40 రూపాయల నుంచి 40 కోట్ల దాకా!

Update: 2018-08-20 07:30 GMT
టాలీవుడ్ లోనే కాదు ఏ బాషలోనైనా సినిమా వాళ్ళ విజయ గాధల వెనుక ఆసక్తి రేపే కథలు ఉంటాయి. అదే పనిగా వాటి గురించి తెలుసుకునే అవకాశం రాకపోవచ్చు కానీ టైం వచ్చినప్పుడు మాత్రం అవే బయటపడి ఆశ్చర్యానికి గురిచేస్తాయి. నిన్న జరిగిన గీత గోవిందం సక్సెస్ మీట్ అలాంటి వాటికి వేదికగా మారింది. నిర్మాత బన్నీ వాస్ గురించి దిల్ రాజు చెప్పిన సంగతుల్లో అలాంటి జ్ఞాపకమే ఒకటి బయటి ప్రపంచానికి తెలిసింది. ఆర్య తీసిన టైంలో దిల్ రాజు దగ్గరికి  బన్నీ వాస్ పాలకొల్లు సెంటర్ రైట్స్ కావాలని వచ్చాడట. ఒక్కటే ఎందుకు మొత్తం వెస్ట్ గోదావరి తీసుకోమని ప్రోత్సహిస్తే తన దగ్గర జేబులో ఉన్న 40 రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చి ఇప్పుడు తన స్థాయికి చేరుకున్నాడని ఆనందం వ్యక్తం చేస్తూ దిల్ రాజు చెప్పడం వాస్ ని ఆనందంతో పాటు ఆశ్చర్యంలో ముంచెత్తింది. అంత పాత సంఘటనను గుర్తు పెట్టుకోవడం అంటే విశేషమే.

నిజంగానే దిల్ రాజు చెప్పినట్టు 40 రూపాయల అడ్వాన్స్ తో మొదలైన వాస్ ప్రయాణం ఇప్పుడు గీత గోవిందంతో 40 కోట్లు దాటే రేంజ్ దాకా వచ్చింది అంటే చిన్న విషయం కాదుగా. నిర్మాతగా తన పేరు టైటిల్స్ లో పడటం ఇదే మొదటి సారి కానప్పటికీ భారీ బ్లాక్ బస్టర్ అందుకోవడం వల్ల ఇప్పుడు బన్నీ వాస్ పేరు అంతటా మారుమ్రోగిపోతోంది. చిరంజీవి సైతం వాస్ గురించి కథల విషయంలో అతని జడ్జ్ మెంట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. దిల్ రాజుకు 40 రూపాయల అడ్వాన్స్ ఇచ్చిన వాస్ ఇప్పుడు ఆయన సినిమాకే పోటీగా వెళ్లి గెలిచే రేంజ్ కు చేరుకున్నాడు. త్వరలోనే పరశురామ్ తో మరో సినిమా ఉంటుంది అని చెబుతున్న బన్నీ వాస్ త్వరలో భారీ సినిమాలను కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. నిన్న అల్లు అరవింద్ మొదలుకుని హీరో విజయ్ దేవరకొండ దాకా ప్రతి ఒక్కరు బన్నీ వాస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం ఆయన పేరుని ప్రేక్షకులకు మరింత చేరువ చేసిందన్నది నిజం.
Tags:    

Similar News