ఆ సందర్భంగా సోషల్ మీడియాలో సెన్సార్ వాళ్లపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. వాళ్ల మీద సెటైర్లతో నెటిజన్లు రెచ్చిపోయారు. సినీ ప్రముఖులు సైతం సెన్సార్ బోర్డుపై దుమ్మెత్తిపోశారు. అయినప్పటికీ సెన్సార్ బోర్డులో ఏ మార్పూ లేదు.

ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ అయితే ఇచ్చింది కానీ.. ఏకంగా 40 కట్స్ చెప్పింది. వాళ్లు చెప్పిన సన్నివేశాల్ని తీసేసి.. డైలాగుల్ని మ్యూట్ చేస్తే ఇక సినిమాకు అర్థమేముంటుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది చిత్ర యూనిట్. సెన్సార్ బోర్డుకు వ్యతిరేకంగా ట్రైబ్యునల్ ను.. కేంద్ర ప్రసార శాఖ అధికారుల్ని కలిసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ సినిమా జూన్ 17న విడుదల కావాల్సి ఉంది. రిలీజ్ కు ఇంకో పది రోజులే సమయం ఉండగా పెద్ద వివాదం నడుస్తున్న నేపథ్యంలో సినిమా అనుకున్న ప్రకారం విడుదలవుతుందా లేదా అన్నది సందేహంగా మారింది. హీరో షాహిద్ కపూర్ మాట్లాడుతూ.. తమది చాలా గొప్ప సినిమా అని.. విడుదల తర్వాత అన్ని రాష్ట్రాలూ ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వడం ఖాయమని.. సమాజానికి పనికొచ్చేలా అంత మంచి సినిమా తీశామని అంటున్నాడు. మరోవైపు సెన్సార్ బోర్డుతో ముడిపడ్డ ఏ వ్యవహారం మీద అయినా స్పందించే వర్మ.. ‘ఉడ్తా పంజాబ్’ గురించి ట్వీట్ పెట్టాడు. ఈ సినిమాలో చూపించిన విషయాలు ఒక్క పంజాబ్ లో మాత్రమే కాకుండా.. దేశమంతటా ఉన్నాయని.. కాబట్టి ఈ సినిమాకు ‘ఉడ్తా పంజాబ్’ అని కాకుండా ‘ఉడ్తా ఇండియా’ అనో.. ‘ఉడ్తా వరల్డ్’ అనో పేరు పెట్టాల్సిందని అన్నాడు.
Tags:    

Similar News