ఒలింపిక్ స్వ‌ర్ణం సాధించిన‌ వేళ తెర‌పైకి ధ్యాన్ చంద్ బ‌యోపిక్!

Update: 2021-08-15 10:30 GMT
టోక్యో ఒలింపిక్స్ లో భారత పురుషులు - మహిళల హాకీ జట్లు పుంజుకోవడం దేశంలో క్రీడా వైభవాన్ని మ‌ళ్లీ  తెచ్చిన‌ట్లైంది. బ‌ల్లెం వీరుడు నీర‌జ్ చోప్రా ఏకంగా బంగారు ప‌త‌క‌మే సాధించ‌డంతో దేశం పేరు ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా మార్మోగుతోంది. 100 సంవ‌త్స‌రాల  యావ‌త్ భార‌తావ‌ని హాకీ చరిత్ర వారసత్వం గురించి మాట్లాడటం స‌ర్వ‌త్రా హాట్ టాపిక్ గా మారింది. ఈ నేప‌థ్యంలో మేజర్ ధ్యాన్ చంద్ పేరు మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది.  హాకీ ప్లేయ‌ర్ గా ధ్యాన్ చంద్ భార‌తదేశానికి అందించిన సేవ‌లు అసామాన్యం. ఇండియన్ హాకీకి  ప‌ర్యాయ‌ప‌దం ఆయ‌న‌. భారతదేశంలో హాకీ క్రీడకు పితామహుడు.

ఒలింపిక్స్ లో అనేక పతకాలు సాధించి విదేశీ వేదిక‌ల‌పై భార‌తీయ‌జెండాను రెప‌రెప‌లాడించారు. ధ్యాన్ చంద్ తన 23 వ ఏటనే  మొదటి ఒలింపిక్ గోల్డ్ మెడల్ భార‌త్ కి అందించారు. అతను 1928.. 1932 .. 1936 లలో బంగారు పతకాలు సాధించిన సంగ‌తి తెలిసిందే. అయితే బాలీవుడ్ లో ఇప్ప‌టివ‌ర‌కూ ఎంతో మంది క్రీడాకారుల బ‌యోపిక్ లు తెర‌పైకి వ‌చ్చాయి. కానీ ధ్యాన్ చంద్ క‌థ‌ని తెర‌కెక్కించే సాహ‌సం మాత్రం ఎవ్వ‌రూ చేయ‌లేక‌పోయారు. అయితే బాలీవుడ్ లో  ధ్యాన్ చంద్ బయోపిక్ రూపొందించాలనే ప్రణాళిక చాలా కాలంగా ఉంది.

`చక్ దే ఇండియా` విడుదలైనప్పుడు చిత్రనిర్మాత భేడీ గుప్తా - మ‌రో  నిర్మాత పూజా శెట్టి.. షారూఖ్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో ఈ చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నారు. కానీ అది సాకారం కాలేదు. తరువాత షారూఖ్ తన రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ధ్యాన్ చంద్ బ‌యోపిక్ హక్కులను కొనుగోలు చేసారు. చాలా కాలం క్రిత‌మే షారూఖ్  రైట్స్ ద‌క్కించుకున్నారు.  కానీ తెర మీద‌కు  మాత్రం తీసుకురాలేదు. ఆ  త‌ర్వాత కొంత కాలానికి  ఆ  హక్కులను మ‌రో నిర్మాత‌  రోనీ స్క్రూవాలాకు విక్రయించారు. కాగా రోనీ ఇప్పుడు ఈ బయోపిక్ ను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. భార‌త్ స్వ‌ర్ణం సాధించిన  ఉత్సాహంలో `ఉడ్తా పంజాబ్` ఫేమ్ అభిషేక్ చౌబే ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

ఇందులో ధ్యాన్ చంద్  పాత్రలో నటించడానికి స‌రైన న‌టుడి కోసం వెదుకుతున్న‌ట్లు తెలిసింది. ఈ పాత్ర 23 - 40 సంవత్సరాల మధ్య లో ఉండాలి. అంటే ఆ వ‌య‌సు మ‌ధ్య‌లో ఉన్న న‌టుడిని ఎంపిక  చేయాల్సి ఉంటుంది.  `యురి` ఫేం విక్కీ కౌశ‌ల్ ని ఎంపిక చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

సెట్స్ పై క్రీడా నేప‌థ్య సినిమాలు..

