మల్టీప్లెక్సుల దోపిడీపై కొత్త త‌ర‌హా ఉద్య‌మం!

Update: 2018-07-06 05:13 GMT
సినిమా టికెట్ రూ.150. కాదంటే రూ.200. కానీ.. పాప్ కార్న్‌.. దాంతో కూల్ డ్రింక్. సినిమా టికెట్ ధ‌ర‌కు రెట్టింపు బాదేసే ఈ తీరు అన్ని మల్టీప్లెక్సుల్లోనూ ఉంది. చివ‌ర‌కు సినిమాల్లోనూ.. ఈ వ్య‌వ‌హారంపై జోకులు వేసుకునే ప‌రిస్థితి.ఎంత చెప్పినా.. మ‌ల్టీప్లెక్సులు త‌మ ధ‌ర‌ల దోపిడీ విష‌యంలో అస్స‌లు వెన‌క్కి త‌గ్గ‌ని ప‌రిస్థితి.

బ‌య‌ట ఆహారాన్ని అనుమ‌తించ‌మ‌న్న పేరుతో ముక్కుపిండి వ‌సూలు చేస్తున్న మ‌ల్టీప్లెక్సుల తీరుపై ఒక కొత్త త‌ర‌హా ఉద్య‌మం మొద‌లైంది. మై మూవీ.. మై సినిమా పేరుతో స్టార్ట్ అయిన ఈ ఉద్య‌మంలో భాగంగా.. మ‌ల్టీప్లెక్సుల ఫుడ్ కోర్టు దోపిడీపై గ‌ళం విప్పారు. అధిక ధ‌ర‌ల‌కు అమ్ముతున్న వైనంపై ఆగ్ర‌హం చేస్తున్న ప్రేక్ష‌కులు ఈ ఉద్య‌మాన్ని త‌మ‌కు తాముగా షురూ చేయ‌టం గ‌మ‌నార్హం.

ఇంత‌కీ.. ఈ ఉద్య‌మంలో భాగంగా ఏం చేస్తారు?  ఎక్క‌డ మొద‌లైంది? అన్నది చూస్తే.. సూర‌త్‌ న‌గ‌రంలో ఈ నిర‌స‌న స్టార్ట్ అయ్యింది. ఆందోళ‌న‌లో భాగంగా ఈ నెల 15 నుంచి ప్రేక్ష‌కులు సినిమాల‌ను బాయ్ కాట్ చేయాల‌ని పిలుపునిస్తున్నారు. బ‌య‌ట ఆహారం.. మంచినీళ్ల బాటిల్స్ ను అనుమ‌తించే వ‌ర‌కూ త‌మ నిర‌స‌న కొన‌సాగుతుంద‌ని చెబుతున్నారు. పుడ్ కోర్టులో అమ్మే తినుబండారాల ధ‌ర‌ల్ని స‌రైన రీతిలో అమ్మేలా చేయ‌ట‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు న్యాయ‌వాది అర్పిత్ శుక్లా. థియేట‌ర్లోకి ఇంటి నుంచి ఆహార‌ప‌దార్థాలు.. వాట‌ర్ తీసుకెళ్ల‌కూడ‌ద‌న్న నిబంధ‌న ఏదీ చ‌ట్టంలో ఎక్క‌డా లేద‌ని చెబుతున్నారు. ప్రేక్ష‌కులు త‌మ ఇంటి నుంచే ఆహారాన్ని.. మంచినీళ్ల‌ను థియేట‌ర్ల‌లోకి తీసుకెళ్లేలా అనుమ‌తించాలంటూ బాంబే హైకోర్టు మ‌హారాష్ట్ర స‌ర్కారుకు ఇప్ప‌టికే సూచించింది. ఈ నేప‌థ్యంలో తామీ ఆందోళ‌న‌ను షురూ చేస్తున్న‌ట్లుగా జాతీయ యువ సంఘ‌ట‌న్ ప్ర‌తినిధి సంజ‌య్ వెల్ల‌డించారు. మ‌రీ.. నిర‌స‌న మిగిలిన న‌గ‌ర‌వాసులు స్ఫూర్తి పొందాల్సిన అవ‌స‌రం ఉంది.
Tags:    

Similar News