అప్పట్లో చిరూపై జరిగిన విష ప్రయోగం హైలైట్ కాకపోవడానికి కారణం?

Update: 2022-07-22 10:36 GMT
ఎదుగుతున్నవారు వెళుతుంటే అరుగులపై కూర్చుని చూస్తూ నవ్వే వాళ్లు ఎప్పుడూ ఉంటారు. మనం ఎదగకపోయినా ఫరవాలేదు .. అవతలవారిని క్రిందికి లాగేద్దామని చూసేవారు ఉంటారు. అసూయను తట్టుకోలేక ప్రాణహాని తలపెట్టేవారూ ఉంటారు. అలాంటివారే చిరంజీవి ప్రాణాలకి హాని తలపెట్టిన సంఘటన 'మరణమృదంగం' సినిమా షూటింగు సమయంలో జరిగింది. కె.ఎస్.రామారావు నిర్మాణంలో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందిన సంగతి  తెలిసిందే.

చిరంజీవి నటుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టే సమయానికి గట్టి పోటీ ఉంది. ఎవరి ప్రత్యేకతను వారు చాటుతూ ముందుకు వెళుతున్నారు. అలాంటి సమయంలో ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి, ముందుగా వచ్చిన అవకాశాలను  సద్వినియోగం చేసుకుంటూ నటుడిగా నిలదొక్కుకున్నారు. ఆ తరువాత నుంచి తన దూకుడును పెంచడం మొదలుపెట్టారు. అప్పటివరకూ ఆడియన్స్ కి దొరకని కొత్త అంశాలు తన నుంచి ఇవ్వడానికి ప్రయత్నిస్తూ వెళ్లారు.   తనకంటూ ఒక స్టైల్ ను సెట్ చేసుకుని, కథల్లో కొత్తదనాన్ని పరుగులు తీయించారు.

డాన్స్ .. ఫైట్స్ విషయంలో ఒక కొత్త ట్రెండ్ కి ఆయన తెరతీశారు. ఎక్కడ చూసినా .. ఎవరినోట విన్నా చిరంజీవి నామస్మరణమే. అప్పుటివరకూ ఆ స్థాయిలో ఇండస్ట్రీని ప్రభావితం చేసినవారు లేరు. అది సహించలేని కొందరు ఆ ఆయనపై విష ప్రయోగానికి పాల్పడ్డారు. 'మరణ మృదంగం' సినిమా షూటింగు చెన్నై పరిసరాల్లో అవుట్లో డోర్ లో జరుగుతూ ఉండగా, ఆ విషయం తెలిసి పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి వచ్చారు. షూటింగు గ్యాప్ లో చిరంజీవి వాళ్లందరితో మాట్లాడుతున్నారు.

ఆ సమయంలో అభిమానినంటూ ఒక వ్యక్తి  ఆయన ముందుకు వచ్చాడు. ఆ రోజున  తన పుట్టినరోజనీ .. ఆయన సమక్షంలో కేక్ కట్ చేద్దామని వచ్చానని అన్నాడు. వెంటనే కేక్ కట్ చేసి బలవంతంగా చిరంజీవి నోట్లో పెట్టబోయాడు.

ఊహించని ఆ పరిణామానికి చిరంజీవి ఆశ్చర్యపోతూనే .. అడ్డుకున్నారు. దాంతో ఆ కేక్ క్రింద పడిపోయింది.  అప్పటికే కొంత కేక్ ఆయన నోట్లోకి వెళ్లడం .. ఆయన పెదాలు నీలంగా మారడం మొదలైంది. కింద పడ్డ కేక్ లో ఏవో పదార్థాలు ఉండటం .. ఆ వ్యక్తి  ప్రవర్తన అనుమానంగా ఉండటం అక్కడి వాళ్లంతా గమనించారు.

వెంటనే చిరంజీవిని హాస్పిటల్ కి తరలించారు. ఆయనపై విష ప్రయోగం జరిగిన విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. విషానికి విరుగుడు వైద్యాన్ని అందించారు. అలా చిరంజీవి ఆ గండం నుంచి బయటపడ్డారు. అప్పట్లో జాతీయ పత్రికలు కూడా ఈ వార్తను ప్రచురించాయి. తెలుగులోను కొన్ని పత్రికలు కవర్ చేశాయి. కానీ అసలు ఆ విషప్రయోగాన్ని ఆయనపై చేయించినదెవరు? మీడియాలో ఆ వార్త హైలైట్ కాకుండా చూసిందెవరు? అనేది ఇప్పటికీ ఒక ప్రశ్నగానే మిగిలింది. ఏదేమైనా ప్రేక్షకుల ప్రేమాభిమానాలు చిరంజీవిని కాపాడాయి. ఆ సంఘటన తరువాత  ఆయనను మరింత ఎత్తుకు తీసుకుని వెళ్లాయి.
Tags:    

Similar News