స్టార్ హీరోపై ఫోన్‌ స్నాచింగ్ కేసు

Update: 2019-09-06 08:54 GMT
కండల హీరో స‌ల్మాన్ ఖాన్ ఫోన్ లాక్కున్నార‌ని.. త‌న‌ని తీవ్రంగా కొట్టార‌ని ఆరోపిస్తున్నాడు అశోక్‌ పాండే అనే ఓ యువ‌జ‌ర్న‌లిస్ట్. తాను సైకిల్ పై వెళుతుండ‌గా స‌ల్మాన్ క‌నిపిస్తే ఫోటోలు- వీడియోలు తీశాడు. అందుకు స‌ల్మాన్ బాడీ గార్డులు అనుమ‌తించారు. అయితే ఆ టైమ్ లో వీడియోలు తీయ‌డం న‌చ్చ‌ని స‌ల్మాన్ త‌న వ‌ద్ద‌కు వ‌చ్చి ఫోన్ లాక్కుని కొట్టారు. ఫోన్ లోంచి కొన్ని వీడియోల్ని డిలీట్ చేశారు. అయితే ఈ విష‌యంపై అంధేరి- డీఎన్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తే అక్క‌డ పోలీసులు కేసు న‌మోదు చేయ‌లేద‌ని .. పెద్ద స్టార్ అవ్వ‌డం వ‌ల్ల పోలీసులు వెన‌కాడార‌ని ఆరోపించాడు. పోలీసుల వ‌ల్ల త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే ఇప్పుడు కోర్టును ఆశ్ర‌యించాల్సి వ‌చ్చింద‌ని చెబుతున్నాడు.

ఏప్రిల్ 24న జ‌రిగిన ఈ ఘ‌ట‌న గురించి చాలా ఆల‌స్యంగా వివ‌రాలు వెల్ల‌డ‌య్యాయి. ఈ వివాదంలో స‌ల్మాన్ తో పాటు అత‌డి గార్డులు ఆ యువ‌కుడిని చిత‌క్కొట్టార‌ట‌. అలాగే డిఎన్ న‌గ‌ర్ పోలీసులు కేసు స్వీక‌రించ‌నుందున వారిపైనా విచార‌ణ సాగ‌నుంది. ప్ర‌స్తుతం ముంబై అంధేరి కోర్టు ఈ ఫిర్యాదును స్వీక‌రించి పోలీసుల్ని విచారించాల్సిందిగా ఆదేశించ‌డంతో అస‌లు సంగ‌తి బ‌య‌ట‌కు వెలుగు చూసింది.

అయితే నిజంగానే స‌ల్మాన్ కొట్టారా? అంధేరి పోలీసులు స‌ల్మాన్ కి వ‌త్తాసు ప‌లుకుతూ స‌ద‌రు జ‌ర్న‌లిస్ట్ ఇచ్చిన ఫిర్యాదును స్వీక‌రించ‌లేదా? అన్న‌ది తేలాల్సి ఉంది. స‌ద‌రు జ‌ర్న‌లిస్టుని గాయ‌ప‌రిచినందుకు ఐపీసీ సెక్ష‌న్ 323.. ఫోన్ లాక్కున్నందుకు 392.. ఉద్ధేశ‌పూరిత‌ నేర‌పూరిత చ‌ర్య‌కు పాల్ప‌డినందున‌ ఐపీసీ 506 కింద కోర్టులో స‌ల్మాన్ పై కేసులు న‌మోదు చేసారు. ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారంపై కోర్టు ఆదేశం మేర‌కు పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు. నిజానిజాలు నిగ్గు తేలితే స‌ల్మాన్ కి అత‌డి గార్డుల‌కు తిప్ప‌లు త‌ప్ప‌వు. కేసు న‌మోదు చేయని పోలీసుల‌కు శిక్ష త‌ప్ప‌ద‌ని చెబుతున్నారు. ఇందులో వాస్త‌వాలేంటో విచార‌ణ‌లో తేలాల్సి ఉంది.


Tags:    

Similar News