కబాలి కోసం కంపెనీలు దిగి వస్తున్నాయ్

Update: 2016-07-19 11:30 GMT
రజినీకాంత్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ డే చూడాలని అభిమానులు ఎంతగా ఆరాటపడతారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అందులోనూ ‘కబాలి’ లాంటి భారీ హైప్ ఉన్న సినిమా విషయంలో ఒకటి రెండు రోజులు ఆగడమంటే చాలా కష్టం. ఆ ఉత్సాహంలో ఏ పనులూ కనిపించవు. ఎంత ముఖ్యమైన పనులైనా పక్కకు వెళ్లిపోతాయి. ఆఫీస్ కు డుమ్మా కొట్టడానికి ఏమాత్రం సందేహించరు. ఈ సంగతి అర్థం చేసుకునే చెన్నైలోనే పలు కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు జులై 22న సెలవు ఇచ్చేస్తున్నాయి. అంతే కాదు.. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు స్వయంగా ‘కబాలి’ టికెట్లు కూడా అందజేస్తూ వారి మనసులు గెలుస్తున్నాయి.

కబాలి విడుదల రోజు ఆఫీస్ తెరిస్తే.. ఉద్యోగులందరూ ఏదో కారణం చెప్పి సెలవులు పెట్టడం ఖాయమని.. అనవసరంగా వారిని ఒత్తిడికి గురి చేయడం ఎందుకని చాలా కంపెనీలు అధికారికంగా సెలవులిచ్చేస్తున్నాయి. ఏఐబీ అనే ఓ సంస్థ ఇలాగే తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించడమే కాక.. పైరసీని అడ్డుకోవడం కోసం స్వయంగా టికెట్లు కొని అందజేస్తున్నట్లు పేర్కొంటూ ఓ సర్కులర్ కూడా ఇచ్చింది. మరో కార్పొరేట్ సంస్థ కూడా ఇలాగే చేసింది. ఇలా ఆయా కంపెనీలు ఇచ్చిన సర్కులర్స్ ఫొటోలు తీసి.. నెట్లో షేర్ చేస్తూ సూపర్ స్టార్ మేనియా ఏ స్థాయిలో ఉందో చూపిస్తున్నారు అభిమానులు. అసలు ప్రపంచంలో ఏ హీరోకైనా ఇలాంటి క్రేజ్ ఉంటుందా అన్నది డౌటే.
Tags:    

Similar News