థియేటర్ల బంద్.. నిర్మాతల వెర్షన్ ఇదీ

Update: 2018-03-01 10:00 GMT
దక్షిణాది సినీ నిర్మాతలకు.. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు (డీఎస్పీలు) మధ్య చర్చలు ఫలించలేదు. డీఎస్పీలు వర్చువల్ ప్రింట్ ఫీజు భారీగా దండుకుంటూ నిర్మాతలకు భారీ నష్టం చేకూరుస్తున్నారని ఆరోపిస్తున్న నిర్మాతలు ఈ శుక్రవారం నుంచి సమ్మెకు దిగుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ థియేటర్లు మూత పడబోతున్నాయి. మళ్లీ అవి ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు. ఈ సమస్య ఎప్పుడు కొలిక్కి వస్తుందో తెలియదు. తాము తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మెకు దిగుతున్నామని అంటోంది నిర్మాతల మండలి. సమ్మె విషయంలో వారి వెర్షన్ ఏంటంటే..

‘‘2007–2008 కాలం నుంచి సినిమా ప్రింట్‌ నుంచి డిజిటల్‌ లోకి మారుతూ వచ్చింది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు ముందు ఉచితంగానే థియేటర్లలో డిజిటల్ ప్రొజెక్టర్లు ఏర్పాటు చేశారు. ఐతే పెట్టుబడి వెనక్కి రాబట్టుకునేందుకు వర్చువల్ ప్రింట్ ఫీజు రోజుకు ఇంత అని నామమాత్రంగానే చెల్లించమని.. ఐదేళ్ల తర్వాత చెల్లించాల్సిన అవసరం లేదని.. ప్రకటనల రూపంలో మేం ఆదాయం సమకూర్చుకుంటామంటూ చెప్పారు. కానీ పదేళ్లు గడిచినా ఫీజులు మాఫీ చేయలేదు. భారీ రేట్లు పెడుతున్నారు. రేటూ తగ్గించట్లేదు. ప్రకటనల ద్వారా అధిక ఆదాయం పొందడంతో పాటు వీపీఎఫ్‌ అధికంగా వసూలు చేస్తున్నాయి. ఇది సినిమా వర్గాలకు భారంగా మారుతోంది. కొన్ని సినిమాలకు వీపీఎఫ్‌ డబ్బులు కూడా రాని పరిస్థితి నెలకొంది.

ఈ సమస్య పరిష్కారం కోసం దక్షిణాది నిర్మాతలందరూ కలిసి జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఏర్పాటు చేశాం. ఈ కమిటీ అధ్యక్షతన ఫిబ్రవరి 16న చెన్నైలో డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లతో సమావేశం నిర్వహించాం. ప్రస్తుతం వసూలు చేస్తున్న వీపీఎఫ్‌ ని 25 శాతానికి తగ్గించి.. ఏడాది తర్వాత ఆ ఫీజు మొత్తం వసూలు చేయకూడదనీ.. రెండు సినిమా యాడ్స్‌ స్లాట్స్ మాకు ఇవ్వాలనీ.. వాణిజ్య ప్రకటనలు 8 నిమిషాలకు మించి ప్రదర్శించరాదని చెప్పాం. ఐతే వాళ్లు ఫీజును 10 శాతమే తగ్గిస్తామన్నారు. సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి బతికే ఆ వర్గం వ్యక్తి ‘ఆల్‌ ది బెస్ట్‌ టు ఇండస్ట్రీ’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడి సమావేశం నుంచి వెళ్లిపోయాడు.  మా సమ్మెకు ఇండస్ట్రీ నుంచి పూర్తి సహకారం ఉంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని యాదవ్ కూడా అండగా నిలిచారు. అవసరమైతే కొత్త డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లను మార్కెట్‌ లోకి తీసుకొస్తాం. మా డిమాండ్లు ఒప్పుకునే వరకు సినిమా ప్రదర్శన ఉండదు’’ అని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ డిజిటల్ కమిటీ ఛైర్మన్ దామోదర్ ప్రసాద్ అన్నారు.
Tags:    

Similar News