ఈసారైనా తెలుగ‌మ్మాయికి హిట్టొస్తుందా..!

Update: 2020-08-07 10:30 GMT
ముంబై ర్యాంప్ మోడ‌ల్స్ ఒక‌వైపు.. మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ‌లు మ‌రోవైపు తెలుగ‌మ్మాయిల‌కు పెద్ద‌ థ్రెట్ గా మారారు. అందం ఉంది.. అదిరే ట్యాలెంటు ఉంది.. దూసుకుపోయే ప‌ట్టు విడుపు ఉంది.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శ‌ని చందంగానే ఉంది ప‌రిస్థితి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో ఒక్క‌టంటే ఒక్క తెలుగు పేరు కూడా ఉండదు ఏమిటో!

ఇన్నాళ్లు అస‌లు మాకు అవ‌కాశాలివ్వ‌డం లేదు! అంటూ ఆరోపించిన తెలుగ‌మ్మాయిల్ని చూశాం. అయితే పోటీ ప్ర‌పంచంలో దుందుడుకుతో దూసుకుపోవ‌డమెలానో తెలుగ‌మ్మాయిల‌కు తెలియ‌డం లేదు ఇంకా. అందాల పోటీల్లో రాణులుగా మెరిసినా.. ముంబై ర్యాంపుపైనా క్యాట్ వాక్ చేసినా కానీ హైద‌రాబాద్ ప‌రిశ్ర‌మ‌లో ఎందుక‌నో తేలిపోతున్నారు. ఇరుగుపొరుగు క్యాట్ వాక్ భామ‌లు మ‌న ప‌రిశ్ర‌మ‌లో చూపిస్తున్న హ‌వా తెలుగ‌మ్మాయిలు చూపించ‌లేక‌పోతున్నారు. అయితే కొద్దో గొప్పో ఇటీవ‌ల ఈ ప‌రిస్థితి మారుతోంది. తెలుగ‌మ్మాయిల్లో ట్యాలెంటుకు ముచ్చ‌ట‌ప‌డి మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఎంక‌రేజ్ చేస్తున్నారు. ఆ కోవ‌లోన ఇషా రెబ్బా.. పూజిత పొన్నాడ‌.. అన‌సూయ‌.. రేష్మి.. చాందిని చౌద‌రి లాంటి భామ‌లు అవ‌కాశాలు అందుకుంటున్నారు.

ఇటీవ‌ల ఇన్ స్టాగ్రామ్.. టిక్ టాక్ పుణ్యంతో..నెటిజ‌నుల్లో వైర‌ల్ గా మారిన తెలుగ‌మ్మాయిల‌కు సినిమాల్లో ఛాన్సులొస్తున్నాయి. లోకల్ బ్యూటిఫుల్ గర్ల్స్ సినిమాల్లోకి వచ్చేస్తున్నారు...! ఇదే రీతిన ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన చాందిని చౌదరి ఇప్ప‌టికే ప‌లు చిత్రాల్లో న‌టించింది. యూట్యూబ్ లో పాపుల‌రైన‌ చాందిని చౌద‌రి అడ‌పాద‌డ‌పా అవ‌కాశాలు అందుకుంటూ త‌న ఉనికిని కాపాడుకునే ప్ర‌య‌త్నం అయితే చేస్తోంది.  ఐతే ఈ బ్యూటీకి ఎందుక‌నో ల‌క్ ఫేవ‌ర్ చేయడం ‌లేదు. న‌టించిన ప్రతి సినిమా ఇప్పటి వరకు డిజాస్టర్లు గా నిలవడంతో ఈ తెలుగ‌మ్మాయికి పెద్దగా క్రేజ్ రాలేదు..! ప్ర‌స్తుతం `కలర్ ఫోటో` అనే సినిమాలో నటిస్తోంది. ఈసారైనా హిట్టొస్తుందా?  ఆశించిన బిగ్ కెరీర్ అంది వ‌స్తుందా? అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News