బ‌యోపిక్ ల వెల్ల‌వ‌లో క్రీడా బ‌యోపిక్ ల హ‌వా త‌గ్గ‌డం లేదు. నిజ జీవిత క‌థ‌ల‌తో పాటు ఫిక్ష‌నల్ క‌థాంశాల్ని క్రీడా నేప‌థ్యం జోడించి సినిమాలుగా తెర‌కెక్కించేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు హీరోలు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. అలా 2021 క్రీడా నేప‌థ్య సినిమాల‌దే హ‌వా. ఇప్ప‌టికే డ‌జ‌ను పైగానే స్పోర్ట్స్ నేప‌థ్య సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.

సౌత్ నుంచి నార్త్ కి వెళ్లి హ‌వా సాగిస్తున్న తాప్సీ ఒక‌దాని వెంట ఒక‌టిగా మూడు క్రీడా బ‌యోపిక్ కేట‌గిరీ చిత్రాల్లో న‌టిస్తోంది. మ‌హిళా క్రికెట‌ర్ మిథాలీరాజ్ బ‌యోపిక్ షాభాస్ మిత్తులో తాప్సీ టైటిల్ రోల్ పోషిస్తోంది. రాహుల్ దోలాఖియా ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. తాప్సీ ప్ర‌ధాన పాత్ర‌లో ర‌‌ష్మి రాకెట్ కూడా ఇంత‌కుముందు మొద‌లైంది. ఆకాష్ ఖురానా ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే ఇది చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఇవేగాక‌.. మ‌రిన్ని బ‌యోపిక్ లు సెట్స్ పై ఉన్నాయి.

బ్యాడ్మింట‌న్ స్టార్ సైనా నెహ్వాల్ బ‌యోపిక్ లో ప‌రిణీతి చోప్రా క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఆమోల్ గుప్తా ద‌ర్శ‌క‌త్వంలో ఇప్ప‌టికే ఈ చిత్రం మిడ్ వేలో ఉంది. జెర్సీ హిందీ రీమేక్- షాహిద్ క‌పూర్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తుండ‌గా తెలుగు వెర్ష‌న్ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి ఈ చిత్రాన్ని హిందీలోనూ తెర‌కెక్కిస్తున్నారు. జెర్సీకి రెండు జాతీయ అవార్డులు ద‌క్క‌గా రెట్టించిన ఉత్సాహంతో గౌత‌మ్ ప‌ని చేస్తున్నారు.

83 - క‌పిల్ దేవ్ బ‌యోపిక్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇందులో క‌పిల్ దేవ్ పాత్ర‌లో ర‌ణ‌వీర్ సింగ్ న‌టించ‌గా.. అత‌డి భార్యామ‌ణి దీపిక తెర‌పైనా భార్య‌గానే న‌టిస్తున్నారు. ఈ సినిమాకి దీపిక స‌హ‌నిర్మాత‌గా కొన‌సాగుతున్నారు. ఈపాటికే రిలీజ్ కావాల్సి ఉన్నా క‌రోనా లాక్ డౌన్ వ‌ల్ల వాయిదా ప‌డింది. ఫ‌ర్హాన్ అక్త‌ర్ తూఫాన్ అనే స్పోర్ట్స్ మూవీని ఇటీవ‌ల రిలీజ్  చేశారు. చెస్ గ్రాండ్ మాస్ట‌ర్ విశ్వ‌నాథ‌న్ ఆనంద్ బ‌యోపిక్ ని ఆనంద్ .ఎల్ రాయ్ తెర‌కెక్కించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. తుల‌సీదాస్ జూనియ‌ర్ అనే  క్రీడా నేప‌థ్య‌ చిత్రంలో సంజ‌య్ ద‌త్ న‌టిస్తున్నారు. అర్జున్ రెడ్డి  త‌మిళ‌ రీమేక్ `వర్మ`తో హీరోగా ప‌రిచ‌యం అయిన చియాన్ విక్ర‌మ్ వార‌సుడు ధ్రువ్ విక్రమ్ త‌దుప‌రి స్పోర్ట్స్ డ్రామాను లాక్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మారి సెల్వరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ధ్రువ్ విక్రమ్ కబడ్డీ ఆటగాడిగా న‌టిస్తున్నారు. బాలీవుడ్ యువ‌న‌టుడు కార్తీక్ ఆర్య‌న్ స్పోర్ట్స్ బ‌యోపిక్ ని లాక్ చేశార‌న్న‌ది తాజా స‌మాచారం.
Tags:    

Similar News