నాలుగు రోజుల్లో కోటి రూపాయలు వచ్చాయట

Update: 2018-08-13 07:58 GMT
క్రౌడ్ ఫండింగ్. ఎప్పట్నుంచో వింటున్న మాటే ఇది. సినీ ఫీల్డుతో పాటు వేరే రంగాల్లోనూ ఈ ట్రెండ్ నడుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో తమ ప్రతిభను చాటుకున్న వాళ్లు.. తాము చేయాలనుకుంటున్న ప్రాజెక్టును వివరించి.. దానికి నెటిజన్ల ద్వారా పెట్టుబడి సేకరించడం.. ఆ ప్రాజెక్టు విజయవంతం అయితే లాభాలు పెట్టుబడి పెట్టిన అందరికీ లాభాలు పంచడం కొన్నేళ్లుగా జరుగుతోంది. కత్తి మహేష్ ఇంతకుముందు ఇలాగే క్రౌడ్ ఫండింగ్ తో ‘పెసరట్టు’ అనే సినిమా తీసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఐతే ఆ చిత్రం విజయవంతం కాకపోవడం తెలుగులో ఆ ట్రెండ్ ఊపందుకోలేదు. ఐతే ‘మధురం’ అనే షార్ట్ ఫిలింతో ఆకట్టుకున్న యువ దర్శకుడు ఫణీంద్ర నరిశెట్టి.. ఫీచర్ ఫిలిం దర్శకుడిగా మారి తీసిన ‘మను’కు పూర్తి పెట్టుబడి సమకూర్చింది సోషల్ మీడియా జనాలే.

సినిమా స్థాయికి ఏమాత్రం తగ్గని రీతిలో ‘మధురం’ను తీర్చిదిద్దాడు ఫణీంద్ర. అది యూట్యూబ్ లో ఒక సంచలనమైంది. దీని తర్వాత ‘మను’ సినిమా తీయడం కోసం క్రౌడ్ ఫండింగ్ ను ఆశ్రయిస్తే కేవలం నాలుగు రోజుల్లోనే కోటి రూపాయలు సమకూరినట్లు ఫణీంద్ర వెల్లడించాడు. తాను అప్పీల్ ఇవ్వగానే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని.. వాళ్లంతా ఎందుకు, ఎలా తనను నమ్మారో ఇప్పటికీ తనకు అర్థం కావడం లేదని అన్నాడతను. ఈ విషయం తలుచుకుంటేనే తనకు ఉద్వేగం వచ్చేస్తుందని చెప్పాడు. వెయ్యి రూపాయల నుంచి 40 లక్షల వరకు రకరకాల మొత్తాల్లో డబ్బులు సమకూరాయని.. కానీ ఎవ్వరూ కూడా ఇప్పటిదాకా డబ్బులు ఏమయ్యాయి.. ఎలా ఖర్చు పెట్టారు.. ఎప్పుడు వెనక్కి ఇస్తారు అని ఒక్క మాట కూడా అడగలేదని.. వీళ్లందరికీ తాను ఎప్పటికీ రుణ పడి ఉంటానని ఫణీంద్ర అన్నాడు. ఇక చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరూ కూడా ప్రాణం పెట్టి పని చేశారని.. ఈ సినిమాకు సంబంధించి ఏ ఒక్కరి గురించో తాను ప్రత్యేకంగా చెప్పదలుచుకోలేదని.. తన కంటే కూడా సినిమా మాట్లాడుతుందని ఆశిస్తున్నానని ఫణీంద్ర చెప్పాడు. ‘మను’ సెప్టెంబరు 7న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
Tags:    

Similar News