కోలీవుడ్ హీరో కార్తికి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. తమిళ స్టార్ హీరో సూర్యకు తమ్ముడిగా పరిచయం అయినా.. యుగానికొక్కడు - అవారా లాంటి సినిమాలతో ఇక్కడ కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. చాలావరకు కార్తి సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతున్నాయి. ఈ కేటగిరీలో ఇప్పుడు తెరకెక్కుతున్న కడైకుట్టి సింగం కూడా చేరనుంది.
చినబాబు అనే టైటిల్ పై తెలుగు వెర్షన్ ను విడుదల చేస్తామని ముందే చెప్పేయగా.. ఇప్పుడీ చిత్రానికి పోస్టర్ ను విడుదల చేశారు. కొంతమంది శ్రామికులతో కలిసి పొలంలో కూర్చుకున్న కార్తి మనకు ఈ పోస్టర్ లో కనిపిస్తాడు. కార్మిక సోదరులకు మే డే శుభాకాంక్షలు తెలుపుతూ ఇచ్చిన ఈ పోస్టర్ ను.. అసలు సిసలైన కంటెంట్ బేస్డ్ పోస్టర్ అని చెప్పవచ్చు. కార్మిక దినోత్సవం రోజున.. ఇంతకంటే కరెక్ట్ కంటెంట్ తో శుభాకాంక్షలు చెప్పడం బహుశా మరెవరికీ సాధ్యం కాదేమో అనిపించక మానదు.
రీసెంట్ గా తెలుగులో బ్లాక్ బస్టర్ సాధించిన రంగస్థలం మాదిరిగా.. ఈ పోస్టర్లో ఉన్న వ్యక్తులు అందరూ రియల్ లైఫ్ క్యారెక్టర్లను తలపించే గెటప్స్ లో ఉండడం విశేషం. పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో.. కార్తి గెటప్ నుంచి యాక్టింగ్ వరకూ అన్నీ డిఫరెంట్ గా ఉంటాయట. గతంలో సాహసం శ్వాసగా సాగిపో.. జయ జానకి నాయక వంటి చిత్రాలకు నిర్మాణం వహించిన మిర్యాల రవీందర్ రెడ్డి.. ఈ చినబాబు తెలుగు వెర్షన్ కు నిర్మాత.