మీటూ సౌత్‌ క‌మిటీ .. వేధింపుల‌కు చెక్

Update: 2019-04-21 05:29 GMT
సుచీలీక్స్ (సుచిత్ర‌) .. శ్రీ‌లీక్స్ (శ్రీ‌రెడ్డి) ప్ర‌కంప‌నాలు సౌత్ ని ఊపేసిన సంగ‌తి తెలిసిందే. ఆ రెండు దెబ్బ‌ల‌కు దేశంలోనే అత్యంత ప్ర‌భావవంత‌మైన సినీప‌రిశ్ర‌మల గుట్టు మొత్తం లీకైపోయింది. టాలీవుడ్- కోలీవుడ్ ర‌హ‌స్యాలు కొన్ని సామాజిక మాధ్య‌మాల ద్వారా దేశవిదేశాల్లో చ‌ర్చ‌కు తావిచ్చాయి. జాతీయ మీడియా వ‌చ్చి నానా ర‌చ్చ చేసేందుకు దారి తీసిన దారుణ‌ ప‌రిణామ‌మిది. ఈ పాపం ఎవ‌రిది? అంటే నియంత్ర‌ణ లేని వ్య‌వ‌స్థ‌ది అని తిట్టుకున్నారంతా. మూవీ ఆర్టిస్టుల సంఘం.. న‌డిగ‌ర సంఘం (దక్షిణ భారత నటీనటుల సంఘం) స‌రిగా కంట్రోల్ చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే ప‌రిశ్ర‌మ‌ల‌కు ఇంత‌టి అవమానం ఎదురైంద‌ని అంతా తిట్టుకోవ‌డం త‌ప్ప చేసిందేం లేదు. ఇప్ప‌టికైనా వ్య‌వ‌స్థ ప్ర‌క్షాళ‌న జ‌రిగిందా? అంటే సందేహ‌మే. అయితే ఓ రెండు కీల‌క ప‌రిణామాలు ప్ర‌స్తుతం ఆశావ‌హం అన్న చ‌ర్చ సాగుతోంది.

తొలిగా టాలీవుడ్ లో లైంగిక వేధింపుల నిరోధానికి కాష్ క‌మీటీని ప్ర‌క‌టించారు. సినీ ప‌రిశ్ర‌మ‌.. ప్ర‌భుత్వానికి చెందిన కొంద‌రిని క‌లుపుకుని ఏర్పాటు చేసిన ఈ క‌మిటీ తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో న‌టీమ‌ణుల వేధింపుల్ని ప‌రిశీలించేందుకు ఉద్ధేశించిన‌ది. ఇక‌పోతే ద‌క్షిణాదిన అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించేందుకు ఓ క‌మిటీ అవ‌స‌రం అని భావించిన దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) తాజాగా మీటూ పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి నాజర్‌ అధ్యక్షుడిగా వ్వవహరిస్తారు. విశాల్- కార్తీ- పూచీ మురుగన్ - కుష్బు- రోహిణి- సుహాసిని వంటి ప్ర‌ముఖులు క‌మిటీ స‌భ్యులుగా ఉన్నారు. వీరితో పాటు ఒక సామాజికవేత్త - న్యాయవాది తో కూడిన ఎనిమిది మంది బృందాన్ని మీటూ క‌మిటీలో నియ‌మించారు. సౌత్ లో న‌టీమ‌ణుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఈ క‌మిటీ ప‌ని చేయ‌నుంద‌ని తెలుస్తోంది.

అయితే ఈ ఆలోచ‌న చేయ‌డానికి దారి తీసిన ప‌రిణామం ఏంటి? అంటే ఇటీవ‌లే అగ్ర క‌థానాయిక న‌య‌న‌తార‌పై సీనియ‌ర్ క్యారెక్ట‌ర్ న‌టుడు రాధార‌వి చేసిన అనుచిత వ్యాఖ్య‌లు అనంత‌ర ప‌రిణామాలు కార‌ణం అని తెలుస్తోంది. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ప్ర‌స్తుతం వివాదం సీరియ‌స్ గా ర‌న్ అవుతోంది. తాజాగా సుప్రీం కోర్ట్ ఆదేశాల మేర‌కు రాధార‌విపై క‌మిటీ వేసి చ‌ర్య‌లు తీసుకునేందుకు విశాల్ & న‌డిగ‌ర సంఘం సిద్ధమేనా? అంటూ న‌య‌న్ ప్ర‌శ్నించారు. అనంత‌రం విశాల్ - నాజ‌ర్ బృందం సీరియ‌స్ గా ఆలోచించి ఈ క‌మిటీని వేశార‌ని తెలుస్తోంది. అయితే కోలీవుడ్ తో పాటు అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించేందుకు ఈ క‌మిటీ ఏం చేయ‌బోతోంది? అనేది పూర్తిగా తెలియాల్సి ఉందింకా.
    

Tags:    

Similar News