బాలయ్య వ్యాఖ్యలు నందమూరి అభిమానుల్లో చీలిక తెచ్చాయా..?

Update: 2021-06-11 15:30 GMT
జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ తాతకు తగ్గ మనవడు అని నందమూరి ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. తాత పోలికలు పునికి పుచ్చుకున్న తారక్.. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ కోసం 2009లో ఎన్నిక‌ల్లో ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అయితే ఆ ఎన్నిక‌ల్లో పార్టీ ఓట‌మి చెందిన తర్వాత.. ఎందుకో టీడీపీ అధిష్టానం ఆయన్ని దూరం పెడుతూ వచ్చింది. ఎన్టీఆర్ కూడా నెమ్మ‌దిగా పార్టీకి.. చంద్ర‌బాబు - బాల‌య్య‌ల‌కు దూరమవుతూ వచ్చారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని పరిణామాలతో నందమూరి అభిమానులు పైకి ఏమంతా ఒకటే అని చెప్తున్నా.. లోపల బాల‌య్య‌ - ఎన్టీఆర్ ఫ్యాన్స్ మ‌ధ్య అంత‌రం పెరుగుతూ వ‌చ్చింది.

ఇక 2019 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్లకు మాత్రమే పరిమితమై ఘోర పరాజయం చవిచూసింది. దీంతో టీడీపీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదని మెజారిటీ కార్యకర్తలు అభిమానులు అభిప్రాయానికి వచ్చేసారు. పార్టీని దారుణమైన స్థితి నుండి బయట పడేయడానికి జూ. ఎన్టీఆర్ ఆశాకిరణంగా మారతాడని వారు భావించారు. అప్పటి నుంచి తార‌క్ పార్టీలోకి రావాల‌న్న డిమాండ్ ఊపందుకుంది. భవిష్యత్ ‌లో ఎన్టీఆర్ సీఎం కావాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారని 'సీఎం సీఎం' అని నినాదాలు చేయడం.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చూస్తే అర్థం అవుతుంది.

అయితే ఎన్టీఆర్ పార్టీలో కీల‌కంగా వ్యవహరించడం బాబాయ్ బాల‌య్య కానీ.. టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు కు కానీ ఇష్టం లేన‌ట్లే క‌నిపిస్తోంది. తాజాగా బాలకృష్ణ ఓ ఇంట‌ర్వ్యూలో చేసిన వ్యాఖ్య‌లు పెద్ద దుమార‌మే రేపుతున్నాయి. జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన బాలయ్య చాలా సేపు ఆలోచించి గట్టిగా నవ్వుతూ.. రామారావు పేరు పెట్టుకున్న వారందరూ ఎన్టీఆర్ లు కాలేరనే అర్థం వచ్చేలా సమాధానం చెప్పారు. ‘అది ప్లస్ అవ్వచ్చు. మైనస్ అవ్వచ్చు. ప్లస్ అయ్యి మైనస్ అవ్వొచ్చు. మైనస్ అయ్యి ప్లస్ అవ్వొచ్చు’ అంటూ తనదైన బాలయ్య స్పందించారు.

దీనిని బట్టి జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో కీ రోల్ ప్లే చేయడం కానీ.. పగ్గాలు అప్పజెప్పడానికి బాబాయి బాలయ్య సిద్ధంగా లేరని అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు ఇదే నంద‌మూరి అభిమానుల్లో ఇప్పటి వరకు ఉన్న అంతరాన్ని అగాధంగా మారుస్తోంది. పెద్ద చిచ్చు రగిల్చి ఫ్యాన్స్ లో చీలిక తెచ్చే పరిస్థితి తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో సోష‌ల్ మీడియాలో నందమూరి అభిమానులు.. టీడీపీ - బాల‌య్య‌ - ఎన్టీఆర్ అంటూ మూడు వ‌ర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది.

తాజాగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో ట్విట్టర్ వేదికగా స్పేస్ క్రియేట్ చేసి మరీ అభిమానులు కామెంట్స్ చేసుకుంటున్నారు. కొందరు బాలయ్యకు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు జూ. ఎన్టీఆర్ పక్షాన నిలబడుతున్నారు. ఇంకొందరు ఇద్దరిలో ఎవరికి మద్దతు తెలపలేక సతమతమయ్యారు. మెజారిటీ వర్గం మాత్రం తెలుగు రాష్ట్రాలలో టీడీపీ పార్టీని గట్టెక్కించాలంటే జూనియర్ రావాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి రాబోయే రోజుల్లో ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి.
Tags:    

Similar News