చిరు మూడవ రీమేక్‌.. తగ్గేదేలే

Update: 2021-08-31 04:27 GMT
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాను ముగించి ప్రస్తుతం మలయాళ సూపర్‌ హిట్ మూవీ లూసీఫర్‌ ను రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. లూసీఫర్ కోసం చిరంజీవి ఇప్పటికే రంగంలోకి దిగిన మెగాస్టార్‌ చిరంజీవి చకచక మూడు నాలుగు నెలల్లోనే సినిమాను పూర్తి చేసేలా దర్శకుడు మోహన్ రాజాకు ఆదేశాలు ఇచ్చాడు. ఇప్పటికే సినిమా టైటిల్ ను రివీల్‌ చేసి మోషన్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. గాడ్ ఫాదర్ టైటిల్‌ తో లూసీఫర్ ను రీమేక్ చేస్తున్న విషయం అందరికి తెల్సిందే. చిరు గాడ్ ఫాదర్ తర్వాత భోళా శంకర్‌ సినిమాను చేయబోతున్నాడు. అది తమిళంలో సక్సెస్ అయిన వేదాళం సినిమాకు రీమేక్‌ అనే విషయం తెల్సిందే. ఈ రెండు రీమేక్ లతో పాటు బాబీ దర్శకత్వంలో ఒక సినిమాను చిరంజీవి చేయబోతున్నాడు.

చిరంజీవి మూడు సినిమాలు ప్రస్తుతం చేతిలో ఉన్నాయి. ఈ మూడు సినిమాలు మాత్రమే కాకుండా ఇంకా స్క్రిప్ట్‌ లను చిరు వింటున్నాడు అంటూ మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తమిళంలో 2015 లో వచ్చిన అజిత్ మూవీ యెన్నై అరిందాల్ ను రీమేక్ చేసే ఆలోచనలో చిరంజీవి ఉన్నాడట. ప్రస్తుతం ఆ రీమేక్ కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని టాక్‌. తన సన్నిహితుల ద్వారా ఆ సినిమా రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేయించారని.. అందులో అజిత్‌ పోషించిన పాత్ర చిరంజీవికి బాగా నచ్చిందట. అందుకే ఆ సినిమా రీమేక్ లో నటించాలని ఉత్సాహంగా ఉన్నాడని సమాచారం.

యెన్నై అరిందాల్ సినిమా లో అజిత్ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించాడు. చాలా పవర్ ఫుల్‌ రోల్‌ అవ్వడం వల్ల చిరంజీవి ఆ పాత్రలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. పోలీస్‌ ఆఫీసర్ అయిన హీరో ఒక మహిళ కోసం పోరాటం చేసే కథ. మంచి కమర్షియల్‌ ఎలిమెంట్స్ తో పాటు మంచి మెసేజ్ కూడా సినిమాలో ఉంటుంది. అందుకే చిరంజీవి రీమేక్‌ ను చేసేందుకు సిద్దం అయ్యాడు. ప్రస్తుతం చిరంజీవి భారీ చిత్రాలను కాకుండా మూడు నాలుగు నెలల్లో పూర్తి అయ్యేలా సబ్జెక్ట్‌ లను ఎంపిక చేసుకుంటున్నాడు. కనుక యెన్నై అరిందాల్ సినిమా ను రీమేక్ చేస్తూ మూడు నాలుగు నెలల్లో పూర్తి చేయవచ్చు. అందుకే ఆ రీమేక్ ను ఎంపిక చేశారని టాక్‌. మొత్తానికి చిరంజీవి రీమేక్ ల విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా దూసుకు పోతున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
Tags:    

Similar News