'ఎఫ్ 3' టికెట్ రేట్ల విషయంలో క్లారిటీ ఇచ్చేసిన దిల్ రాజు!

Update: 2022-05-18 09:30 GMT
టాలీవుడ్ లో పెద్ద  హీరోలు .. పెద్ద సినిమాల దర్శక నిర్మాతలు టిక్కెట్ల రేట్లు పెంచక తప్పని పరిస్థితి అంటూ ఆ మధ్య  పెద్ద హడావిడి చేశారు. వాళ్ల సమస్యలను అర్థం చేసుకున్న ప్రభుత్వాలు సానుకూలంగానే స్పందించాయి. దాంతో సినిమాను బట్టి రేటు మారిపోవడం మొదలైంది. పెద్ద సినిమాల్లో కంటెంట్ ఉంటే పెంచిన టిక్కెట్ల వలన ఎంత లాభం ఉంటుందో, కంటెంట్ లేదని తెలిస్తే మాత్రం ఆ స్థాయిలోనే నష్టం ఉంటోంది. ఇంత రేట్లు మనవల్ల కాదని చెప్పేసి జనాలు ఓ మాదిరి  సినిమాల వంక చూడటమే మానేశారు.

ఇవాళ .. రేపు .. ఒక సినిమా థియేటర్స్ కి వచ్చిన నెలకి  ఓటీటీ లో వస్తుందనే విషయం పిల్లలకే బాగా తెలిసిపోయింది. ఒక్కనెల వెయిట్ చేస్తే అదే సినిమాను ఎన్ని సార్లంటే అన్ని సార్లు ఓటీటీలో చూడొచ్చని అప్పటి వరకూ వెయిట్  చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏదో ఒక ప్రత్యేకత .. విజువల్ వండర్ అనే టాక్ లేకపోతే జనాలు సినిమాలకి రావడం మానేశారు. దాంతో మీడియం బడ్జెట్ సినిమాలు థియేటర్లలోకి అడుగు పెట్టడానికి అవకాశం లేకుండా పోతోంది. ఈ పరిణామం ఆ తరహా సినిమా నిర్మాతలను మరింత కలవరపెడుతోంది.

ఈ సమస్య వలన ఇప్పుడు పబ్లిసిటీలో కొత్త అంశాన్ని జోడించవలసి వస్తోంది. ఓటీటీ వచ్చిన తరువాత తమ సినిమా థియేటర్లలో విడుదలవుతుందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవలసి వస్తోంది. అలాగే ఇప్పుడు మీడియం బడ్జెట్ సినిమా నిర్మాతలు, తమ సినిమాకి టికెట్ల రేటు పెంచడం లేదనే  విషయాన్ని ముందుగానే చెప్పవలసి వస్తోంది. ప్రమోషన్స్ లో ఆ విషయాన్ని హైలైట్  చేయవలసి వస్తోంది. ఈ విషయాన్ని  చెప్పడానికి  దిల్ రాజు వంటి నిర్మాతలు  స్పెషల్ వీడియోలు చేయిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు.

దిల్ రాజు .. అనిల్ రావిపూడి .. సునయన మధ్య చిన్న డ్రామాను ప్లే చేసి, 'ఎఫ్ 3' సినిమాకి టిక్కెట్ల రేటు పెంచడం లేదనీ, గవర్నమెంటు నిర్ణయించిన రేటుకే అమ్మడం జరుగుతుందనే ఒక హామీని దిల్ రాజుతో ఇప్పించారు. ఈ వీడియోతో తాము అనుకున్న క్లారిటీని పక్కాగా ఇవ్వగలిగారు.

ఇక నిన్న 'శేఖర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను జీవిత టికెట్ల రేటు విషయాన్ని గురించి ప్రస్తావించారు. తమ సినిమా టిక్కెట్ల రేటును పెంచడం లేదనీ, అందరికీ అందుబాటులో  రేట్లు ఉంటాయని స్పష్టం చేశారు. అందని ద్రాక్ష పులుపు అన్నట్టుగా థియేటర్లకు దూరమైన  ప్రేక్షకులను, వెతికి పట్టుకొచ్చే  పనిలో పడ్డారు. ఆడియన్స్ అలకమానుకుని ఇటువైపు ఒక అడుగు వేస్తారో, లేదంటే దిగిరాము .. దిగిరాము థియేటర్లకు   అంటారో చూడాలి.

Full View


Tags:    

Similar News