'శంకర్ - చరణ్' మూవీ పై క్రేజీ అప్డేట్..!

Update: 2021-07-29 06:20 GMT
ఇండియాలోని టాప్ మోస్ట్ ఫిలిం డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ తో వర్క్ చేయాలని ప్రతీ స్టార్ హీరో కోరుకుంటారు. అందుకే ఆయన అడిగితే బల్క్ డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించిన శంకర్.. స్ట్రెయిట్ తెలుగు మూవీ చేయాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. అయితే అగ్ర దర్శకుడికి ఇన్నాళ్లకు టాలీవుడ్ స్టార్ హీరోతో కలిసి తెలుగు సినిమా చేసే అవకాశం కుదిరింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాని అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.
ఇది చరణ్ కు 15వ సినిమా. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై దిల్‌ రాజు - శిరీష్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం #RC15 ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలానే నటీనటులు సాంకేతిక నిపుణుల కూడా ఎంపిక చేస్తున్నారు.

#RC15 ప్రాజెక్ట్ అఫీసియల్ అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచే సోషల్ మీడియాలో ఫిలిం సర్కిల్స్ ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తో మిస్ అయినా.. మెగా పవర్ స్టార్ తో శంకర్ సినిమా చేస్తున్నందుకు మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్న ఈ చిత్రాన్ని తెలుగు - త‌మిళం - హిందీ భాష‌ల్లో ఒకేసారి చిత్రీక‌రించ‌డానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

అంతేకాదు ఈ సినిమాని శంకర్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. ఇందులో రామ్ చరణ్ చీఫ్ మినిస్టర్ గా నటిస్తారని అంటున్నారు. సందేశాత్మక అంశాలతో కూడిన పొలిటికల్ డ్రామా అయినప్పటికీ, శంకర్ స్టైల్ లో కమర్షియల్ సినిమాగా రూపొందుతుందని టాక్. మొత్తం మీద శంకర్ గత చిత్రం 'ఒకే ఒక్కడు' తరహాలో సాగే సినిమా అని ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.

'#RC15' కోసం స్టార్ క్యాస్టింగ్ - టాప్ టెక్నిషియన్స్ ని ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా హవా కొనసాగిస్తున్న ఎస్ ఎస్ థమన్ ను ఈ సినిమా కోసం తీసుకున్నారు. శంకర్ దర్శకత్వంలో 'బాయ్స్' సినిమాలో యాక్ట్ చేసిన థమన్.. ఫస్ట్ టైం ఆయన డైరెక్ట్ చేసే చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చరణ్ తో ఆల్రెడీ 'నాయక్' 'బ్రూస్ లీ' వంటి చిత్రాలను థమన్ మ్యూజిక్ ఇచ్చాడు.

అలానే బుర్రా సాయి మాధవ్ ను ఈ చిత్రానికి డైలాగ్స్ రాయడానికి తీసుకున్నారు. పొలిటికల్ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో శంకర్ కథకు సాయి మాధవ్ సంభాషణలు అదనపు ఆకర్షణగా నిలుస్తాయని భావిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ ఈ సినిమాకు కొరియోగ్రఫీ చేయనున్నాడు. త్వరలోనే మిగతా లీడ్ యాక్టర్స్ మరియు సాంకేతిక నిపుణులను ప్రకటించే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే 'శంకర్ - చరణ్' ప్రాజెక్ట్ ని సెప్టెంబర్ రెండో వారంలో సెట్స్ మీదకు తీసుకెళ్ళాడనికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఆగస్ట్ రెండో వారానికి పెండింగ్ సాంగ్ షూట్ కూడా పూర్తి కానుంది. మరోవైపు చిరంజీవి - కొరటాల శివ కాంబోలో వస్తున్న 'ఆచార్య' చిత్రంలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే చెర్రీ కంప్లీట్ చేశాడు.

ఈ నేపథ్యంలో 'RC15' షూటింగ్ సెప్టెంబర్ సెకండ్ వీక్ లో మొదలు పెట్టాలని చూస్తున్నారు. టైట్ షెడ్యూల్స్ ప్లాన్ చేసి 2022 సమ్మర్ నాటికి ప్రాజెక్ట్ ని ఫినిష్ చేసేలా శంకర్ హీరో నిర్మాతలకు మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే శంకర్.. చెప్పిన సమయానికి చరణ్ చిత్రాన్ని పూర్తి చేస్తారో లేదో చూడాలి.




Tags:    

Similar News